నక్సలైట్ అగ్రనేత ముక్కు సుబ్బారెడ్డితో ఒకరోజు..
- యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
ఆరోజు 14 మే 2017.. హైదరాబాద్ మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద నిరీక్షణ..
‘‘డాక్టర్ గారు.. ముక్కు సుబ్బారెడ్డి గారు వస్తారా..? టైమ్ అవుతుంది గదా..?’’ డాక్టర్ శ్రీనివాస్ గారిని ప్రశ్నించాను. అతను కొండపల్లి సీతారామయ్య అనుచరుడిగా విశాఖ పట్నం ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమంలో చాలా కాలం పని చేశారు.
‘‘సుబ్బారెడ్డి గారు వృద్దాప్యంతో బాధ పడుతున్నాడని తెలుసు.. అయినా.. వస్తానని చెప్పారంటే తప్పకుండా వచ్చి తీరుతాడు.’’ నమ్మకంగా చెప్పాడు డాక్టర్.
తూర్పు దిక్కున ఉదయించిన సూరీడు ఆకాశంలోకి రావడానికి పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో ఓ వృద్దుడు నడుస్తూ వస్తున్నారు.
‘‘అగో.. అతనే సుబ్బారెడ్డి..’’ అన్నారు డాక్టర్. ఇద్దరం ఎదురుగా వెళ్లాం.
ఇద్దరం నమస్తే చెప్పాం. అతనిని నేను గమనిస్తుండగానే..
‘‘ఇతను యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్’’
అని నన్ను పరిచయం చేశారు డాక్టర్.
ఆ తరువాత మణికొండలోని అద్దె ఇంటికి వెళ్లాం. చాయ్ తాగిన తరువాత ముక్కు సుబ్బారెడ్డి జీవిత విశేషాలు తెలుసుకోవడానికి నోట్ బుక్ పట్టుకుని ప్రశ్నలతో సిద్దంగా ఉన్నాను. కానీ.. అతను అప్పుడప్పుడు మాటల మధ్యలో సంబంధం లేని విషయాలు చెప్పుతున్నారనిపించింది. జ్ఞాపక శక్తి కూడా తగ్గినట్లుగా ఉంది.
చాయ్ తాగిన తరువాత..
—– ——
విలేకరి : సార్.. మీ ఊరు, జిల్లా ఏది..?
సుబ్బారెడ్డి : నేను పుట్టింది నెల్లూర్ జిల్లా కనిగిరి తాలుఖ గణేషుని పల్లి గ్రామం. అమ్మ పిచ్చెమ్మ, నాన సుబ్బారెడ్డి నా పేరే.
విలేకరి: మీ కుటుంబ గురించి…
సుబ్బారెడ్డి : నిరు పేద కుటుంబం. అమ్మ, నాన్న పొద్దంతా పని చేస్తేనే కుటుంబం గడిచేది. పేరుకు రెడ్డి కుటుంబం కానీ.. నిరుపేదరికంతో పెరిగాను. మేము తాటి ఆకులతో వేసిన గుడిసెలో నివాసం ఉండేవాళ్లం. అంటే మా ఆర్థిక పరిస్థితి గురించి మీకు అర్థం అవుతుంది గదా.. ఒక రోజు ఆ గుడిసె దగ్ధమై వీదిన పడితే బ్రతుకు తెరువు కోసం కొంత కాలం బర్మా వెళ్లి పని చేసుకొని బతుకాల్సి వచ్చింది.
విలేకరి: మీ విద్యాభ్యాసం..?
సుబ్బారెడ్డి : గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాను. నెల్లూర్ ప్రభుత్వ హాస్టల్ లో ఉండి ఇంటర్ పూర్తి చేసి 1962లో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఆ తరువాత ఎంటెక్ చదువుతుండగానే నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లాను.
విలేకరి : నక్సల్స్ ఉద్యమంతో మీ జర్నీ..?
సుబ్బారెడ్డి : నేను నెల్లూర్ లో పదవ తరగతి చదువుతున్నప్పుడే కమ్యూనిష్టులు ఎర్ర జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేయడం చూసే వాణ్ణి. 1952లో అనుకుంటా.. కమ్యూనిష్టు పార్టీని ప్రభుత్వం నిషేదించిన సందర్భంలో పుచ్చల పల్లి సుందరయ్య అనుచరుడు ఎవి సుబ్బరావు గారు ఆజ్ఞాతంలో ఉన్నప్పుడు తరచుగా కలిసే అవకాశం కలిగింది. కమ్యూనిష్టులు పేదల కోసం పోరాటాలు చేస్తారనే విషయం నా మదిలో ఉండి పోయింది. ఆ తరువాత 1962లో వరంగల్ రీజినిల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు నాకంటే సీనియర్ చంద్రశేఖర్ అలియాస్ చందు అంటే కొండపల్లి సీతారామయ్య కొడుకుతో పరిచయం ఏర్పాడింది. అప్పుడప్పుడు కొండపల్లి సీతారామయ్య మా కాలేజ్ కు వచ్చిన సందర్భంలో నక్సలిజం.. కమ్యూనిజం.. ధనికులు.. పేదలు.. దోపీడి.. వెట్టి శాకిరి వీటి గురించి మాకు చెప్పేవారు. అంతే.. చదువుకు స్వస్తీ చెప్పాను. నేను జాబ్ చేస్తే నా కుటుంబం బాగుపడుతాది. కానీ.. విప్లవం వస్తే సమాజం బాగుపడుతుందని అర్థం చేసుకుని నక్సల్స్ ఉద్యమంలో పని చేయడం మొదలు పెట్టాను.
విలేకరి : కొండపల్లి సీతారామయ్యతో మీ జర్నీ..?
సుబ్బారెడ్డి : పశ్చిమ బెంగాల్ లో చారు మజుందర్ నాయకత్వంలో ప్రారంభమైన గిరిజనుల తిరుగుబాటు విప్లవోద్యమం మైలు రాయిలాంటిది. ఆ ఉద్యమం తరువాత నక్సలైట్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. 1975 లోనే విప్లవం వస్తుందని మన జీవితాలు బాగుపడుతాయని చారు మజుందర్ చెప్పిన విషయంలో కొండపల్లి సీతారామయ్య ఏకీ భావించే వారు కాదు. దీర్ఘకాలిక సాయుద పోరాటంతోనే విప్లవం వస్తుందని ఆ పెద్దాయన చెప్పేవారు. తాను కూడా కొండపల్లి సీతారామయ్యతో ఏకిభావించి పూర్తి కాలం కార్యకర్తగా పని చేయడం ప్రారంభించాను.
విలేకరి : వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ కేంద్రంగా నక్సల్స్ కార్యకలపాలు నిర్వహించేవారని చెబుతారు. నిజమెనా..?
సుబ్బారెడ్డి : వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఆర్ ఇసీ.. అంటే రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పిలిచే స్థాయికి మా కార్యకలపాలు పుంజుకున్నాయి. ఆ ఆర్ ఇసీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది నక్సల్స్ ఉద్యమంలో పని చేస్తూ అమరులయ్యారు.
విలేకరి : కొండపల్లి సీతారామయ్య కొడుకు చంద్రశేఖర్ నక్సల్స్ ఉద్యమం గురించి ఎలా ఫీలయ్యేవారు..?
సుబ్బారెడ్డి : కొండపల్లి సీతారామయ్య కొడుకు చంద్రశేఖర్ తండ్రికి తగ్గ కొడుకు అనుకునేవాణ్ణి. నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందర్ ను కొండపల్లి సీతారామయ్య కంటే ముందుగా కొడుకు చంద్రశేఖర్ కలిసారు. గుంటూర్ జిల్లా గుత్తికొండ అడవులలో మూడు రోజుల పాటు జరిగిన రహస్య సమావేశంలో తెలంగాణ నుంచి కే.జీ. సత్యమూర్తి, చంద్రశేఖర్ ఇద్దరే వెళ్లారు. గమ్మతు ఏమిటంటే ఆ సమావేశంలో చారుమజుందర్ ఆధ్వర్యంలో స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడుగా చౌదరి తేజశ్వర్ రావు, సభ్యులుగా పంచాది క్రిష్ణమూర్తి, వెంపటాపు సత్యం, కైలాసం, చాగంటి భాష్కరుడులతో కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీలో కొండపల్లి సీతారామయ్యను స్టేట్ అడక్ కమిటీ మెంబర్ గా ఎన్నుకోవడం విశేషం. కానీ.. కొంత కాలానికి పోలీసులు చంద్రశేఖర్ ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఆత్మహత్యగా సృష్టికరించారు.
విలేకరి : వరంగల్ జిల్లాలో బైక్ ఎక్సిడెంట్ అయ్యింది గదా.. ఎలా జరిగింది..?
సుబ్బారెడ్డి : ఒడ్డెపల్లి మీటింగ్ కు వెళ్లి వస్తుండగా తాగిన ఒకరు బైక్ తో ఢీ కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమై రక్తం కారిందట. తీవ్ర గాయలైనవి. నేను సృహాలో లేకుండా పోయానట. వెంటనే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేసిన తరువాత హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ న్యూరాలిజిస్ట్ డాక్టర్ రాజిరెడ్డి నాకు చికిత్స అందించారట. నేను కోమలోకి వెళ్లి పోయాను. అందరూ బతుకడనుకున్నారట.. కానీ.. బతికాను. ఆరోగ్య వంతుణ్ణి కాగానే మళ్లీ కొండపల్లి సీతారామయ్యతో ఉద్యమ నిర్మాణంలో పని చేశాను.
విలేకరి : హైదరాబాద్ లో కమ్యూనిష్టు రాజకీయ శిక్షణ తరగతులు ఇచ్చిన సందర్భంలో మీ పాత్ర ఏమిటి..?
సుబ్బారెడ్డి : హైదరాబాద్ లోని రాంనగర్ గుండు వద్ద మా షెల్టర్ ఉండేది. అక్కడే యువకులకు, విద్యార్థులకు విప్లవ రాజకీయాలపై నేను, ఐవి సాంబశివరావు క్లాసెస్ ఇచ్చేవాళ్లం.. కొండపల్లి సీతారామయ్యను చూడాలనే అతృత అందరిలో ఉండేది. సురపనేని జనార్ధన్, మల్లిఖార్జున శర్మ, డాక్టర్ కొల్లూరు చిరంజీవులు, విశ్వేశ్వర్ రావు, కుమార్ రెడ్డి, డాక్టర్ భాష్కర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నర్సింగ్ రావు, డాక్టర్ వేణు, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ సూరీ, ముప్పళ్ల లక్ష్మన్ రావు, మల్లోజుల కోటేశ్వర్ రావు, మల్లోజుల వేణు గోపాల్ రావు, అల్లం నారాయణ, నారదాస్ లక్ష్మన్ దాస్, గాజర్ల రాజ్ కుమార్, గంగారా, శివాజీ, సాహూ ఇలా చాలా మంది కొండపల్లి సీతారామయ్య క్లాస్ లతో స్పూర్తి పొంది నక్సలైట్ ఉద్యమంలో చేరారు. అందులో కొందరు తప్పుకున్నారు. ముప్పళ్ల లక్ష్మణ్ రావు లాంటి వాళ్లు చాలా మంది ఇంకా పార్టీలోనే ఉన్నారు.
విలేకరి : పోలీసు వ్యవస్థ బలంగా ఉంటుంది. అయినా.. మీ కార్యకలపాలు ఎలా నిర్వహించే వారు..?
సుబ్బారెడ్డి : కొండపల్లి సీతారామయ్యకు ముందు చూపు ఎక్కువే. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జేన్సీ విదించినప్పుడు కనిపించిన కమ్యూనిష్టులను, నక్సలైట్లను పట్టుకుని పిట్టలను కాల్చినట్లు కాల్చివేసేవారు. ఆ సమయంలో ముఖ్యమైన కార్యకర్తలను ఆజ్ఞాతంలోకి పంపి ప్రజలలో ఒకరిగా పని చేస్తూ ఉద్యమ నిర్మాణం చేయాలని కొండపల్లి సీతారామయ్య ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. నక్సల్బరీ ఉద్యమం తరువాత జగిత్యాల్ జైత్రయాత్ర నక్సలైట్ ఉద్యమంలో మైలు రాయిలాంటిది.
విలేకరి : ఎమర్జేన్సిలో నాగపూర్ లో ఉత్తర తెలంగాణ ఫ్లీనరి జరిగిన సందర్భం..?
