ఆక్వా రంగం…. సహాయం కోసం ఎదురుచూపులు
ఏలూరు, నిర్దేశం:
అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. రైతుల పరిస్థితిని వివరిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ రాశారు. ట్రంప్ విధిస్తున్న అడ్డగోలు సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర జీడీపీలో ఆక్వా రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భారత దేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా 27శాతం దిగుమతి సుంకం విధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటిలో రొయ్యలే 92శాతం వాటాను కలిగున్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత దేశంపై 27శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.ఇక ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10శాతం సుంకమే విధించింది అమెరికా. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ వారికి అనుకూలంగా మారుతుందన్నారు. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్ రెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారు.
అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్, భారత్ దేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20శాతం ఉంటుంది.అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అమెరికా వెళ్లే అన్ని ఎగుమతులపైన ఈ భారం పడుతుందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. గతంలో వచ్చిన ఆర్డర్స్ కు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేయబడి కోల్డ్ స్టోరేజ్ పోట్లలో ఉన్నాయి. కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుంది.యూరోపియన్ యూనియన్ లో భారతీయ ఎగుమతిదారులు 50శాతం తనిఖీ రేట్లు, 4 నుంచి 7 శాతం దిగుమతి సుంకంతో సహా నాన్ టారిఫ్ అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. కానీ వియత్నం వంటి దేశాలు యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద జీరో డ్యూటీ పొందాయి. ఈ కారణంగా వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ ను ఆక్రమిస్తున్నాయని తెలిపారు చంద్రబాబు.ఇక వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారత్ నుంచి సీ ఫుడ్స్ కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి. అయితే, ఇప్పుడు అంతిమ ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్స్ ల కారణంగా ఆ దేశాలు కూడా మనకిచ్చిన ఆర్డర్స్ ను రద్దు చేసుకున్నాయి. ఏపీలో కోల్డ్ స్టోరేజ్ లు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంటను ఎక్కడ ఉంచాలో కూడా తెలియడం లేదని గందరగోళమైన పరిస్థితిలో రైతాంగం ఉందని తెలిపారు. మరోవైపు 27శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడాన్ని ఎగుమతిదారులు నిలిపేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయన్నారు చంద్రబాబు