క్యూనెట్‌ వలలో చిక్కుకోవద్దు యువతకు ఆర్టీసీ ఎండీ సూచన

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో

క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి

దుర్మార్గపు సంస్థ క్యూనెట్‌ వలలో చిక్కుకోవద్దు

యువతకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ సూచన

హైదరాబాద్, మార్చి 18 : సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలని చెప్పారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తోన్న ఆరుగురు యువతీయువకులు మరణించడంపై సజ్జనర్‌ స్పందించారు.

”స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తాం.” అని సజ్జనర్‌ అన్నారు.

భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్‌ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందన్నారు. క్యూనెట్‌ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్‌ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్‌ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు.

దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. క్యూనెట్‌ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50-3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత క్యూనెట్‌ పై అనేక కేసులు నమోదు చేసిన, ఈడీ ఆస్తులను జప్తు చేసిన దాని తీరు మారడం లేదన్నారు.

”యువతీయువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్‌ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి.” అని సజ్జనర్‌ సూచించారు.

మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఆ సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒక్కటికి ఒక్కటికి రెండు సార్లు నిర్ధారించుకుని అద్దెకివ్వాలని సూచించారు. అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని సజ్జనర్‌ హితవు పలికారు.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!