రంగంలోకి డీకే.. అంతా ఓకే
- శివకుమార్ కనుసన్నల్లోనే..
- ఓట్ల లెక్కింపు వేళ కాంగ్రెస్ అప్రమత్తం
- గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీ వ్యూహం
- రిజల్ట్ రాగానే క్యాంపునకు తరలింపు
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్‌వైపే సూచిస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ .. గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా చూసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైకమాండ్ రంగంలోకి దింపింది.
కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని.. కొన్ని సంస్థలు వెల్లడించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది. అధిష్టానం ఆదేశాలతో డీకే శనివారం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ఫలితాల మానిటరింగ్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
రెండు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్న డీకే…
ఫలితాల తర్వాత అభ్యర్థులు చేజారిపోకుండా చర్యలు చేపడుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య బొటాబొటీ ఫలితాలు వస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను బెంగుళూరు శివారులోని క్యాంపునకు తరలించేలా డీకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానాల్లో, లేదంటే ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించనున్నారు.
కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతున్నారని డీకే శివ కుమార్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ సమాచారం మాకు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం డీకేకు బాధ్యతలు అప్పగించింది. గెలుపు అవకాశాలున్న నేతలకు డీకే ఫోన్ చేసి టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇలా పకడ్బందీ ఏర్పాట్లతో అభ్యర్థులు చేజారిపోకుండా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తానని డీకే శివకుమార్ చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్ ఉందని తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పవర్‌లోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులంటూ డీకే పేర్కొన్నారు.
- వయ్యామ్మెస్ ఉదయశ్రీ