మల్లన్నను సస్పెండ్ చేసి తప్పులో కాలేసిన కాంగ్రెస్
– పార్టీలో ఉండే రెడ్లపై విమర్శలు గుప్పించిన మల్లన్న
– ఇక నుంచి మల్లన్న డైరెక్ట్ అటాక్.. కాంగ్రెస్ తట్టుకోవడం కష్టమే
– దీనికి తోడు బీసీ ప్రచారం బలపడే చాన్స్
– అదే జరిగితే.. రెడ్డి ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ఢమాల్
నిర్దేశం, హైదరాబాద్ః
రోగి కోరుకున్నదదే.. డాక్టర్ ఇచ్చిందదే అన్నట్లు.. తీన్మార్ మల్లన్న కోరుకున్నదే ఎట్టకేలకు కాంగ్రెస్ ఇచ్చింది. మల్లన్నను పార్టీ నుంచి తొలగించింది. దీని కోసమే మల్లన్న చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కాంగ్రెస్ మీద విరుచుకుపడదామంటే సొంత పార్టీ అన్న అడ్డంకి మల్లన్నకి ఇబ్బందిగా మారింది. అలా అని తనకు తానుగా పార్టీ నుంచి వెళ్లిపోతే అవసరం కోసం వచ్చి వెళ్లాడన్న అపవాదు ఉంటుంది. అందుకే, తనను బహిష్కరించే వరకు తెచ్చుకున్నాడు మల్లన్న.
ఇక మల్లన్న వల్ల కాంగ్రెస్ లాభం అయితే లేదు కానీ, నష్టమే ఎక్కువ ఉంది. ఇంట్లో ఉన్నా లాభమే, భయటికి వెళ్లినా లాభమే అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు బయటికి పంపి మరింత కష్టాన్ని కొని తెచ్చుకుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న దూకుడు, వాడి ఎలా ఉండేదో తెలిసిందే. కాకలు తీరిన నాయకులను కూడా పట్టించుకోని కేసీఆర్ కూడా విసుగెత్తిపోయి మల్లన్నను అరెస్ట్ చేయించే వరకు వెళ్లాడు. ఇక మల్లన్నపై జరిగిన దాడితో కూడా కేసీఆర్ కు సంబంధం ఉందంటారు. కేసీఆర్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ నేతలు మరీ అంత బలవంతులు కాదు. చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతారు. మరి మల్లన్న గురించి తెలిసిందే కదా. నేటి నుంచి కాంగ్రెస్ నేతల పరిస్థితి చూస్తే కొంత జాలిగానే ఉంటుంది.
బీసీ వాదానికి మరింత బలం వస్తుందా?
రెడ్లను టార్గెట్ చేస్తూ బీసీలను కూడగడుతున్న మల్లన్నకు సొంత పార్టీ కొంత అడ్డొచ్చింది. నిజానికి ఆయన సొంత పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సస్పెన్షన్ పెద్ద బూస్ట్ అనుకోవచ్చు. రెడ్ల మీద మరింత తీవ్ర స్థాయిలో మల్లన్న విరుచుకుపడతాడు. బీసీలను మరింత పోగు చేసే అవకాశం వస్తుంది. ఇప్పటికే పలు అంశాల ద్వారా బీసీల్లో కొంత చైతన్యం పెరిగింది. అయితే బీసీలను డైరెక్టుగా రాజకీయంగా మోటివేట్ చేస్తున్నాడు మల్లన్న. ఇది కనుక సక్సెస్ అయితే రెడ్డిల పథనం రాబోయే ఎన్నికల నుంచే ఉంటుంది.
ఇది ట్రైలర్ మాత్రమేః మల్లన్న
రెడ్డిల మీద చేసిన వ్యాఖ్యలతోనే తనను సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చిన మల్లన్న.. తనకంటే తీవ్ర వ్యాఖ్యలు చేసిన రెడ్లను ఏమీ చేయలేదని, ఇది కేవలం కుల ఆధారంగానే జరిగిందని, తాను బీసీని కాబట్టే చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మీద మండి పడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నేత హరికృష్ణ గెలుస్తారన్న అంచనాల మధ్య.. ఇది ట్రైలర్ మాత్రమేనని రెడ్డి కాంగ్రెస్ కు స్థానిక ఎన్నికల్లో సినిమా చూపిస్తామంటూ మల్లన్న సవాల్ విసిరారు.