ఇంతకు బీఆర్ ఎస్ కు భవిష్యత్ ఉందా..?

బీఆర్ ఎస్ భవిష్యత్ ఏమిటి..?

  • లోక్ సభ ఎన్నికలలో అడ్రసు గల్లంతు..
  • ఫలితాలపై నోరు విప్పని అగ్ర నేతలు..

నిర్దేశం, హైదరాబాద్ :

బీఆర్ ఎస్ భవిష్యత్ ఏమిటి..? అనే ప్రశ్నకు శూన్యం కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యహరించిన కేసీఆర్ ను ప్రజలు ఛీ కొట్టారు. పదేళ్లు పరిపాలన చేసిన అతను లోక్ సభ ఎన్నికలలో 10 – 12 ఎంపీ సీట్లు సాధిస్తున్నామని, సైలెన్స్ ఓట్లు పడుతున్నట్లు ప్రకటించారు.

కేంద్రంలో తామే కీలకంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. తీరా లోక్ సభ ఎన్నికలలో జీరో ఫలితాలు రావడంతో కేసీఆర్ ఆజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. పార్టీ వాయిస్ ను చెప్పడానికి కూడా ఆ పార్టీ పెద్దలు ముందుకు రాలేరు.

బీఆర్ ఎస్ అడ్రసు గల్లంతేనా..?

రాష్ట్రంలో బీఆర్ ఎస్ అడ్రసు గల్లంతేనా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పదేళ్లు అహంకారంతో పాలన చేసిన కేసీఆర్ కు టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చడంతోనే శని పట్టుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధాని పదవిపై కన్ను వేసిన కేసీఆర్ దేశంలోనే తనకు తిరుగులేదని ప్రకటించి టీఆర్ ఎస్ ను జాతీయ పార్టీగా బీఆర్ఎస్ నామకరణం చేశారు.

అదే జోష్ తో ఢిల్లీతో పాటు మహారాష్ట్రలో బహిరంగ సభలు ఏర్పటు చేసి దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. సొంత రాష్ట్రంలోనే పార్టీ ఉనికి కొల్పోవడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మీడియా ముందుకు రాలేక పోయారు.

బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓట్లు..

లోక్ సభ ఎన్నికలలో బీఆర్ ఎస్ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాకు పరిమితమైన బీఆర్ ఎస్ లోక్ సభ ఎన్నికలలో ఉనికిని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయినా.. జీరో ఫలితాలు రావడంతో కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఆరు నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు 16.68 శాతం ఓట్లు మాత్రమ వచ్చాయి. అంటే ఐదు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు 21 శాతం పక్క పార్టీలకు వెళ్లిపోయాయి. అందులో కొంత కాంగ్రెస్.. అత్యధికంగా  బీజేపీ పొందాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ శరవేగంగా  కరిగిపోతోంది. ఆ బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం  బీఆర్ఎస్‌కు బలమైన ఓటు బ్యాంక్ లేకపోవడమే అనుకోవచ్చు.

రాజకీయ పార్టీ బలంగా ఉంది అని చెప్పుకోవాలంటే అందరూ చూసే ఒకే ఒక్క పాయింట్  ఆ పార్టీకి ఎంత ఓటు షేర్ ఉంది అనే. ఈ ఓటు షేర్ అనేది రాజకీయ వ్యవహారిక భాషలో ఓటు బ్యాంక్ అని చెప్పుకోవచ్చు.

బీఆర్ఎస్ ఓటు బ్యాంక్..?

తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా  కేసీఆర్  రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది చూసుకోలేదు.. కారు గుర్తు ఉంటే చాలు ఓటేశారు. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్.. తెలంగాణ సెంటిమెంట్ గుండె నిండా నింపుకున్నవారే. తెలంగాణ సాధనే లక్ష్యం అనుకున్న తర్వాత.. లక్ష్యం చేధించిన తర్వాత ఇక సెంటిమెంట్ ఉంటుందనుకోవడం అత్యాశే.

అయితే కేసీఆర్ తనదైన రాజకీయంతో పదేళ్ల  పాటు నెట్టుకు రాగలిగారు. ఈ పదేళ్లలో ఆయన తెలంగాణ సెంటిమెంట్ కు అతీతమైన ఓటు బ్యాంక్‌ను సృష్టించుకోవడంలో విఫలమయ్యారు. మారుతున్న రాజకీయాలను విశ్లేషిస్తే బీఆర్ ఎస్ భవిష్యత్ ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పండితులు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!