పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై దాడులు
రెండవ రోజు ఈడీ సోదాలు
హైదరాబాద్, జూన్ 22 : రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నారని అభియోగాలు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో ఈడీ సోదాలు చేపట్టింది. ఓవైసీ హాస్పటల్‌లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే పలు మెడికల్ కాలేజీలలో సోదాలు ముగియగా.. మరికొన్ని చోట్ల రెండవ రోజు ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.
ఈరోజు సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరగనున్నాయి.నిన్న (బుధవారం) ఉదయం నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్కాన, చౌటుప్పల్, జడ్చర్ల, చేవెళ్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, సమీర్ పేట్‌కు ఈడీ బృందాలు వెళ్లాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో పలుచోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఎస్‌విఎస్ మెడికల్ కాలేజీ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ శాఖలతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 6 జిల్లాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాలేజీల ఆర్థిక వ్యవహారాలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక పత్రాలను పరిశీలించారు.