మరో బాదుడుకు సిద్ధమవుతున్న కేంద్రం…. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే యోచన
(ఈదుల్ల మల్లయ్య)
యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారు. ప్రజలు నగదు లావాదేవీలను పక్కన పెట్టారు. మోడీ పిలుపుతో అంతా ఆన్‌లైన్‌లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఇలాంటి యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారులపై ఎలాంటి ఛార్జీల భారం లేదు. అయితే, త్వరలోనే ఈ లావాదేవీలపైనా మర్చెంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం
యోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ విూడియా కథనాలు వెల్లడిరచాయి. ఇప్పటికే జిఎస్టీ తదితర భారాలు తప్పడం లేదు. బ్యాంకు లావాదేవీలపైనా భారం పడుతోంది. ఇవి చాలవన్నట్లుగా ఇప్పుడు యూపిఐ పేమెంట్లపై మోడీ దృష్టి పడిరదని అర్థం చేసుకోవచ్చు.
రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కథనాలు పేర్కొన్నాయి. వార్షిక ఆదాయం రూ.40లక్షలపైన ఉండే వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ను తిరిగి తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్టీ ప్రతినిధులు ఇటీవల కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఓ బ్యాంకర్ వెల్లడిరచినట్లు విూడియా కథనాలు పేర్కొన్నాయి. ‘వీసా, మాస్టర్‌కార్డ్ వంటి డెబిట్ కార్డులు, ఇతర క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులకు పెద్ద వ్యాపారులు ఎండీఆర్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు వారు యూపీఐ, రూపే డెబిట్‌కార్డు ఆధారిత లావాదేవీలకు ఎందుకు ఛార్జీలు కట్టకూడదు?‘ అని సదరు బ్యాంకర్ ప్రశ్నించారు. కేంద్రం కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. అయితే, ’టైర్డ్ ప్రైజింగ్ సిస్టమ్’ ఆధారంగా ఈ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే.. రూ.40లక్షల్లోపు వార్షికాదాయం ఉండే వ్యాపారులు యూపీఐ చెల్లింపులను ఉచితంగానే స్వీకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ ఛార్జీలను తిరిగి తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావేదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు. కాకపోతే దీనివల్ల వ్యాపారులు మళ్లీ నగదు చలామణికి మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మూడేళ్ల ముందు వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులకు వ్యాపారులు కొంతమొత్తం ఛార్జీలను బ్యాంకులకు కట్టాల్సి వచ్చేది. ఆయా లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు ఈ రుసుము చెల్లించేవారు. అది కూడా ఒక శాతం లోపే ఉండేది. అయితే, యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీలను 2022లో కేంద్రం తొలగించింది. అనంతరం ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వస్తోంది. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ సబ్సిడీని రూ.3500 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు తగ్గించారు.