మేడిపండు అందరికి తెలిసే ఉంటుంది. లోపల గుజ్జు ఉండదు కానీ, బయటికి నిగనిగలాడుతుంది. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ అనేది అచ్చం అలాంటిదే. అసలే ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు అంతంత మాత్రమే అంటే, ఆ ఉద్యోగాలను కూడా సరిగా భర్తీ చేయడం లేదు. ఏదో కారణం చెప్పి ఖాళీలు పెట్టేస్తారు. అయితే వాటిని జనరల్ కోటాకు మార్చడమో, కుదరకపోతే అలాగే ఖాళీగా ఉంచడమో జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీనే కాదు.. ఓబీసీ రిజర్వేషన్ పరిస్థితి కూడా ఇదే. మీకు అంత డౌటనుమానంగా ఉంటే ఐఐటీ, ఐఐఎం లాంటి వాటిల్లో స్వయంగా ప్రభుత్వమే వెల్లడించిన డేటా చూస్తే తెలుస్తుంది. మరి రిజర్వేషన్ల అమలు పక్కన పెట్టి అందులో క్రీమిలేయర్ పెట్టాలంటూ సుప్రీం తీర్పు చెప్పడమేంటి?
రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటు కాదు..
రిజర్వేషన్ అనేది ఆర్థిక చేయూత కోసమనే అపవాదు చాలా మందికి ఉంటుంది. కానీ, రిజర్వేషన్ ఎవరికి ఇచ్చారనే విషయం గమనిస్తే దాని ఉద్దేశం అర్థం అవుతుంది. భారతీయ సమాజంలో ధనవంతులు, పేదవారు అనే తేడాలు లేవని చెప్పను. కానీ, ఇక్కడి అసలు సమస్య ఎక్కువ కులం, తక్కువ కులం అని. ఈ దేశంలోని 80% జనాభా చదువుకు, గౌరవానికి, అవకాశానికి, అధికారానికి దూరంగా ఉండడానికి కారణం తెలివి లేకనో, చదువు రాకనో, డబ్బు లేకనో కాదు. కేవలం తక్కువ కులం అనే ప్రాతిపదికన. ఒక ఉదాహరణ తీసుకుంటే.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని ఓసారి గుడిలోకి రానీయకుండా అడ్డుకున్నది కులమా? డబ్బా? అనే దాంట్లో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. రిజర్వేషన్ వల్ల వివక్ష పోలేదు, పీడన పోలేదు. రిజర్వేషన్ అనేది డబ్బులు సంపాదించేది కాదు. కులం ఆధారంగా పక్కకు పెట్టిన వర్గాలకు ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో వారి ప్రాతినిధ్యం కోసం రూపొందించిన ప్రత్యేక ఏర్పాటు.
రిజర్వేషన్ వల్ల కుబేరులు కాలేదు
రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏళ్లు అయింది. అప్పటి నుంచి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. చాలా మంది రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు సంపాదించారు. మరి ఎంత మంది కుబేరులు అయ్యారు? దేశ కుబేరుల జాబితా తీయండి. అంతా ఓసీ కేటగిరీకి చెందినవారే ఉంటారు. రిజర్వేషన్ అనేది ఫస్ట్ ఎయిడ్ లాంటిదని రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటు కాదు, సామాజిక వెనుకబాటని స్ఫష్టమే కదా.
సరే, రిజర్వేషన్లను సామాజిక ప్రాతిపదికన కాదు, ఆర్థిక ప్రాతిపదికనే అని కాసేపు అనుకుందాం. ఎస్టీ, ఎస్టీలు పొందుతున్న లబ్ది దేశ సంపదలో ఎంత? సరిగ్గా లెక్కిస్తే.. చిన్నపిల్లాడికి ఇచ్చే చాక్లెట్ అంత కూడా కాదు. దేశంలోని సగం సంపద కేవలం ఒక శాతం వద్ద ఉంది. మళ్లీ వారికే లక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం, రాయితీలు ఇవ్వడం, వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడం ఎందుకు? వేలు, లక్షల కోట్లు సంపాదించేవారిని పక్కన పెట్టి.. సొంతిల్లు ఉందనో, టూ వీలర్ ఉందనో వారిని ధనికులుగా చూసి రిజర్వేషన్ తొలగిస్తామనడం ఎంత వరకు సమంజసం?
తీర్పులో ఇద్దరు పెరిగితే చెల్లుతుందా?
2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి బిల్లు పెట్టారు. అసెంబ్లీ ఆమోదం కూడా పొందింది. అయితే 2004లో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం కొట్టివేస్తూ ఎస్సీ కేటగిరీలో కొన్ని కులాలను చేర్చడానికి, తీసివేయడానికి మాత్రమే రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. కానీ, రిజర్వేషన్ల రూపు మార్చే అధికారం ఇవ్వలేదని తీర్పు చెప్పింది. ఇక 2020లో ఇదే సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వం కూడా దాదాపుగా ఇలాంటి బిల్లు తీసుకువస్తే.. రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. రెండుమార్లు సుప్రీంకోర్టే, రెండుసార్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనమే. అందుకే ఈసారి ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు విచారణకు వచ్చింది. తాజాగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం కులగణన చేసి వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంచుతామన్న బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు నిలిపివేస్తే.. ఇదే సుప్రీంకోర్టు ఆ తీర్పును రిజర్వు చేసింది. 80 శాతం కులాల రిజర్వేషన్ ను పెంచాలన్నప్పుడు 50 శాతానికి మించి రిజర్వేషన్ పెంచడం కుదరదని ఇదే కోర్టు అడ్డుకున్నది. చిత్రంగా.. ఇదే సుప్రీంకోర్టు అగ్రకులాల కోసం ఏర్పాటు చేసిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అడ్డుకోలేదు. ఇదే కోర్టు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమిలేయర్ అంటోంది. న్యాయవ్యవస్థ తీర్పులో ఇంత అయోమయం దేనికి సంకేతం? కింది కులాల విషయాల్లో కోర్టు తరుచూ విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. చాలా పెద్ద ఉద్యమాలు వస్తే కానీ, వారికి అనుకూలంగా తీర్పులు వచ్చిన సందర్భాలు లేవు. ఒక్కమాట చెప్పాలంటే.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల్లో ఓసీ కులస్తులే 80 శాతం ఉంటారు. ఎస్సీల్లోనే కొన్ని ఉపకులాలకు ప్రాతినిధ్యం దక్కలేదన్న కోర్టుకు తమ సొంత న్యాయవ్యవస్థలోనే 80 శాతం ప్రజల రిప్రజెంటేషన్ లేదనే వాస్తవం ఎందుకు గుర్తుకు రాలేదు? వారి సామాజిక పరిస్థితిని పక్కన పెడితే, ఆర్థికంగా వెనుకబడ్డదీ వారే. మరి క్రీమిలేయర్ కోర్టుల్లో పెట్టి వారికెందుకు అవకాశం కల్పించాలని అనుకోరు?
నిజానికి, దేశం మొత్తం ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల వాటా ప్రస్తుతం 10 శాతం. ఒక్కో రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ పోతున్నారు. ఇక ఉన్న ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వాటా 15 శాతం. అంటే మొత్తం ఉద్యోగాల్లో 1.5 శాతం. పోనీ ఇవ్వన్న ఇస్తున్నారా అంటే, అంతటా ఖాళీలే. కారణాలు ఏవేవో చెప్తారు. ఇక వీరి అభ్యున్నతి పేరు మీద బడ్జెట్ లలో పెట్టే నిధుల పరిస్థితి అంతే. బడ్జెట్ ప్రసంగంలో వీరికింత, వారికంత అంటారు. కానీ, చివరికి ఏ ఔటర్ రింగు రోడ్డుకో, పసుపు కుంకుమ పథకానికో పోతున్నాయి. ఈ కేటగిరైజేన్, రిజర్వేషన్ పుస్తకాల్లో కనిపిస్తుందే కానీ, అమలులో పత్తాలేదు. రిజర్వేషన్లలో ఉన్న క్రీం అంతా తీసేసి క్రీమిలేయర్ పెట్టడం ఎంతటి వికృత సామాజిక న్యాయం?
– టోనీ బెక్కల్,
సీనియర్ జర్నలిస్ట్