Take a fresh look at your lifestyle.

‘కారు’కూత రాజకీయానికి కర్రువాత

చంద్రబాబు తన మంత్రివర్గంలోకి కేసీఆర్ ను తీసుకోకుండా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, అవమానంగా భావించి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎత్తి ప్రత్యేకంగా పార్టీ పెట్టిన విషయం దాచి పెట్టేది కాదు

0 64
  • చంద్రబాబు విషయంలో కేసీఆర్, రేవంత్ తీరు భిన్నం
    గురువును ముంచే తీరున వ్యవహరించిన కేసీఆర్
    విధేయత చూపుతూ, గౌరవం పెంచుకున్న రేవంత్

వయసైపోయిన వారికి ఆధ్యాత్మికత గుర్తుకు వచ్చినట్టే, పదవులు పోయాక రాజకీయ నాయకులకు ఒక్కసారిగా విలువలు గుర్తొస్తాయి. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపిస్తే.. ఎన్నికల్లో ప్రజలు తమ పవర్ చూపిస్తారు. చాలా మందికి పదవి మాత్రమే పోతే, అహంకారులకు పరువు కూడా పోతుంది. ప్రతి రంగంలో గురువును మించిన శిష్యులు ఉంటారు. మంచిదే, కానీ కొంత మంది శిష్యులు గురువును ముంచాలని చూస్తారు. అలాంటి వారికి కాలం సరైన గుణపాఠమే చెప్తుంది. మీ అనుమానం నిజమే.. ప్రస్తుతం చెప్తున్నది తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే.

అదేంటో విచిత్రం.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడే. ఒకరు పదేళ్లు సీఎంగా ఉంటే, మరొకరు కొద్ది నెలల క్రితమే సీఎం అయ్యారు. కానీ ఇద్దరి నడవడిలో చాలా తేడాలున్నాయని ఒక్క తెలంగాణావారే కాదు, మొత్తం తెలుగువారూ చర్చించుకుంటున్నారు. తెలంగాణ దొర గడీ అహంకారం గురించి అతి ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న రాజకీయ నేత కేసీఆర్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ముఖ్యమంత్రి ఉండగా, ఈ విమర్శలను కేసీఆర్ లెక్కనైనా చేయలేదు, సరికదా ‘అవును.. నేను దొరనే’ అంటూ తన అహాన్ని చూపించేవారు. కేసీఆర్ పని తీరేమో కానీ ఈ అహంకారానికే ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చారని వేరే చెప్పనక్కర్లేదు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ మీద ఈ విమర్శలు మరింత పదునెక్కాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలిచాక.. రేవంత్ ను చూపిస్తూ దెప్పిపొడుపులూ వస్తున్నాయి.

చంద్రబాబుతో కేసీఆర్ తీరు
చంద్రబాబు తన మంత్రివర్గంలోకి కేసీఆర్ ను తీసుకోకుండా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, అవమానంగా భావించి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎత్తి ప్రత్యేకంగా పార్టీ పెట్టిన విషయం దాచి పెట్టేది కాదు. సరే, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ భాగస్వామ్యాన్ని కాదనలేము కానీ, రాష్ట్రం ఏర్పడి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే గౌరవం కాపాడుకోకుండా గర్వానికి పోయారు. చంద్రబాబును అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. చివరికి చంద్రబాబుకు రాజకీయ శత్రువులైన జగన్ లాంటి వారితో అంటకాగడానికి కూడా వెనకాడలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుని, ఆ పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు. కట్టుబట్టలతో చంద్రబాబును ఆంధ్రాకు పంపించే వరకు తెగించారు. ఆ తర్వాత ఏమైనా మెత్తబడ్డారా అంటే అదీ లేదు. సమయం దొరికినప్పుడల్లా తన విధ్వేషాన్ని చూపుతూనే వచ్చారు.

చావు దెబ్బే పడింది
తెలంగాణ పల్లెల్లో పాత కాలంలో దొరల్లా అధికారం నాదే, ఇక్కడ నేనే ఉంటా అన్నట్టుగా నియంతలా వ్యవహరించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా. పైగా ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్య రాజకీయం. గోట్స్ బఫెల్లోస్.. బఫెల్లోస్ గోట్సూ చాలా ఈజీగా మారుతుంటాయి. అలా కేసీఆర్ పాపం పదేళ్లకు పండింది. ఒక్క ఎన్నికతో పదవి, పరువు రెండూ పోయాయి. ఇక మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అయితే చావు దెబ్బే పడింది. బయటికి చెప్పకపోయినా తన తప్పిదంపై కేసీఆర్ గట్టిగానే రియలైజ్ అయ్యుంటారు. అంతమాత్రాన బయటికి చెప్తారా ఏంటి? పైగా అక్కడున్నది కేసీఆర్.. ఎక్కువ ఊహించకండి.

రేవంత్ రెడ్డి మరోలా..
రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే టీడీపీ నుంచి బయటికి వచ్చిన వ్యక్తే. కానీ, కేసీఆర్‭లా కాకుండా నిండు కుండలా నిరాడంబరంగా వ్యవహరించారు రేవంత్. తన రాజీనామాను స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు పట్టించుకోకపోయినా అసంతృప్తి చెందలేదు. ఇక కాంగ్రెస్ చేరిక నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రయాణంలో రేవంత్ రెడ్డి ఏనాడూ చంద్రబాబు పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శించలేదు. ఎప్పుడూ విధేయంగానే ఉన్నారు. తమ సాన్నిహిత్యం గురించి తరుచూ ప్రశ్నలు వస్తుంటాయి. అయితే చంద్రబాబు తన సీనియర్ అని చెప్పుకుంటారు రేవంత్.

కొత్త ఆశలు
ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఉంది. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇద్దరు శిష్యులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తను కూడా ముఖ్యమంత్రి అవ్వడం బహుశా చంద్రబాబు విషయంలోనే జరిగిందేమో. అయితే ఒకప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య పరిస్థితులు తెలిసిందే. ఉద్యమ ప్రభావం ఎంతున్నా, కేసీఆర్ వైఖరి వల్ల తోడబుట్టిన రెండు రాష్ట్రాల మధ్య విధ్వేష గోడ కట్టుకుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు, ఆయన శిష్యుడే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే రేవంత్ నిరాడంరత, విధేయత ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలకు బాటలు పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking