రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్ద ఎత్తున పోటీ

రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్ద ఎత్తున పోటీ

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార కాంగ్రెస్‌కు నాలుగు, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కనున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ పదవులు దక్కనుండటంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారంతా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు ఢిల్లీ పెద్దల వరకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. ఈసారి తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సామాజికవర్గాల వారీగా, పార్టీ కోసం పనిచేసిన వారిలో ఎవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు నిరాశపరిచే విషయం ఒకటి తెలిసిందట. నాలుగు ఎమ్మెల్సీ పదవుల్లో ఒక ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ కోరుతోంది. పొత్తులో భాగంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ పదవులను ఇస్తామని హామీ ఇవ్వగా..ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఒక బెర్తును ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీంతో మిత్ర ధర్మాన్ని పాటించి సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.నాలుగు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి సీపీఐకి వెళ్లినా.. మూడు ఎమ్మెల్సీ పదవులు ఉంటాయని సరిపెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మరో ఎమ్మెల్సీ సీటు ఎంఐఎంకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడువు ముగుస్తున్న ఐదు ఎమ్మెల్సీల్లో ఒకరు ఎంఐఎం నేత ఉన్నారు. దీంతో ఆ ఎమ్మెల్సీ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందట.తమకు ఓ ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఎంఐఎం సీఎం రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్‌తో ఉన్న విధంగానే ఫ్రెండ్లీగా ఉందామని, భవిష్యత్‌లో కలిసి ముందుకు వెళ్తామని ఎంఐఎం, సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎంతో దోస్తీ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. లోకల్‌బాడీ, గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం సహకారం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలంటున్న ఎంఐఎం విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సీపీఐ, ఎంఐఎంకు చెరో ఎమ్మెల్సీ సీటు కేటాయించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు నిర్ణయం తీసుకోగా.. అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం. ఇలా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు పోగా మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్దఎత్తున పోటీ ఉండటంతో ఎవరికి ఇవ్వాలన్నదానిపై తర్జనభర్జన కొనసాగుతోందట.ఆ రెండు సీట్ల కోసం దాదాపు పది మంది హస్తం నేతలు రేసులో ఉన్నారు. కొందరు ఆశావహులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతతో ఉంటూ లాబీయింగ్ చేస్తుంటే మరికొందరు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారట. ఆ రెండు బెర్తుల్లో పదవులు పొందే హస్తం పార్టీ అదృష్టవంతులు ఎవరో చూడాలి మరి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »