పార్టీలో మార్పు కాదు, పార్టీనే మార్చేసిన కమ్యూనిస్టులు

నిర్దేశం, హైదరాబాద్: కాలానికి అనుగుణంగా కమ్యూనిస్టుటు మారడం లేదు. ఆధునికతకు అరవై మైళ్ల దూరంలో ఉన్నారు. పాత పద్దతిలో పడికట్టు విధానంలోనే కొట్టుకుపోతున్నారు. పార్టీని నెట్టుకు వస్తున్నారు. చాలా కాలంగా ఇలాంటి విమర్శలు కమ్యూనిస్ట్ పార్టీపై ఉన్నాయి. అందుకే కమ్యూనిస్టులు బీభత్సమైన మార్పుకు సిద్ధమయ్యారు. ఎంతలా అంటే.. పార్టీలో మార్పులు తెమ్మంటే ఏకంగా పార్టీనే మార్చేశారు. పార్టీ మూల సిద్ధాంతమైన హేతువాదం, నాస్తికత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి, ఇక నుంచి ఆర్ఎస్ఎస్ లాగ దైవ చింతనలో తరించిపోనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల్లో పెద్దన్న అయిన సీపీఎం పార్టీ తీసుకున్న నిర్ణయమిది.

దైవ చింతనలో కమ్యూనిస్ట్ లు

మతవిశ్వాసం కలిగినవారితోనూ కలిసి పనిచేయాలనీ, వారిని క్రమంగా పార్టీ నిర్మాణంలోకి తెచ్చుకోవాలంటూ.. సీపీఐ (ఎం) అగ్రనాయకత్వం రాజకీయ తీర్మాన ముసాయిదా పత్రాన్ని సిద్ధం చేసింది. ఆ పత్రంలో ‘‘మతాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టు భావజాలంలోని ఒక ముఖ్యమైన భాగం. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు అవసరమని భావిస్తున్నాం. మతవిశ్వాసాలు కలిగినవారితో కలిసి పనిచేస్తూ, వారిని పార్టీ వైపు తీసుకురావడం అవసరం’’ అని ఆ పత్రంలో పేర్కొన్నారు. తదుపరి రాజకీయాలకు ఆదర్శంగా ఆర్ఎస్ఎస్ ను చూపించడం గమనార్హం. అంటే, ఆర్ఎస్ఎస్ ఎలా అయితే మత విశ్వాసుల్లోకి ఎలా చొచ్చుకు వెళ్లిందో, అలా తాము కూడా వెళ్లాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారన్నమాట. అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పంచాంగం చూశారో లేదో తెలియదు.

పురోగమనంలో ఈ తిరోగమనం ఏంటి?

వాస్తవానికి ప్రపంచంలో నాస్తికుల జనాభా పెరుగుతోంది. మత విశ్వాసుల్లో కూడా రేషనాలిటీ పెరుగుతోంది. ఒకప్పటిగా మంత్ర-తంత్రాలకు చింతకాయలు కాదు కదా.. చిగురుటాకులు కూడా రాలడం లేదు. శాస్త్రీయ విజ్ణానం బాగా పెరిగిపోయింది. ప్రపంచం ఇలా పురోగమనంలోకి వస్తుంటే.. తిరిగి వెనక్కి వెళ్లాలని కమ్యూనిస్ట్ లు నిర్ణయించుకోవడం గమనార్హం. సాంకేతికత లేని సమయంలో, ప్రజలకు కనీస చదువు అందుబాటులో లేని సమయంలో మతం మత్తు మందు, విశ్వాసం వింత రోగం అంటూ గుడ్డలు చించుకున్న కమ్యూనిస్టులు.. ఇప్పుడు మడికడతాననడమే విడ్డూరం.

దేవుడు లేన్నట్టే కులమూ లేదంటే ఎట్లా?

భారతీయ కమ్యూనిస్టుల మీద ఇండియాలో చాలా పెద్ద విమర్శ ఏంటంటే.. కులాన్ని వారు పరిగణలోకి తీసుకోకుండా, కేవలం వర్గం గురించే మాట్లాడటం. పైగా, లెఫ్ట్ పార్టీల అజెండా సోషలిజం. కులాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఈ దేశంలో ఏం సోషలిజం తీసుకువద్దామనుకున్నారో వారికైనా ఓ క్లారిటీ ఉందో లేదో? ఎందుకంటే.. ఇక్కడి అసమానతల్లో ప్రధానమైనది కులమే. మరి కులాన్ని పక్కన పెడితే అదేం సోషలిజం? ఇంకెందుకు వారి పోరాటం? ఇలాంటి విమర్శలు చాలానే ఉన్నాయి. మతంవైపు కూడా వెళ్లేందుకు సిద్ధమైన కమ్యూనిస్టులకు కులంపైన ఇప్పటికీ ఒక స్పష్టమైన అజెండా లేకపోవడం శోచనీయం.

మరింత నష్టమే

సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయం.. ఎంటైర్ కమ్యూనిస్ట్ పార్టీలకు చేటు చేసేలా ఉంది. రాజకీయ ఆటలో చిట్టచివరన ఉన్న కమ్యూనిస్టుల మీద ఇంతకాలం ఓ సానుభూతి ఉండేది. అదేంటంటే.. పరిస్థితి ఎలాంటిదైనా వారి సిద్దాంతాలను, ఆదర్శాలను వదులుకోరు.. నిక్కచ్చిగా, నిటారుగా ఉంటారని. ఇది ప్రచారమో, నిజమో కానీ.. ఈ బోటి సానుభూతి ఉండేది. కానీ, తాజా నిర్ణయంతో అది కాస్త మూసీ నదిలో పడ్డట్టే. నిజానికి లెఫ్టులు ఆశిస్తున్నట్టు.. మత విశ్వాసం వారికి మేలు కాకపోగా, మరింత నష్టం చేకూరుస్తుంది. రాజకీయంగా కొట్టుమిట్టాడుతున్న కమ్యూనిస్టులకు తాజా నిర్ణయం సైద్ధాంతికంగా పెద్ద దెబ్బే కొట్టినట్లైంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!