మళ్లీ సిద్ధార్థ సంస్థలకు దేవాదాయ భూములు
పని చేసిన కులం కార్డు
విజయవాడ, నిర్దేశం:
ఏపీలో లీజుల మాటున అన్యాక్రాంతమవుతున్న దేవుడి ఆస్తుల్ని వాటి అనుభవదారులకే కట్టబెట్టేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా ఆ శాఖ వాటిని కాపాడే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లీజుల్ని పొడిగిస్తే అవి ఎప్పటికీ దేవుళ్లకు దక్కవని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదుఇటీవల విజయవాడలో ప్రముఖ విద్యా సంస్థలకు దేవాదాయ శాఖ భూమి లీజును పొడిగించే అంశం వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున వందల కోట్ల ఖరీదు చేసే దుర్గగుడి ఆలయ భూముల్ని నామమాత్రపు ధరతో 50ఏళ్ళ పాటు లీజుకు ఇచ్చే ప్రతిపాదనల్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు.వ్యాప్తంగా దేవాదాయ శాఖకు ఉన్న భూములపై సమగ్రంగా సర్వే జరిపించడంతో పాటు కొత్త లీజుల్ని పొడిగించడానికి సర్వే చేపట్టాలని ఆదేశించినా ఫలితం లేకపోయింది. బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చెందిన విలువైన భూముల్ని లీజుకు ఇవ్వడానికి ఏకంగా నిబంధనల్ని సవరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. న్యాయపరమైన అభ్యంతరాలు తోసిపుచ్చి జారీ చేసిన జీవో చర్చనీయాంశంగా మారింది.ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న వేల ఎకరాల భూముల్లో విలువైన భూములన్నీ రాజకీయ నేతల సిఫార్సులతో కూడిన లీజుల్లోనే ఉన్నాయి. వీటిపై నామ మాత్రపు ఆదాయం మాత్రమే సమకూరుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 139 వివాదాస్పదం అవుతోంది. దేవాదాయ శాఖలో ప్రస్తుతం పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఐఏఎస్ అధికారులు విధులు నిర్వర్తించాల్సిన శాఖలో దుర్గగుడి ఈవోకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.ఈ క్రమంలో ఏప్రిల్ 17న దేవాదాయ శాఖ ఇంఛార్జి కమిషనర్ హోదాలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ సంస్థల స్థిరాస్తుల లైసెన్స్ నిబంధనలు 2003లో మార్పుల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థలకు భూముల్ని కేటాయించే విషయంలో నిబంధనల్ని సడలించాలని ఆ లేఖల పేర్కొన్నారు.
ఇంఛార్జి కమిషనర్ లేఖపై ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోని వ్యవసాయేతర భూముల లీజుల నిబంధనల్ని సడలిస్తూ జీవో జారీ చేశారు. దేవాదాయ భూముల లీజుల్లో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసేలా సబ్ క్లాజ్‌లను చేర్చారు.దీని ప్రకారం ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ మత సంస్థల చట్టం 1987 సెక్షన్ 2(5) ప్రకారం గుర్తించిన ప్రముఖ సంస్థలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, లాభాపేక్షరహితంగా సేవా కార్యక్రమాలను 20ఏళ్లకు పైబడి నిర్వహిస్తుంటే వారికి లీజుల్ని పొడిగించడం, బహిరంగ వేలం లేకుండానే భూముల్ని కేటాయించడం, నామమాత్రపు ధరకు భూముల్ని కేటాయిస్తారు. అయా సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను సజావుగా కొనసాగించేందుకు ఈ నిబంధనలు చేరుస్తున్నట్టు జీవో దేవాదాయ శాఖ పేర్కొంది.దేవాదాయ శాఖ జారీ చేసిన జీవో నంబర్139 కొన్ని సంస్థలకు లబ్ది చేకూర్చడానికేనని అనుమానాలు ఉన్నాయి. విజయవాడలో ప్రముఖ విద్యా సంస్థ యాభై ఏళ్లుగా దుర్గగుడి భూముల్ని లీజుకు తీసుకుంది. మరో యాభై ఏళ్లకు లీజుకు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని దేవాదాయ శాఖ లీగల్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది.వందేళ్లకు పైబడిలీజులో ఉంటే అయా సంస్థలకే యాజమాన్య హక్కులు లభిస్తాయని, దేవాదాయ శాఖ నష్టపోతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. లీజు ముగియడంతో వాటిని 7ఏళ్ల లోపు గడువుతోనే కొత్త లీజులు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. పాత లీజుల్ని రద్దు చేయకుండా కొనసాగించుకుంటూ వెళ్లడం భూములపై ప్రభుత్వమే యాజమాన్య హక్కుల్ని వదులుకున్నట్టు అవుతుందని హెచ్చరించారు.ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ మధ్య లేఖలు నడిచినట్టు తెలుస్తోంది. అనూహ్యంగా కమిషనర్ నిబంధనల్లో సవరణలు చేయాలని కోరిన పదిహేను రోజుల్లోనే జీవో వెలువడటం వెనుక ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.