కాసింత సత్యం కలిసిన
పెద్ద అబద్దం ‘రజాకార్’ సినిమా
భారతదేశం అనేది ఒక కట్టుకథ. ఇదంతా ఒకే దేశమని ఎవరైనా అంటే దానంత అబద్దం ఇంకోటి లేదు. ఎందుకంటే, అనేక రాజ్యాలు, సంస్థానాలు, రాజులు ఉన్నప్పుడు వేటికవే ప్రత్యేక రాజ్యాలు/దేశాలు అవుతాయి. ఇప్పుడు చెబుతున్న భారతదేశంలో స్వాతంత్ర్యం ఇచ్చేనాటికి 560 సంస్థానాలు ఉన్నాయి అని అంటే 560 దేశాలు ఉన్నాయని అర్థం. వీటన్నిటిని తన అధీనంలోకి తెచ్చుకున్న బ్రిటిష్ ఈ ప్రాంతాలను విడిచిపోతూ ప్రతి సంస్థానానికి ఇండియన్ యూనియన్ లేదా పాకిస్తాన్ లో కలిసే హక్కు లేదా స్వతంత్ర్యంగా ఉండే హక్కును కల్పించాడు.
అట్లాంటి హక్కును సహజంగానే హైదరాబాద్ రాజ్యానికి వచ్చింది. అందుకే ఇండియన్ యూనియన్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ (యథాతద ఒప్పందం)ని హైదరాబాద్ రాజ్యంతో చేసుకుంది. హైదరాబాద్ రాజ్యం మీదుగా పోయే రైళ్ళను తనిఖీ చేసే హక్కుతో సహా అన్ని అధికారాలు ఈ రాజ్యానికి ఉన్నాయి. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో పేరు మీద హైదరాబాద్ ని హస్తగతం చేసుకుంది.
ఇక్కడే అసలు సమస్య. ఆపరేషన్ పోలో ప్రధాన ఉద్దేశం నిజాంని లొంగదీసుకోవడమే అయితే 1952లో మొదటి ఎన్నికలు జరిగేదాకా ఇండియన్ యూనియన్ సైన్యాలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి? ఎవరి మీద యుద్ధం చేశాయి? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కార్యకర్తలు పంచిన 10లక్షల ఎకరాల భూములను తిరిగి భూస్వాములకే ఎందుకు ఇప్పించింది? అప్పటిదాకా నిజాం రూమీ పెట్టుకుని ఊర్లలో దళిత, బహుజనులను పీడించిన దొరలకు ఎందుకు అండగా నిలిచింది?
నిజాంకి మద్దతుగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ సైన్యమే రజాకార్ వ్యవస్థ.
అయితే, దాని నాయకుడు ఖాసిం రజ్వీ అయినా దాంట్లో హిందూ దొరలూ ఉన్నారు. బందగీ ని చంపిందీ, ఐలమ్మ పంట లాక్కొనే ప్రయత్నం చేసింది విసునూరు దేశముఖ్. దొడ్డి కొమురయ్యని చంపిందీ అదే విసునూరు దొరల గుండాలే. అంతదాక ఎందుకు త్రివర్ణ పతాకం పట్టుకుని ర్యాలీ చేసినందుకు 23 ముగ్గురిని పొట్టనబెట్టుకున్న తెలంగాణ జలియన్ వాలా బాగ్ పరకాలలో కాల్పులకు ఆదేశం ఇచ్చిందీ అక్కడి తహసీల్దార్ విష్ణువేశ్వర్ రావు.
118 మందిని నిలబెట్టి కాల్చి చంపిన ఘటనలో వాళ్లని ఒక్కదగ్గరకు చేర్చి సైనికులకు పట్టించింది స్థానిక భూస్వామే. రాజు నిజామే అయినా, ప్రజలపై అకృత్యాలు చేసింది లక్షన్నర ఎకరాలున్న జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, లక్ష ఎకరాల కల్లూరు దేశముఖ్, యాభై వేల ఎకరాల విసునూరు దేశముఖ్, సూర్యాపేట దేశముఖ్. వీళ్ళ అకృత్యాలకు వ్యతిరేకంగానే గుత్పల సంఘం మొదలయింది. ఆ తరువాత సాయుధ పోరాటంగా మారింది.
ఒక్క ఖాసీం రజ్వీ ని చూపించి అత్యాచారాలు అంటే ఆ రజ్వీకి అనుచరులుగా ఉన్న హిందూ దొరల సంగతి ఏంటి? కొమురయ్యను చంపిన, షేక్ బందగిని చంపిన హిందూ దొరల ముఠాల సంగతేంటి? ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగీ తెలంగాణ చరిత్రను మాట్లాడుకోగలమా?
ఈ సందర్భంగా కామ్రేడ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ మాటను గుర్తు చేసుకోవాలి. “నిజాం వ్యతిరేక పోరాటమంటే ఇస్లాం వ్యతిరేక పోరాటమే.” అని ఖాసీం రజ్వీ అంటే “మాది నిజాం వ్యతిరేక పోరాటమే కాని ఇస్లాం వ్యతిరేక పోరాటం కాదు. నిజాం ఇస్లాం ప్రతినిధి కాదు.” అని అన్నాడు మఖ్దూమ్. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొహియుద్దీన్ ఉన్నారు.
ఇవాళ మోదీని విమర్శిస్తే ‘ఇది హిందూ మతంపై దాడి’ అని ఎలా అంటున్నారో, ఆనాడు ఖాసీం రజ్వీ కూడా అలానే అన్నాడు. రజాకార్ అంటే స్వయం సేవకుడు అని అర్థం. ఇప్పుడు హిందుత్వ అంటూ దాడి చేస్తున్న హిందూ అతివాద ఖాసీం రజ్వీల సినిమానే ‘రజాకార్’. యిద్దరి మోడస్ ఆపరెండి ఒకటే. ఒక కల్ట్ ఫిగర్ ని పెట్టుకుని అతడ్ని సమర్ధించడం. అది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కావొచ్చు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కావొచ్చు.
చరిత్రను వక్రీకరిస్తూ సినిమాగా వొదులుతున్న కొత్త రజాకార్ లను వ్యతిరేకించాల్సిన బాధ్యత హిందువులదే. ఆనాడు ముస్లిమ్ రజకార్ లకు వ్యతిరేకంగా ‘షోయబుల్లా ఖాన్’ రాశాడు. తద్వారా హత్య గావించబడ్డాడు. మఖ్దూమ్ సాయుధ పోరాటాన్ని ప్రకటించాడు.
తెలంగాణ లేదా ఆనాటి హైదరాబాద్ నేల మీద నిలబడి పటేల్ ని పొగడటం అంటే బ్రిటిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ ఆక్రమణలను సమర్ధించడమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా హైదరాబాద్ అనే ప్రత్యేక దేశం. దాడి చేసి ఇండియన్ యూనియన్ దీన్ని ఆక్రమించుకుంది. ఆక్రమంలో లక్షల మందిని ఇండియన్ యూనియన్ సైన్యాలు ఊచకోత కోశాయి. అందులో హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఆ సైన్యాల అత్యాచార బాధితుల్లోనూ ఈ రెండు మతాల ప్రజలున్నారు. దీనికి కారకుడు పటేల్.
– అరునంక్ లత