సుబ్బారెడ్డి : నాగపూర్ లో ఫ్లీనరి జరిగిన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఫ్లీనరి ఏర్పాటు చేస్తే పోలీసులకు తెలుస్తోందని నాగపూర్ లో ఏర్పాటు చేసాం.. అయితే.. డాక్టర్ కొల్లూరు చిరంజీవులు తండ్రి మరణించడని సత్య నారాయణ వ్రతం చేస్తే పురోహీతుడిగా సీఐడీ పోలీసు వచ్చాడు. కానీ.. మమ్మల్ని గుర్తించలేక పోయారు. ఇక పోతే.. అప్పటికే ఆరు నెలల ముందు నుంచి అల్లం నారాయణ, పోరెడ్డి వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, ఓంకార్ లతో పాటు పన్నెండు గురు నక్సలైట్లు కోరుట్ల పోలీసు స్టేషన్ లో అక్రమంగా బంధించారు.
ఆ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి వారిని విముక్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. అందుకు ముప్పళ్ల లక్ష్మన్ రావు, కుమార్ రెడ్డి, మల్లోజుల కోటేశ్వర్ రావుల నాయకత్వంలో దాడి చేయాలని చర్చించారు. కానీ.. ప్లీనరీ తరువాత నాగపూర్ నుంచి తిరిగి వచ్చెటప్పుడు పాముల రాంచందర్, గంగారాం ఇద్దరు ఆయుధాలతో పోలీసులకు పట్టుబడ్డారు. అంతే.. ఆ తరువాత కొండపల్లి సీతారామయ్య, చిరంజీవులు, ఎన్ సీ శివాజీ, కేజీ సత్యమూర్తి భార్య పార్వతి, విశ్వేశ్వరయ్య తదితరులను అరెస్టు చేశారు నాగపూర్ పోలీసులు. నక్సలైట్ ఉద్యమం నిర్మాణం చేయాలనే ఆలోచనకు పెద్ద దెబ్బ. అలాగే కొంత కాలంలోనే ముప్పళ్ల లక్ష్మన్ రావు నిజామాబాద్ లో అరెస్టు కావడం పార్టీకి నష్టమే జరిగింది. అప్పుడే దేశంలో జనత పార్టీ అధికారంలోకి రావడంతో నక్సలైట్లకు స్వేచ్ఛ దొరికింది. లేకుంటే కొండపల్లి సీతారామయ్యను పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేవారు.
విలేకరి : మీరు బాంబులు తయారు చేసేవారట గదా..?
సుబ్బారెడ్డి : నిజమే.. ఎంటెక్ చేసిన నేను ఉద్యమ నిర్మాణంలో భాగంగా బాంబులను తయారు చేసాను. ఓరోజు ఖమ్మం పట్టణంలోని రహస్య ప్రాంతంలో బాంబులు తయారు చేస్తుండగా బాంబు పేలింది. నా కడుపులో పెద్ద గాయం అయ్యింది. ఆ సమయంలో దీపావళి పండుగ ఉన్నందున బాంబు పేలిన సంఘటన పోలీసులకు తెలియలేదు.
విలేకరి : నక్సలైట్ ఉద్యమం వదిలి ప్రభుత్వానికి ఎందుకు లొంగి పోయారు..?
సుబ్బారెడ్డి : విద్యార్థి దశలో జరిగిన ఎక్సిడెంట్.. బాంబులు తయారు చేస్తుండగా బాంబు పేలి పెద్ద గాయం కావడంతో నా ఆరోగ్యం దెబ్బ తింది. నేను ఉద్యమంలో పని చేయలేనని భావించి జన జీవన స్రవంతిలో కలిసాను.
విలేకరి : నక్సలైట్ ఉద్యమంపై మీ అభిప్రాయం..?
సుబ్బారెడ్డి : అంతిమంగా విప్లవం వచ్చినప్పుడే పేదల బతుకులు మారుతాయి. నక్సలైట్ ఉద్యమంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది.
విలేకరి : కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ ఉద్యమం గురించి చెప్పాలంటే..?
సుబ్బారెడ్డి : కొండపల్లి సీతారామయ్య సమాజాన్ని చదివాడు. ఉద్యమంలో పని చేసే ప్రతి కార్యకర్తతో మాట్లాడి అతనికి సరిపోయే పని మాత్రం చెప్పే వారు. గెరిల్లా పోరాటం.. శతృవులను తిప్పి కొట్టడంలో వ్యూహాలు రచించడంలో అతనికి అతనే చాటి. నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య పాత్రను ఎవరు కాదనలేరు.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్