మద్దతుపై గులాబీలో అయోమయం
హైదరాబాద్, నిర్దేశం:
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ పార్టీ ఇంకా బలంగానే ఉందని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండిపోయింది. ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రకటనలు అయితే చేస్తున్నారు కానీ ఎన్నికల బరిలోని దిగేందుకు మాత్రం సై అనడం లేదు. ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో.. ఆ పార్టీలోని నేతలు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఎవరి గ్రూప్ పాలిటిక్స్ వాళ్లు చేసుకుంటూ.. తమ ప్రచారాలతో సామాన్య కార్యకర్తలకు పిచ్చెక్కిస్తున్నారు. ఎవరికి మద్ధతుగా నిలవాలో అధిష్టానం స్పష్టంగా చెప్పకపోవడం, జిల్లా స్థాయి నేతలూ ఒక మాట మీదకు రాలేకపోవడంతో.. తలా ఓ దిక్కులో ఇష్టారీతిన ప్రచారం చేసుకుంటున్నారుఎన్నికలు జరగనున్న జిల్లాల్లోని పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయారు. బయటా, సోషల్ మీడియా ద్వారా తమకిష్టం వచ్చిన నేతలకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరో వారం రోజులైతే ప్రచారం ముగియనుండగా, ఇప్పటికీ.. ఏ అభ్యర్థికి, ఏ ప్రాతిపదికన మద్దతు ఇవ్వాలనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. పైగా.. జిల్లా నేతల్లోనూ ఎవరి దారి వారిదే కావడంతో.. క్యాడర్ మిగతా పార్టీలు, నేతల వైపు ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు వెళ్లిపోతున్నారు.కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాదు, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీలో నిలుచోలేదు. పలువురు బలమైన అభ్యర్థులు టికెట్ల కోసం ప్రయత్నించినా.. బీ-ఫాం ఎవ్వరికీ ఇవ్వలేదు. అప్పటి వరకు పార్టీ తరఫున పోటీలో నిలుచోవచ్చని కలలు కన్న అభ్యర్థులు పార్టీ అధిష్టానం తీరుతో అవ్వాక్కయ్యారు. జమిలి వస్తే మనమే గెలుస్తామని ఓ వైపు కేసీఆర్ అదరగొడుతుంటే.. పోటీలో నిలుచునేందుకు సిద్ధమని వస్తున్నా, వద్దని అంటుంటే ఏం అర్థం కాని పరిస్థితి. ఈ అయోమయం తాజాగా జిల్లాల్లో మద్ధతు ప్రకటించాల్సిన అభ్యర్థులు ఎవరు అనే వరకు కొనసాగుతూనే ఉంది.పార్టీ నుంచి టికెట్లు అశించి భంగ పడిన చాలా మంది మనస్థాపానికి గురయ్యారని చెబుతున్నారు. దాంతో పాటే ఏళ్లుగా పార్టీలో కష్టపడినా గుర్తింపు దక్కని, ఎలాంటి పదవులు లభించని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అలాంటి వారిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాగ్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఇప్పటికీ ప్రచారంలో కేసీఆర్ ఫోటోను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, తమ అధినేత ఫోటోతో ప్రచారంలో ఉన్నా కానీ.. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రవీందర్ సింగ్ కు మద్ధతుగా రావడం లేదని టాక్ నడుస్తోంది. ఆయన మాత్రం కేడర్ అంతా తన వెనుకే ఉన్నారని చెబుతున్నారు. కానీ.. వాస్తవంలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు.జిల్లా పార్టీ నేతలు సైతం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో.. పార్టీ జిల్లా నేతలు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కు మద్దతు ఇస్తున్నారంట. బహిరంగంగానే మద్ధతు ప్రకటనలు చేస్తున్న సదరు నేతలు.. సోషల్ మీడియా వేదికగానూ మద్ధతు ఇస్తున్నట్లు పోస్టర్లు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. తొలుత ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. అక్కడ నిరాదరణ ఎదురు కావడంతో బీఆర్ఎస్ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ.. అక్కడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలియడంతో చివర్లో బీఎస్పీ పార్టీ చెంతకు చేరి పదవిపై ఆశ పెట్టుకున్నారు. వీరిద్దరు బీఆర్ఎస్ పార్టీ అధినేతలు, కీలక నాయకుల మద్ధతు తమకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ.. వాస్తవంలో మాత్రం క్షేత్రస్థాయి కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి సమాచారం లేదు.ఇప్పటికే.. వీరిద్దరు బలమైన సపోర్టు ఉన్న నేతలే కావడం, బీఆర్ఎస్ స్థానిక నేతల నుంచి కాస్త మద్ధతు అందుకుంటున్నట్లు చెబుతున్న నేపథ్యంలోనే మరో ఇండిపెండెంట్ అభ్యర్థి శేఖర్ రావు సైతం తనకు బీఆర్ఎస్ పార్టీ అండదండలున్నాయని చెబుతున్నారు. ఆ పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది అభ్యర్థులు బీఅర్ఎస్ తమకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా కానీ.. అధిష్టానం మాత్రం సైలెంట్ గానే ఉంది. దీనితో బీఅర్ఎస్ శ్రేణులు ఇటు ప్రచారం చేయలేక, అటు బహిరంగంగా మద్దతు ఇవ్వలేక అయోమయానికి గురి అవుతున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఏదో ఒక అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా ఆయా జిల్లాల్లో పెరుగుతుంది. అలా చేసి అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగితే.. పార్టీ ఇంకా బలంగా ఉందనే సంకేతాలు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళతాయని అంటున్నారు. కానీ.. అధిష్టానం పెద్దలు ఏం ఆలోచిస్తున్నారో తెలియన ఆయోమయ స్థితిలో జిల్లా క్యాడర్ కు పెద్ద సమస్యే వచ్చిపడినట్లుందంటున్నారు పార్టీ కార్యకర్తలు.