కులసంఘాల మీటింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్
హైదరాబాద్, నిర్దేశం:
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు. కులగణన చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా సభ పెడదామని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. కుల గణన సరిగ్గా చేయలేదు.. మన సంఖ్యను తగ్గించారు అనే అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌లో కాపులకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్‌లో కరువైందని అన్నారు. మున్నూరు కాపులు మంత్రి వర్గంలో లేక పోవడం ఇదే మొదటి సారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మున్నూరుకాపు నేతలకు కీలక పదవులు ఇచ్చింది. అంతే విధేయతతో పనిచేశామని నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కూడా మున్నూరు కాపులు అవసరాన్ని గుర్తించారని, రెండు సార్లు మంత్రి వర్గంలో తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీజేపీ కూడా మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.బీజేపీ, బీఆర్ఎస్ నుండి దక్కినన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు.. కాంగ్రెస్ నుండి రాలేదు. నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరుగుతోందని నేతలు అసహనం వ్యక్తం చేశారు. మున్నూరు కాపులను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయం నేతలు వ్యక్తం చేశారు. డి.శ్రీనివాస్, కేకే, వీహెచ్, పొన్నాలకు దక్కిన స్థాయి నేడు కాంగ్రెస్‌లో లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఓ సామాజిక వర్గం మన మీద కుట్రలే కాదు.. దాడి చేసినంత పని చేస్తోందన్నారు. మన ప్రాధాన్యత తగ్గిస్తే.. మనం కూడా తగ్గించడం అనివార్యమన్నారు నేతలు. మరోవైపు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంశం పై కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ మల్లన్న ఎత్తుకున్న నినాదం కరక్టే కానీ పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి, ఒక బీసీ నేతపైనే కాదు, పార్టీ లైన్ దాటిన ఇతర నేతలపై కూడా ఇదే రకమైన చర్యలు ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. కృతజ్ఞత సభకు బదులు.. మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.అయితే ఈ మీటింగ్ పై కాంగ్రెస్ హైకమండ్ సీరియస్ అయింది. కుల సంఘాల మీటింగ్ పెట్టుకొని సీఎం చెప్పిన కులగనణకు సంబంధించిన దాని పైన అభినందించకుండా ఇతర కార్యక్రమాలు చేపట్టి, పార్టీని తిట్టించే ప్రయత్నం చేశారని తీవ్రంగా స్పందించారు కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్. ఈ విషయంపై స్పందిస్తూ వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి మీటింగ్ జరగలేదని కులగణనను అంతా అభినందించారని, మున్నూరు కాపు సభను కూడా త్వరలో ఏర్పాటు చేసి ధన్యవాదాల తీర్మానం ఏర్పాటు చేయాలని భావించామని వివరణ ఇచ్చారు. మరి వీహెచ్ మాటలపై కాంగ్రెస్ హై కమండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.