వైసీపీ సీఎంగా… భారతి?
విజయవాడ, నిర్దేశం:
వైసీపీ అధినేత జగన్ కు పెద్ద సమస్య వచ్చిపడిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా న్యాయవాది, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్ పై ఉన్న కేసులు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు కొత్త కేసులు కూడా మెడకు చుట్టుకునే అవకాశముంది. 2014 కు ముందు నమోదయిన క్విడ్ ప్రోకో కేసుల్లో ఇంకా తీర్పు వెలువడలేదు. దీంతో పాటు తాజాగా మద్యం కేసు కూడా మెడకు చుట్టుకునే అవకాశముందన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయంగా ఉంది. క్విడ్ ప్రోకో కేసులో జగన్ కు శిక్షపడితే ఇక 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆయన చెబుతున్నారు.ప్రస్తుతం బీజేపీతో సయోధ్యగా కొనసాగిస్తున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కూడా మోదీ సర్కార్ పై వత్తిడి తెచ్చే అవకాశముంది. ఎందుకంటే గత ఎన్నికలలోనే జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు పర్చకపోవడంతో కూటమి ప్రభుత్వంపై కొంత ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉంది. రానున్న నాలుగేళ్లలో సూపర్ సిక్స్ హామీలు చేసినా సహజంగా అధికారంలో ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కొంత మూడు పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తారు. ఎవరితోనూ పొత్తుకు వెళ్లరు.
ఈ విషయంలో మరో అనుమానానికి తావులేదుప్రస్తుతం కూటమిలో ఉన్న మూడు పార్టీలు కలసి పోటీ చేసినా ఏమాత్రం తేడా కొట్టినా ఓట్ల శాతం మారితే సీట్లు కూడా గల్లంతవుతాయి. అందుకే జగన్ పోటీ చేసే అవకాశం కోల్పోతే వైసీపీ నేతలు మానసికంగా సగం అపజయం పాలయినట్లేనన్న లెక్కలో ఉన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా జగన్ కాకుంటే మరొకరు ఎవరికైనా ఇంతటి హైప్ లభించే అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. అందుకే వైఎస్ జగన్ పై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న క్విడ్ ప్రోకో కేసులలో కనీసం రెండు మూడేళ్లు శిక్షను విధించినా పోటీ చేయడానికి అనర్హత వేటు పడే అవకాశముందని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇప్పటికే ఈ కేసుల విచారణ లో వేగం పుంజుకుందిఈ నేపథ్యంలోనే ఏ మాత్రం జైలుశిక్ష పడితే ఇక జగన్ కు 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ భారతిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంటుంది. జగన్ ను కట్టడి చేయాలన్నా, వైసీపీ నుంచి ముప్పు తప్పించుకోవాలనుకున్నా జగన్ కు శిక్షపడటం ఒక్కటే మార్గం. శిక్షపడితే ఎవరూ ఏమీ చేయకుండానే జగన్ పార్టీ సులువుగా దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకే ఈ విషయం తెలిసిన కొందరు సీనియర్ నేతలు, జగన్ కు సన్నిహితంగా ఉన్న లీడర్లతో పాటు బంధువులు కూడా పార్టీని వీడి వెళ్లారంటున్నారు. అయితే అది న్యాయస్థానంలో ఉండటంతో మరి జగన్ విషయంలో జరుగుతున్న ఈ ప్రచారం ఎంత వరకూ నిజమవుతుందన్నది చూడాలి.