సీఎం స్పందించకపోతే డీజీపీ ఆఫీసు ముట్టడిస్తాం – బీఎస్సీ

నిర్దేశం, హైదరాబాద్: షాద్ నగర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్ హెచ్చరించారు. సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల పరిస్థితులు మారలేదని, కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏం లేదని ఆయన దుయ్యబట్టారు. షాద్ నగర్ లో ఒక దళిత మహిళను అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కు పిలిచి ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో బీఎస్పీ పెద్ద ఎత్తున నిరసన నిర్వహించింది.

ఈ సందర్భంగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ.. ‘‘షాద్ నగర్ లో దళిత మహిళను అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కి పిలిచి, 13 ఏళ్ల కుమారుడి ముందు ఆమెను వివస్త్రను చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు దీనిని ప్రజా పాలన అనుకోవాలా? లేదంటే, దొరల పాలనను మించిన రెడ్డి పాలన అనుకోవాలా? కేసీఆర్ పాలనను దొరల పాలన అని పిలిచారు. మరి ఇప్పటి పాలనను ఏమని పిలవాలి? నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోతే, సీఐ రాంరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి, జైలుకు పంపాలి’’ అని డిమాండ్ చేశారు.

ఇక ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై మౌనంగా ఉన్నారు. దీనిపై మీరు పెదవి విప్పకపోతే మీరు దళితులు ఎలా అవుతారు? మీకు ఆత్మగౌరవం ఎలా ఉన్నట్లు? మీ ఇంట్లో ఆడవారికి ఇలాగే జరిగితే ఇలాగే మౌనంగా ఉంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తున్న.. ఒక రెడ్డి మహిళలపై ఎస్సీ సీఐనో, బీసీ సీఐనో, ఎస్టీ సీఐనో, మైనారిటీ సీఐనో ఇలాగే చేసుంటే మీరు ఇప్పటి వరకు ఊరుకునేవారా? దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. జవాబు చెప్పకపోతే, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి బీఎస్పీ జవాబు చెబుతుంది’’ అని అన్నారు.

ఇక జరగాల్సింది హక్కుల పోరాటం కాదని, రాజ్యాధికార పోరాటమని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మానవ హక్కుల సంఘాలకు విజ్ణప్తి చేస్తున్నా. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా కులోన్మాదం తగ్గలేదు. హక్కుల పోరాటాలు వదిలి, రాజ్యాధికార పోరాటం పట్టకపోతే రాబోయే రోజుల్లో అందరి ఇంట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి’’ అని అని ఇబ్రాం శేఖర్ అన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!