నిజామాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన పసుపు
గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని రైతుల ఆందోళన
500 తగ్గించి కొనుగోలుకు వ్యాపారుల మెలిక
చేసేది లేక ఆమోదించిన రైతులు
నిజామాబాద్, నిర్దేశం:
నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ ముట్టడిరచి అక్కడి నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. బస్టాండ్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. దీంతో.. నిన్న పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వ్యాపారులు రైతులతో జరిపిన చర్చల ముగిశాయి. కటాఫ్‌కు 500 ధర తగ్గిస్తే పసుపు యథావిధిగా కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చిచెప్పడంతో చేసేదేవిూ లేక రైతులు ఒప్పుకున్నారు. దీంతో.. క్వింటాకు 500 ధర తగ్గిస్తూ, క్వింటాల్ పసుపు 9500 రూపాయలకు కొనుగోలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ యార్డుకు పసుపు రైతులు పోటెత్తారు. పసుపు కొనుగోళ్లపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభం నుంచి క్వింటాల్‌కు 2 వేలకు పైగా ధర పతనం అయ్యిందని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18000 వరకు ధర పలుకగా.. ఈసారి రూ. 10వేల లోపు కనీస ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత వంకతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ చైర్మన్ చెబుతుండటంపై రైతులు తప్పు పట్టారు. వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులు కుమ్మక్కయ్యారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు. వరుసగా రెండోరోజూ మంగళవారం ఆందోళనకు దిగారు. పసుపు బోర్డు వచ్చినా లాభం లేకుండా పోయిందని అన్నారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని, పసుపు బోర్డు పేరుతో దగా చేస్తున్నారని నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు ధర్నాను విరమించబోమని మొండికేశారు.నిజామాబాద్ మార్కెట్ యార్డ్ మొత్తం దళారులు, వ్యాపారుల చేతిలో ఉందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు నిర్ణయిస్తున్నారని, మార్కెట్లో వచ్చిన పసుపునకు నాణ్యత లేదని వంక చూపుతూ రైతును నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు పసుపు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా పసుపు కొనడం లేదని ఆరోపించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన రేటుకు పసుపు విక్రయించి కన్నీటితో తిరిగి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో వందల కుప్పల పసుపు ఉన్నప్పటికీ కేవలం ఒకటి, రెండు కుప్పలను పరిశీలిస్తున్నారని, పూర్తిస్థాయిలో పసుపు పరిశీలించకుండానే నాణ్యత లేదని వంకతో కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదని అన్నారు.