పెద్దల కోసం పేదలను శిక్షిస్తున్న న్యాయస్థానాలు
– పెండింగ్ కేసుల్లో మెజారిటీ సామాన్యులవే
– దేశంలో మొత్తంగా 5 కోట్ల పెండింగ్ కేసులు
– అతి ఎక్కువ కేసులు పెండింగులో ఉన్న న్యాయవ్యవస్థ మనదే
– 2018 నుంచి వివరీతంగా పెరుగుతూ వచ్చిన పెండింగ్ కేసులు
నిర్దేశం, న్యూఢిల్లీ:
భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 82,831 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది దేశ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ కేసులు. గత ఏడాది కాలంలోనే కొత్తగా 27,604 పెండింగ్ కేసులు నమోదయ్యాయి. నివేదిక ప్రకారం, 2024లో సుప్రీంకోర్టులో 38,995 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 37,158 కేసులు పరిష్కరించబడ్డాయి. గత పదేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. అయితే 2015 నుంచి 2017 మధ్య పెండింగ్ కేసుల సంఖ్య తగ్గడం విశేషం.
హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. 2014లో హైకోర్టుల్లో మొత్తం 41 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు 59 లక్షలకు పెరిగాయి. అలాగే ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2014లో 2.6 కోట్లు ఉండగా, ఇప్పుడు 4.5 కోట్లకు చేరుకుంది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2013లో 50 వేల నుంచి 66 వేలకు పెరగగా, 2014 నాటికి 63 వేలకు తగ్గింది. న్యాయమూర్తులు పి.సదాశివం, ఆర్‌ఎం లోధాల హయాంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ 2018 నుంచి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పేపర్‌లెస్ కోర్టుల వంటి సంస్కరణ పథకాలు ఉన్నప్పటికీ, పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2009లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 26 నుంచి 31కి పెంచగా, 2019లో 31 నుంచి 34కు పెంచారు. ఇంత జరిగినా పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గలేదు. కోవిడ్ మహమ్మారి న్యాయ బట్వాడా వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది, పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరగడానికి దారితీసింది.
ఈ పెండింగ్ కేసుల సమస్య ఎప్పటికి, ఎలా పరిష్కారమవుతుందనే ప్రశ్న తలెత్తడం సహజం. కోర్టుల్లో అందరూ సమానమే అంటాం కదా. నిజానికి అలా జరగడం లేదు. రాజకీయ నాయకులు, సెలెబ్రిటీల కేసులను ముందుగా తీసుకోవడం, వాటిపైనే ఎక్కువ సమయం విచారించడం ప్రధాన కారణం. అందుకే సామాన్యుల కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. పెద్ద పెద్ద లాయర్లు డబ్బు తీసుకుని రాజకీయ నాయకుల కేసులను ముందుగా లిస్ట్ చేస్తారు, ఇది కోర్టులపై అనవసర భారాన్ని పెంచుతుంది. కొన్ని కేసులు చాలా స్పష్టంగా ఉన్నాయి, అవి త్వరగా పరిష్కరించబడతాయని భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఉదాహరణకు ఆ మధ్య జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు చూసుకుంటే, ఇందులో నిందితుడు అఫ్తాబ్ స్వయంగా శ్రద్ధాను 35 ముక్కలుగా నరికివేసినట్లు అంగీకరించాడు. అయితే 2022 నాటి ఈ కేసులో శిక్ష ఇంకా ప్రకటించలేదు.
శ్రద్ధా వాకర్ లాంటి కేసుల్లో బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత స్పష్టమైన కేసుల్లో కూడా కోర్టు నిర్ణయం రానప్పుడు మిగతా కేసుల పరిస్థితి ఏంటి? న్యాయస్థానాల్లో పెండింగ్ సమస్య ఎప్పటికీ తీరే అవకాశం లేదని తెలుస్తోంది. న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు, కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.