రాజకీయాల్లో హుందాతనం మిస్సవుతోందా ?
హైదరాబాద్, నిర్దేశం:
రాజకీయాల్లోహుందాతనం పాటించాలి. సభా మర్యాదలను గౌరవించాలి. సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అయితే ఏపీలో ఆ పరిస్థితి లేదు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు రానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. కనీసం ఆయన స్పీకర్ ఎంపిక సమయంలో కూడా సభకు హాజరు కాలేదు. స్పీకర్ ఎంపికలో ప్రతిపక్ష నేతదే కీలక పాత్ర. ఒకవైపు ప్రభుత్వ అధినేత, రెండో వైపు ప్రతిపక్ష నేత కలిపి స్పీకర్ ను గౌరవప్రదమైన కుర్చీలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఈ సాంప్రదాయానికి డుమ్మా కొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శాసనసభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. కొద్దిసేపటికి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అటు తరువాత ఆయన సభకు హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం వల్లే తాను సభకు హాజరు కాలేదని తేల్చి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని చెప్పుకొచ్చారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేశారు. పది నిమిషాలు సభలో కూర్చున్నారు. అటు తరువాత సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కనీసం గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినలేదు.అయితే తెలంగాణ శాసనసభకుహాజరయ్యారు బిఆర్ఎస్ పక్ష నేత కెసిఆర్. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సుమారు ఏడాదిన్నర తరువాత కెసిఆర్ సభకు హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిస్థాయిలో విన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు చెప్పినా.. కెసిఆర్ మాత్రం అసాంతం విన్నారు. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేయడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బయటికి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే కెసిఆర్, జగన్ మధ్య అదే తేడా అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ది వ్యూహాత్మక తప్పిదమని ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో శాసనసభను ఆయన వినియోగించుకోలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంతవరకు విపక్ష నేత కోసం పరితపిస్తున్నారని.. కానీ తాను ఒక విపక్ష ఎమ్మెల్యేను అన్న విషయాన్ని మరిచిపోతున్నారని ఎక్కువమంది గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. ఈ విషయంలో తన రాజకీయ మిత్రుడు కేసిఆర్ నుంచి గ్రహించాలని కూడా సూచిస్తున్నారు.