అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ

అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ

దడ పుట్టిస్తున్న ఏసీబీ దాడులు – అవినీతిపరులకు గట్టి హెచ్చరిక.

నిజామాబాద్, నిర్దేశం:

నిజామాబాద్ జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ (అవినీతిని నిరోధక శాఖ) ఉక్కుపాదం మోపుతోంది. చిన్న స్థాయి ఉద్యోగులే కాదు, ఉన్నతాధికారులు సైతం ఈ దాడుల కింద చిక్కుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు, రిజిస్ట్రేషన్, రోడ్డు రవాణా, మున్సిపల్ వంటి కీలక ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి నిరోధానికి ఏసీబీ తీసుకుంటున్న చర్యలు జిల్లాలో చర్చనియాంశంగా మారాయి.

#రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అవినీతి అధికారులు.

ఇటీవల ఏసీబీ పలు ప్రభుత్వ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్-రెజిస్ట్రార్, పోలీస్ స్టేషన్‌లో ఓ సబ్-ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ అధికారి, గ్రామ పంచాయతీ సెక్రటరీలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ తన దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకుని కేసులు నమోదు చేసింది. ఈ చర్యలతో జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర గుబులు నెలకొంది.

ఆర్టీఏలో అక్రమాలు – ఏజెంట్లపై నిఘా

రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో అవినీతి ముదిరిపోయిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అనధికారికంగా పని చేస్తున్న ప్రైవేట్ ఏజెంట్లు, బ్రోకర్లు ప్రభుత్వ అధికారుల సహకారంతో అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. బుధవారం ఏసీబీ భారీ దాడులు నిర్వహించి, అనేక అక్రమ లావాదేవీలను వెలుగులోకి తెచ్చింది. పలు ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు), డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత అధికారులపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

“వూ ఈజ్ నెక్స్ట్?” – భయంతో వున్న అవినీతి అధికారులు

ఏసీబీ తన దాడులను మరింత ఉద్ధృతం చేయడంతో అవినీతిపరులలో భయం నెలకొంది. ” నెక్స్ట్ ఎవరు?” అనే ప్రశ్నతో అవినీతికి పాల్పడే అధికారులు గజగజ వణుకుతున్నారు. ఏసీబీ దాడులు ఎప్పుడు, ఎవరిపై జరుగుతాయనే టెన్సన్ లో ఉన్నారు. అవినీతి మూలాలను అంతం చేయడానికి ఏసీబీ తీసుకుంటున్న చర్యలు గట్టి హెచ్చరికగా మారాయి.

అవినీతి ఫిర్యాదులు చేయండి

ప్రజలు కూడా అవినీతి అరికట్టేందుకు ముందుకు రావాలి. లంచం అడిగే అధికారుల వివరాలను ఏసీబీ కి తెలియజేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇస్తోంది.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అవినీతి నిర్మూలన కోసం తమ ఫిర్యాదుల కొరకు క్రింది విధంగా సంప్రదించవచ్చు:

టోల్-ఫ్రీ నంబర్: 1064

WhatsApp హెల్ప్‌లైన్: 9440446106

ఇమెయిల్: dg_acb@telangana.gov.in

వెబ్‌సైట్: https://acb.telangana.gov.in

ఏసీబీ చర్యలు – ప్రజల నమ్మకానికి పునాదిగా

ఏసీబీ నిరంతర చర్యలు అవినీతి నిరోధంలో కీలకంగా మారాయి. అవినీతి అధికారులను పట్టుకుని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల విశ్వాసం పెరగడానికి తోడ్పడుతోంది. లంచాలు, అక్రమ వసూళ్లకు తెరదించేందుకు ఏసీబీ తీసుకుంటున్న కఠిన చర్యలు జిల్లాలో పారదర్శక పరిపాలనకు రోల్ మాడల్ గా మారాలని ఆశిద్దాం.

(నిర్దేశం ప్రత్యేక కథనం – నిజాయితీకి నిర్వచనం. చదవండి, షేర్ చేయండి నిర్దేశం తెలుగు పత్రిక)

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »