కారులో పిల్లల్ని వదిలేసిన పెద్దలు..
ఆ తరువాత ఏమైందంటే..?
నిర్దేశం, తిరుమల
కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే ఏదో ఓ రూపంలో వచ్చి ఆదుకుంటాడని భక్తుల నమ్మకం. ఆ కుటుంబానికి టాక్సీడ్రైవర్ల రూపంలో దేవుడు సాయం చేశాడు. తమ కంటి పాపలు ఆరిపోకుండా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు దూరం కాకుండా కాపాడాడు. తిరుమల వరాహస్వామి అతిథిగృహం వద్ద భక్తులు కార్లు పార్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఉదయం కూడా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. టాక్సీ డ్రైవర్లు కూడా అక్కడే పార్క్ చేస్తూ ఉంటారు. ఇలా డ్రైవర్లు అందరూ అక్కడే ఉన్న సమయంలో ఓ కారులో నుంచి అరుపులు వినిపించాయి. వెళ్లి చూస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి ఊపిరి ఆడని పరిస్థితి ఉంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కారు అద్దాలను పగులగొట్టి పిల్లలను కాపాడారు. నిజానికి పిల్లలను కార్ల వద్ద వదిలేయడం చాలా ప్రమాదం. ఆడుకుంటూ లోపలికి వెళ్లి డోర్లు వేసుకుంటే.. వారికి ఊపిరి ఆడదు. చనిపోతూంటారు. ఈ వారంలోనే వికారాబాద్‌లో ఇద్దరు చిన్న పిల్లలు ఇలా చనిపోయారు. ఎవరూ పట్టించుకోకపోతే ఆ పిల్లల పరిస్థితి కూడా అలాగే అయి ఉండేదని ఊహించుకుంటే.. ఒళ్లు జలదరించడం ఖాయం. ఈ పిల్లల తల్లిదండ్రులు నడక మార్గం ద్వారా తిరుమలకు వచ్చేందుకు కిందకు వెళ్లారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి కొండపైకి వచ్చారు. తల్లిదండ్రులు మొక్కు ప్రకారం నడుచుకుంటూ రావాలని కిందకు వెళ్లారు. పిల్లలు నడవలేరు కాబట్టి వారిని పైనే ఉంచారు. వారిని చూసుకోమని.. వారి పెదనాన్న గంగయ్యకు చెప్పారు. పిల్లలతో పాటు గంగయ్య కూడా ఉన్నారు. అయితే గంగయ్య.. పిల్లలను కారులో పెట్టి .. తాను పక్కకు వెళ్లిపోయారు. పిల్లల్ని అలా కారులో ఉంచి అలా వెళ్లిపోతే ప్రమాదమని గంగయ్యకు కూడా అవగాహన లేదు. తన చేతులతో తాను పిల్లలను ప్రమాదంలోకి నెట్టానని ఊహించలేకపోయాడు. అయితే టాక్సీ డ్రైవర్లు సమయానికి అక్కడ ఉండి కనిపెట్టడంతో పెనుముప్పు తప్పింది. కారు అద్దాలను పగులగొట్టి పిల్లలను కాపాడిన వెంటనే పోలీసులు.. ఆశ్వనీ ఆస్పత్రికి తరలించారు. వారికి పరీక్షలు చేసి మెరుగ్గా ఉన్నట్లుగా గుర్తించారు. చిన్నారులను నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన చిన్నారుల పెద్దనాన్నపై పోలీసులకు ట్రాఫిక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. నడక మార్గం నుంచి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు అప్పగించారు.