తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న ‘ఆడవారి సున్తీ‘

– ఆడవారిపై నేటికీ కొనసాగుతున్న దుర్మార్గపు ఆచారం
– భారతదేశం, సింగపూర్, అమెరికా దేశాల్లో కూడా ఉంది
– 2012 నాటి ఐరాస తీర్మానం కాగితాలకే పరిమితం

నిర్దేశం: సాధారణంగా పురుషులకు సున్తీ చేస్తారు, కానీ ఆడవారికి కూడా సున్తీ చేస్తారని ఎంత మందికి తెలుసు? ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్న మహిళలు ఈ బాధాకరమైన ప్రక్రియకు బాధితులు అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 కోట్ల మంది బాలికలు, మహిళలపై సున్తీ వంటి క్రూరత్వం జరిగింది. వీరిలో చాలా మంది బాలికలు 15 ఏళ్ల లోపు వారే. ఈ పని ప్రపంచవ్యాప్తంగా చట్టవిరుద్ధం, కానీ ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది. ఈ ప్రక్రియ మన దేశంలో కూడా కొనసాగుతోంది. ఇంతటి ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పనికిమాలిన ఆచారం కొనసాగడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. అయినప్పటికీ, ఆచారాల పేరున ఈ పద్దతిని కొన్ని దేశాలు వదులుకోవడం లేదు.

స్త్రీ సున్తీ అంటే ఏమిటి?
దీనిని ‘ఖాఫ్జ్’ లేదా ‘ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్’ అని అంటారు. అంటే, జననేంద్రియాలలో కొంత భాగాన్ని కత్తిరించడం. కొన్ని సమాజాలలో ప్రబలంగా ఉన్న శతాబ్దాల నాటి ఆచారం ఇది. ఇలా చేసే అమ్మాయిల లైంగిక స్వచ్ఛత, విధేయత, వారి లైంగిక కోరికలపై నియంత్రణ ఉంటుందని భావిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ అనేది “వైద్యేతర కారణాల వల్ల లేదా స్త్రీ జననేంద్రియ అవయవాలకు ఇతర గాయం కారణంగా స్త్రీ బాహ్య జననేంద్రియాలను పాక్షికంగా లేదా మొత్తంగా తొలగించడం వంటివని చెప్తుంది. వాస్తవానికి దీనిని ‘మానవ హక్కుల ఉల్లంఘన’గా ఐరాస పరిగణిస్తోంది. డిసెంబర్ 2012లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచవ్యాప్తంగా ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ ని నిషేధించాలని ప్రతిజ్ఞ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

యువత, మైనర్ బాలికలపై ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను తరచుగా గుండు బ్లేడ్‌ల వంటి పదునైన ఆయుధాలతో సంఘం సభ్యులు నిర్వహిస్తారు. ఈ పద్ధతిని ఎదుర్కొన్న ఈజిప్టుకు చెందిన ఓమ్నియా ఇబ్రహీం తన డాక్యుమెంటరీలో ఒకదానిలో సున్తీని ఎదుర్కొనే మహిళలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు చాలా మంది స్త్రీలను జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. స్త్రీల లైంగిక వాంఛలను పాపంగా భావించే సమాజాల్లో ఈ ఆచారం ఎక్కువగా ఉందని ఆమె అన్నారు.

స్త్రీలకు సున్తీ చేసే విధానం ఏ దేశాల్లో కొనసాగుతోంది?
ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 30 దేశాలలో స్త్రీ సున్తీ ఆచారం ఇప్పటికీ అమలులో ఉంది. ఒక నివేదిక ప్రకారం.. ఆఫ్రికన్ దేశాలలో 140 మిలియన్లకు పైగా ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ కేసులు ఉన్నాయి. దీని తరువాత ఆసియాలో 8 కోట్లకు పైగా కేసులు, పశ్చిమాసియాలో సుమారు 6 కోట్ల కేసులు ఉన్నాయి. లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు, పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో నివసిస్తున్న వలస జనాభాలో కూడా ఈ ఆచారం ప్రబలంగా ఉంది.

ఇండియాలో స్త్రీ సున్తీ
బోహ్రా ముస్లిం సమాజంలో (దావూదీ బోహ్రా, సులేమాని బోహ్రా) ఆడ వారికి కూడా సున్తీ చేసే ఆచారం ఇప్పటికీ ప్రబలంగా ఉంది. భారతదేశంలో బోహ్రా జనాభా సాధారణంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తున్నారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ సమాజం చాలా సంపన్నమైనది. దావూదీ బోహ్రా కమ్యూనిటీ భారతదేశంలోని అత్యంత విద్యావంతులైన సమాజాలలో ఒకటి. అయితే ఈ కమ్యూనిటీలో ఇంతటి కిరాతక ఆచారం ప్రభలంగా కొనసాగడం శోచనీయం.

యూనిసెఫ్ ప్రకారం.. సోమాలియా, గినియా, జిబౌటీలలో స్త్రీ జననేంద్రియాలను కత్తిరించడం ఇప్పటికీ గొప్ప ఆచారం. అక్కడి జనాభాలో 90 శాతం మందిపై ఈ చర్య జరుగుతూ ఉంది. స్త్రీ సున్తీని కొనసాగిస్తున్న 92 దేశాలలో సగానికి పైగా గత కొన్ని సంవత్సరాలలో దీనిని నిషేధించినప్పటికీ, దీనిని కొనసాగించే వారి సంఖ్య ఇప్పటికీ చాలా పెద్దగానే ఉంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »