మిలియన్ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు
నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ పాలకుల ఆంక్షలకు తట్టుకొని.. నిర్భంధాలకు ఎదురొడ్డి.. అరెస్టులను ఎదురించి.. లక్షలాది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ట్యాంక్ బండ్‌పై గర్జించిన అపురూప సన్నివేశాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ పోరాట రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు జోహార్.. జై తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ‘మిలియన్ మార్చ్’తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సందర్భమని హరీశ్‌రావు అన్నారు. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా జనం తరలివచ్చారని గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ప్రస్థానంలో అదో కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవమని అన్నారు. ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి జలమార్గం గుండా టాంక్ బండ్ చేరుకొని, మిలియన్ మార్చ్ లో పాల్గొని నేటికీ 14 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. ఆ అపురూప దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని చెప్పారు. నాటి ఉద్యమ పోరాటాలు ఇంకా రగిలిస్తూనే ఉన్నాయని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి సెల్యూట్ అని అన్నారు. ప్రాణాలు సైతం అర్పించిన అమరులకు జోహార్ తెలిపారు.