నిర్దేశం, హైదరాబాద్ః అణగారిన వర్గాలను అగ్రకులాలు వంచించాయి. ఇంకా వంచిస్తూనే ఉన్నాయి. ఈ దేశంలో కులం ఆధారంగానే అన్నీ జరుగుతున్నాయి. అంతటా కులమే ఉంది. ఉద్యోగాల్లో, రాజకీయంలో, కోర్టుల్లో.. అంతటా అగ్రకులాల పెత్తనమే ఉంది. ఇవి ఏ దళిత నేతనో, సామాజిక ఉద్యమకారుడో చెప్తున్న మాటలు కావివి. భారత రాజకీయాల్లో యువరాజుగా పట్టాభిషేకితుడైన కాంగ్రెస్ ముఖ్య రాహుల్ గాంధీ చెప్తున్నారు. బహుశా.. ఆయన కాంగ్రెస్ చరిత్ర తెలిసి చెబుతున్నారో, లేక తెలియకుండా చెప్తున్నారో తెలియదు కానీ, సరిగానే చెబుతున్నారు. ఏమైతేనేమి.. కాంగ్రెస్ ఇంతకు రియలైజ్ అవ్వడం మంచిదే. కానీ, ఇది కేవలం ఓట్ల వేటనా, నిజంగానే వాళ్ల హృదయాలు సామాజిక న్యాయం వైపు కదిలాయా అన్నది అసలు ప్రశ్న.
తెలంగాణ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎందుకు లేదు?
కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే.. సామాజిక న్యాయం చేస్తామని, కింది కులాలను ఉద్దరిస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు వేరే సంగతి. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెసే. ఇక్కడ ఎంత వరకు సామాజిక న్యాయం చేశారు? రాహుల్ గాంధీ చెప్పే సామాజిక న్యాయం తెలంగాణలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అంతా రెడ్లే ఉన్నారు. ప్రభుత్వ అధికారులను కూడా రెడ్లతోనే నింపేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ నుంచి ముఖ్యమంత్రిని నిర్ణయించే వరకు రాహుల్ గాంధీ చెప్తేనే జరుగుతుంది. మరి, ఆ పదువులు ఇచ్చేప్పుడు రాహుల్ గాంధీకి సామాజిక న్యాయం ఎందుకు గుర్తు రాలేదు? అవకాశం వచ్చిన ఒక రాష్ట్రంలో ఏదైనా చేసి నిరూపించొచ్చు కదా. తెలంగాణ ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ సామాజిక న్యాయమనే కదా చెప్పారు. ఎందుకు తెలంగాణలో అందుకు పూర్తి విరుద్ధంగా ఒక్క రెడ్లతోనే నింపారు?
అగ్రకులాలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది కాంగ్రెసే
2022 నుంచి దేశంలో లోక్ సభ ఎన్నికలు సహా 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతి ఎన్నికల్లో అగ్రకులాలకే కాంగ్రెస్ ఎక్కువ టికెట్లు ఇచ్చింది. మరో ఘోరం ఏంటంటే.. కాంగ్రెస్ అగ్రకులాలకు ఇచ్చినన్ని టికెట్లు బీజేపీ కూడా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడు సీట్లు తప్ప.. ఒక్క జనరల్ సీటు ఇవ్వలేదు. ఇక 50% పైగా ఉన్న బీసీలకు కనీసం 20% టికెట్లు కూడా ఇవ్వలేదు. చేతిలో ఉన్న టికెట్లలోనే సామాజిక న్యాయం చేయలేని రాహుల్ గాంధీ.. అధికారంలోకి వచ్చి కూడా ఏమీ చేయలేరని తెలుస్తూనే ఉంది. అందుకు ఉదాహరణ తెలంగాణనే. 2019 ఎన్నికల టైంలో కూడా రాహుల్ ఇలాగే చేశారు. అప్పుడు మహిళా రిజర్వేషన్లను ఎజెండాగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33% మహిళా రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక దేవుడెరుగు. చేతిలో ఉన్న టికెట్లలో కనీసం 10% కూడా ఇవ్వలేదు.
మండల్ ను వ్యతిరేకించి ఈడబ్ల్యూకి సపోర్ట్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం.. బీసీల స్థితిగతులు తెలుసుకుని వారికి తోడ్పాటుగా రిజర్వేషన్లు కల్పించడం, స్కీములు రూపొందించడం లాంటివి చేయమని రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, బీసీలను ఉద్దరించడం పక్కన పెడితే.. వారిని అడగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనే. కాకాకలేల్కర్ కమిషన్ చెత్త బుట్టలో వేసింది అప్పటి ప్రధాని నెహ్రూ. ఇక మండల్ కమిషన్ రిపోర్టును అలాగే పక్కన పెట్టారు. ఇక్కడొక దారుణం ఏంటంటే.. వీపీ సింగ్ నేతృత్వంలోని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ను అమలు చేస్తే.. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల దేశంలో ప్రతిభ చచ్చిపోతోందని, దేశం సర్వనాశనం అవుతోందని బీజేపీతో చేతులు కలిపి దేశవ్యాప్తంగా అల్లర్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక అగ్రకులాల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నోరు మెదపకుండా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ సామాజిక న్యాయం అర్థమవుతోంది కదా.
ఏడు తరాల రాచరికం
కాంగ్రెస్ చాలా చిత్రంగా ఉంటుంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్న ఇందిరా.. దేశంలో రాజభరణాలను రద్దు చేశారు. అదేంటో.. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, దేశ ప్రధాని పదవిని వారసత్వంగా తీసుకొచ్చు. కానీ, మిగతా వారికి వారసత్వంగా పదవులు ఉండొద్దు. అంత నిజాయితీ ఉంటే ఇందిరా తన కుర్చీని వదులుకోవచ్చు కదా. ఇక రాహుల్ గాంధీ కూడా ఏడో నాలుగో తరం రాజకీయ వారసుడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఆమోద యోగ్యం కాదు. కానీ, గాంధీ కుటుంబానికి అవన్నీ వర్తించవు. ఇదే కాంగ్రెస్ రాజకీయం. మొన్నామధ్య కాన్షీరాంను కేవలం దళిత ఐడెంటిటీ లేకపోతే జీరో అని రాహుల్ అన్నారు. అదే సమయంలో తనను దేశ నాయకుడని చెప్పుకున్నారు. అగ్రకులాలు నిమ్నకులాలను ఎలా వంచిస్తున్నాయో రాహుల్ గాంధీనే పెద్ద ఉదాహరణ అని అర్థమవుతోంది కదా.
రాహుల్ మాటను కాంగ్రెస్ తీసుకోవడం లేదు
రాహుల్ గాంధీ అయితే సామాజిక న్యాయం గురించి ఎక్కువగానే మాట్లాడుతున్నారు. కానీ, ఒక్క కాంగ్రెస్ లీడర్ దీనిపై స్పందించడం లేదు. ఏదో రాహుల్ గాంధీ ఉన్న సందర్భంలో ఆయనతో మాట కలిపేందుకు ఒకటి రెండు మాటలు వస్తున్నాయి. కానీ, కనీసం సామాజిక న్యాయంపై ఎవరూ ఇష్టపడడం లేదు. మిగతా అన్ని విషయాలను కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ వరకు అన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. కానీ, సామాజిక న్యాయం అనే అంశంపై కేవలం రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎంత చిత్రం కదా.. కులాలు అని వచ్చే సరికి.. తమ అధినేతను సైతం ధిక్కరిస్తున్నారు. అన్నింట్లో కులాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మంచిదే. కానీ, కాంగ్రెస్ లో కూడా అదే ఉందని ఆయన చెప్పడం లేదు. ఎందుకంటే.. బలహీన వర్గాలు కేవలం ఓటు బ్యాంకుగానే ఉండాలి, ఇది కాంగ్రెస్ ఎజెండా.