Take a fresh look at your lifestyle.

అంబానీ వైభోగం.. సెలబ్రేటీలకు అదో రోగం

ఇక్కడో మాట చెప్పాలి. పార్లమెంట్ సమావేశాలు కనుక ఈ పెళ్లిలో పెట్టుంటే, ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగేవి.

0 168

– రూ.5 వేల కోట్లతో అంగరంగ వైభవం
– వివాదాలకు అతీతంగా ప్రముఖుల హాజరు
– సెలెంట్ గా తప్పుకున్న సోనియా

నిర్దేశం, ముంబైః సిరిమంతుడి ఇంట్లో సంబరం అంటే ఆకాశం విరిచి పందిరి వేస్తారు. నక్షత్రాలను నేలకు దింపి డాన్సులు వేయిస్తారు. అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ సుపుత్రుడు అనంత్ అంబానీ వివాహం అలాగే జరుగుతోంది. ప్రముఖ నేతలు, ప్రప్రముఖ సెలబ్రిటీలంతా తనువు మరిచి నాట్యం చేస్తుంటే చూడడానికి హైడెఫినేషన్ కెమెరా లెన్సులు కూడా సరిపోవడం లేదు. ఈ పెళ్లికి అంబానీ ఏకంగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం అత్యవసర స్కీములకు పెట్టే ఖర్చు ఇంత కంటే తక్కువ ఉండడం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బీసీ సంక్షేమం బడ్జెట్ అటు ఇటుగా ఇంతే. అలాగే మైనారిటీ సంక్షేమానికి ఇందులో సగం. పాఠశాల విద్యకు తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు ఇందులో సగం కూడా కాదు.

పక్షమూ అక్కడే, ప్రతిపక్షమూ అక్కడే..
వ్యాపారం, రాజకీయం ఒకదానిపై ఒకటి ఆధారపడే రంగాలు. అయితే రాజకీయాల కారణంగా.. బహిరంగ సభల్లో వ్యాపారస్తులపై రాజకీయ నేతలు వేళ్లు చూపిస్తూ విమర్శలు చేయడం, సాయంత్రం కాగానే వారి ఇంట్లోనే చేతులు కడగడం కొత్తేమీ కాదు. అదే సంప్రదాయం అనంత్ పెళ్లిలోనూ కనిపించింది. అంబానీ, అదానీలు దేశాన్ని లూటీ చేస్తున్నారంటూ విమర్శలు చేసిన నేతలంతా అనంత్ పెళ్లిలో అలరించారు. కెమెరాల ముందుకు వచ్చి, ఎంతో ఇష్టంతో ఫొటోలు తీసుకున్నారు. అధికార, విపక్ష నేతలనే తేడా లేదు. అక్కడికి రావడమే గౌరవం, మహాభాగ్యం అన్నట్లుగానే కనిపించారు. పెద్దల కల్యాణానికి క్యూ కట్టే నేతలు.. లోక కళ్యాణంలో పత్తా ఉండరు. ఈ పెళ్లికి ముందు నుంచి దూరంగా ఉండి గాంధీ కుటుంబం సేఫ్ గేమ్ ఆడారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదట కాన్సిల్ చేసుకున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో హాజరయ్యారు. ఇక్కడో మాట చెప్పాలి. పార్లమెంట్ సమావేశాలు కనుక ఈ పెళ్లిలో పెట్టుంటే, ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగేవి.

సినిమావాళ్లైతే మరీనూ..
అంబానీ పెళ్లిలో సినిమావాళ్ల తీరైతే అత్యంత చర్చనీయాంశం. ఎంగేజ్మెంట్ టైంలో బాలీవుడ్ స్టార్లంతా ఒకే బస్సులో క్యాటిల్ క్లాస్ లో వచ్చారు. అప్పట్లో ఇది బాగా ట్రోలైంది. నేటి పెళ్లిలోనూ అంతకు మించి కొత్తగా ఏం లేదు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే రజనీకాంత్ సైతం స్టెప్పులు వేస్తూ కనిపించారు. బయట చూపించే అహం, ఆత్మాభిమానం ఇక్కడ కించెత్తు అయినా కనిపించలేదు. పైగా, కూలీ పనివారిలానే కనిపించారు (డాన్స్ చేయడానికి డబ్బులు తీసుకున్నారుగా). తమ మధ్య ఉండే విభేదాల్ని అన్నింటినీ పక్కన పెట్టి అనంత్ పెళ్లిలో ఆత్మీయంగా కనిపించడం సినిమావాళ్లకే దక్కింది.

ఆటగాళ్లూ పోటుగాళ్లేం కాదు
అంబానీ కుటుంబం ముందు అందరూ సమానమే. వారి ఇంట్లో సందడుంటే ఆటగాళ్లు సైతం స్టెప్పులేయాల్సిందే. చిత్రంగా, ఆటగాళ్లను మైదానంలో అలరించడానికి చీర్ లీడర్స్ ప్రత్యేకంగా ఉంటారు. కానీ, ఇక్కడ ఆటగాళ్లే చీర్ లీడర్ల్. అంబానీ కుటుంబాన్ని అలరించాలి, ఆనందించాలి. రెండు టకీలాలు ఇవ్వమంటున్న హార్దిక్ పాండ్యా వీడియో ఒకటి బయటికి వచ్చింది. కింగ్ ఫిషర్ యాడ్ కంటే మస్తీగా ఉంది కదా. ఎందుకుండదూ.. ఐపీఎల్ బడ్జెట్, అంబానీ బడ్జెట్ ఒకటి కాదు మరి. అంతా పేమెంట్ మయం.

చివరగా..
అంబానీ పెళ్లిలో వీరంతా పాల్గొని ఆనందంగా గడపడాన్ని తప్పుపట్టట్లేదు. కానీ, అంబానీ పెళ్లిలో చూపించిన ఉత్సాహం వారి రంగాల్లో ఎందుకు కనిపించనేది సమస్య. ఒకరు ప్రజాజీవితంలో నీతులు చెప్తుంటారు. తాము ప్రజా సేవకులం అంటారు కానీ, ప్రజలతో వారు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పేది కాదు. ఇంకొకరు సినిమాల్లో నీతులు చెప్తుంటారు. ఒంటి చేత్తో సమాజానికి ఏదో చేస్తుంటారు. నిజజీవితంలో మామూలు జనాలను దూరం నుంచి చూడడానికి కూడా ఇష్టపడరు. ఆటగాళ్లు నీతులు వల్లించకపోయినా, బయట వీరి ప్రవర్తన కూమా సినిమావారి లాగే ఉంటుంది. కానీ, వీరంతా డబ్బున్న వారి ముందు మోకరిల్లుతారు. “కో అంటే కోటి, గెంతుకుంటూ వస్తుంది, కొండమీద కోతి” అన్న మాట ఇలా ఎప్పుడూ రుజువు అవుతూ ఉంటుంది.

ఇక ఇవి పక్కన పెడితే.. అంబానీ పెళ్లికి చేసిన ఖర్చుపై బయటి నుంచి విమర్శలు వస్తున్నాయి. దేశంలో పేదలకు రెండు పూటల భోజనం దొరకక అవస్థలు పడుతుంటే వేల కోట్లు పెట్టి పెళ్లిల్లు చేస్తున్నారు. డబ్బులున్న వారికి కోట్లు ఇచ్చి డాన్సులు చేయిస్తున్నారు. ప్రజా సేవ చేయాల్సిన వారు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ పెళ్లి కారణంగా సౌత్ ముంబైలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువే ఉన్నాయట. సోషల్ మీడియాలో వందల కంప్లైంట్స్ వస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking