నిర్దేశం, హైదరాబాద్: నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో సికింద్రాబాద్ లోని ఓ లాడ్జీలో, అలానే రాంగోపాల్ పేట లోని ఓ భవనంలో ఘోర అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. తాజాగా కూకట్ పల్లి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కెపీహెచ్ బీ ఫేజ్ 3లోని ఎల్ఐజీ భవనంలోని 16/11,12 ప్లాట్స్ లో ఈ ప్రమాదం జరిగింది. రెండు ప్లాట్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షణ్ముఖ పవన్ అనే వ్యక్తి ఈ ప్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. ఆ రెండు ప్లాట్స్ లో సెల్ ఫోన్లలను నిల్వ చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నాం సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే జనాలు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.
తొలుత ఓ ప్లాట్ లో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంగా పెరిగి రెండో ఫ్లాట్ కి వ్యాపించాయి. మంటలు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్నపోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొంత సమయం శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆ ఫ్లాట్స్ లో ఉన్న సెల్ ఫోన్లు వాటికి సంభందించిన బ్యాటరీలు అన్నీ పూర్తిగా బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.