60 ఏళ్లు దాటిన వృద్ధులు,
18 ఏళ్ల లోపు బాలికలతో సంఘాలు
హైదరాబాద్, నిర్దేశం:
సమాజంలోని అన్ని వర్గాలతో విజయాన్ని పంచుకోవాలనే స్పష్టమైన సందేశంతో ఇందిరా మహిళా శక్తి మిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే చరగలరు. ఇప్పుడు 15-18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలను, వృద్ధ మహిళలను కూడా స్వయం సహాయక సంఘాల పరిధిలోకి తీసుకురానున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ పేరుతో ఈ డాక్యుమెంట్ విడుదల చేసింది. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేసింది. మహిళల కోసం ఏం చేయబోతోంది. ఏం చేసింది. వారి ఉపాధి కోసం చేపట్టబోయే పనులను అన్నింటినీ వివరించింది. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు బాలికలు తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. చాలా కీలకమైన ఈ దశలోని వారు వృద్ధిలోకి రావడానికి చేయూత ఇస్తామంటోంది ప్రభుత్వం. మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా, మంచి వాతావరణం సృష్టించడం చాలా ముఖ్యం. అభివృద్ధి ప్రక్రియలో వారిని క్రియాశీల భాగస్వాములుగా చేయడం అవసరం. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, ఉపాధి కోసం కొత్త, వినూత్న కార్యక్రమాలును రూపొందించాలని చూస్తోంది. వారిని సమగ్రంగా, సమన్వయ పద్ధతిలో శిక్షణ ఇస్తే సాధికారత సాధిస్తారని భావిస్తోంది. స్వయం సమృద్ధి సాధిస్తారని తెలుపుతోంది. అందుకే వారిని మహిళా స్వయం సహాయక సంఘాల్లో భాగం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. UNICEF భాగస్వామ్యంతో, తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 15-18 సంవత్సరాల వయస్సు బాలికల సంఘాలు ఏర్పాటు చేస్తుంది. మంచి ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక పరిజ్ఞానం, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి సాధికారత కల్పించనుంది. యుక్తవయస్సులోకి వచ్చే సరికి సాధికారికత సాధిస్తారని పేర్కొంది. వయసు పెరగడం, మారుతున్న కుటుంబ పరిస్థితులతో చాలా మంది వృద్ధులను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఒంటరిగా ఉంటూ ఆరోగ్య సంరక్షణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లకు వృద్ధుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. వీటి ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక మద్దతు, తోటి వారి సహాయం లభిస్తుందని చెబుతోంది. వృద్ధుల స్వయం సహాయక సంఘాలు పొదుపు చేయడానికి, రుణాలను పొందడానికి, నైపుణ్యాలను పంచుకోవడానికి ఉపయోగపడతాయి. సీనియర్ సిటిజన్‌లకు గౌరవం, స్వావలంబన, అభివృద్ధిలో భాగస్వామ్యం లభించనుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఘాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. తద్వార సభ్యులు సంతృప్తికరమైన జీవితాలు గడపడానికి వీలు కలుగుతుంది. తెలంగాణలో 15 లక్షల మంది వృద్ధులు వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. 7-8 లక్షల మంది సీనియర్ మహిళలు వృద్ధుల స్వయం సహాయక సంఘాల్లో చేరడానికి అవకాశం ఉంది. వృద్ధుల మహిళా సంఘాలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచడానికి హస్తకళలు, వ్యవసాయం, చిన్న వ్యాపారాలతో ప్రోత్సహించనున్నారు.