Take a fresh look at your lifestyle.

INLDతో BSP దోస్తీ.. అప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?

ఈ రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయి. 10 లోక్ సభ స్థానాలున్న హర్యానాలో ఏకంగా 5 సీట్లు ఈ పార్టీలు గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీలకు షాకిచ్చాయి

0 427

నిర్దేశం, న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం ఇక బహుజన్ సమాజ్ పార్టీ పని అయిపోయిందనుకుంటున్న టైంలో ఫీనిక్స్ పైకి ఎగిరినట్టే కనిపిస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. వాస్తవానికి ఈ రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయి. 10 లోక్ సభ స్థానాలున్న హర్యానాలో ఏకంగా 5 సీట్లు ఈ పార్టీలు గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీలకు షాకిచ్చాయి. మరోసారి ఇప్పుడు పొత్తుతో వస్తున్నాయి.

తాజా పొత్తు గురించి
చండీగఢ్‌లో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక సమావేశంలో ఐఎన్ఎల్డీ చీఫ్ జయంత్ చౌతాలా, బీఎస్పీ నేషనల్ కోర్డినేటర్ ఆకాష్ ఆనంద్ ఈ పొత్తుపై ప్రకటన చేశారు. వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 37 స్థానాల్లో, ఐఎన్‌ఎల్‌డీ 53 స్థానాల్లో పోటీ చేస్తాయని చెప్పారు. ఇక బీఎస్పీ-ఐఎన్ఎల్డీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అభయ్ చౌతాలాను నిర్ణయించారు.

గతంలో పొత్తులు
1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో మొదటిసారిగా బీఎస్పీ-ఐఎన్ఎల్డీ మధ్య పొత్తు ఏర్పడింది. ఐఎన్‌ఎల్‌డీ ఏడు లోక్‌సభ స్థానాల్లో, బీఎస్పీ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒక లోక్‌సభ స్థానాన్ని (అంబాలా) గెలుచుకోగా.. ఐఎన్ఎల్డీ అభ్యర్థులు రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలు (కురుక్షేత్ర, హిసార్, సిర్సా, భివానీ)లను గెలుచుకున్నారు. ఇక 2018లో మరోసారి పొత్తు ఏర్పడింది. అయితే ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా రాణించలేదు. ముచ్చటగా మూడో పొత్తు తాజాగా ఏర్పడింది. వారం క్రితం న్యూఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని అభయ్ సింగ్ చౌతాలా కలిసి పొత్తు కన్ఫిర్మ్ చేసుకున్నారు.

రేపటి రాజకీయాల్లో మార్పు ఏమైనా వచ్చేనా?
ఇందిరా ఎమర్జెన్సీ తర్వాత దేశంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రభావం పెరిగింది. అలా పెరుగుతూ వచ్చిన ప్రభావం కొంత కాలంగా తగ్గింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కూటమిలోలేని లోకల్ పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి. మూడో కూటమి లేకపోవడం కూడా ఇందుకు కారణం. అయితే తాజా కూటమి బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మూడో ప్రత్యామ్నాయ ఏర్పాటుకు అవకాశాలు కల్పించేలానే ఉంది. జాతీయ పార్టీగా గుర్తింపు ఉన్న బీఎస్పీకి దళిత్ ఓట్ బ్యాంక్ పుష్కలంగా ఉంది. హర్యానా ఎన్నికల్లో కనుక ఈ కూటమి ప్రభావం చూపగలిగితే తదుపరి లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking