జట్టు గెలుపు కోసం ఎత్తులు వేయడంలో దిట్ట
రోహిత్ శర్మ అరుదైనా నాయకుడు
విజయాల కోసం సొంత రికార్డులకు దూరం
న్యూఢల్లీ, నిర్దేశం :
రోహిత్ శర్మ కెప్టెన్సీలో అత్యధిక విజయాలు సాధించిన ఘనత ఉంది. 2023లో ప్రపంచకప్ కూడా చేతిదాకా వచ్చి పోయింది. అదొక్కటే రోహిత్ కెప్టెన్సీలో జరిగిన పొరపాటుగా చూడాలి. దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును గెలిపించడంలో రోహిత్ దిట్ట. ధోనీ తరవాత అత్యధిక సకస్సెస్ రేట్ అతనిదే. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ ఘనతలు పరిశీలిస్తే… ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, 2023 వన్డే ప్రపంచకప్ రన్నరప్ వంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన 55 మ్యాచ్‌ల్లో 41 గెలిచాడు. రోహిత్ విజయాల శాతం 75.92. సక్సెస్ రేటులో కోహ్లీ, ధోనీ కంటే ముందున్నాడు. ఒకే సైకిల్‌లో ఆసియాకప్ , టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. కెరీర్‌లో ఏ బ్యాటర్‌కు సాధ్యం కానివిధంగా మూడు వన్డే డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ కెప్టెన్‌గా పూర్తిగా జట్టుకు అంకితమయ్యాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అతడు గణాంకాలను పట్టించుకోకుండా విజయం కోసమే ఆడటం మొదలుపెట్టాడు.
ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసి.. ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం అతడి నైజం. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్‌లో అతడు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదుసార్లు 40ల్లో వికెట్ సమర్పించుకొన్నాడు. అయినా.. ఒక శతకం, రెండు అర్థశతకాలు వచ్చాయంటే ఏ స్థాయిలో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఆ టోర్నీలో ఏకంగా 597 పరుగులు చేశాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీఫైనల్స్ లో తన వైఖరికి పూర్తి విరుద్ధంగా 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఓపిగ్గా పిచ్‌పై ఎక్కువ సేపు ఉండేందుకు యత్నించాడు. ఇక తాను ఫామ్‌లో లేనని.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్ నుంచి స్వచ్ఛందంగా వైదొలగి బెంచ్‌పై కూర్చోవడం రోహిత్‌కే చెల్లింది. అదే హిట్‌మ్యాన్ దుబాయ్‌లో జరిగిన ఫైనల్స్‌లో నిలబడి విజయం అందించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్.. టీ20 వరల్డ్‌కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. మూడు మెగా టోర్నీల్లో కలిపి భారత్‌కు ఒక్కటే ఓటమి..! వరుసగా మూడుసార్లు ్గªనైల్స్‌కు చేర్చడమే కాదు.. అందులో రెండుసార్లు జట్టుకు టైటిల్స్‌ను అందించడం అంటే సామాన్యం కాదు. భారత క్రికెట్ కెప్టెన్సీలో సరికొత్త ప్రమాణాలను రోహిత్ పరిచయం చేశాడు.
రోహిత్ శర్మ నాయకత్వంలో వ్యూహాల విషయంలో భారత జట్టు మిగిలిన టీమ్‌లకు అందనంత దూరంలో ఉంది. మైదానంలో ఏం చేయాలి.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరి పాత్ర ఏమిటీ అనే దానిపై సభ్యులకు క్లారిటీ ఉంటుంది. ప్రస్తుత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్‌ను పైకి తేవడం.. రాహల్‌ను ఫినిషర్‌గా దింపడం వంటివి దీనిలో భాగమే. వ్యక్తిగత గణాంకాలకు దూరంగా ఉంటూ విజయాలను అందించే విషయంలో మిగిలిన ఆటగాళ్లకు రోహిత్ ఆదర్శంగా నిలిచాడు. ఆ తర్వాత నుంచే టీమ్ ఇండియాలో ’సెల్ఫ్‌లెస్’ ప్లే వైఖరి మెరుగుపడిరది. ఈ సిరీస్‌లో శ్రేయస్, కేఎల్ రాహుల్, అక్షర్, హార్దిక్ బ్యాటింగ్‌ల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జట్టులో ఫిట్‌నెస్‌పై ఆసక్తిని మాజీ కెప్టెన్ కోహ్లీ పెంచాడు. అలానే సెల్ఫ్‌లెస్’ ఆటను రోహిత్
ముందుకు తీసుకెళ్లాడు. రోహిత్ తన సహచరులను సంపూర్ణంగా నమ్ముతాడు. వారిపై వచ్చే విమర్శలు పట్టించుకోడు. దీనికితోడు వారు ఫామ్ విషయంలో ఇబ్బందుల్లో ఉంటే తగినన్ని అవకాశాలు ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. ముఖ్యంగా గిల్ వంటి యువ ఆటగాడు ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నా.. అతడి స్థానాన్ని మార్చలేదు. షవిూ వంటి సీనియర్ గాయం నుంచి కోలుకొని బోర్డర్ గావస్కర్‌ట్రోఫీ ఆడేందుకు జట్టులోకి రావాలని యత్నించినా.. రోహిత్ అంగీకరించలేదు. అతడు పూర్తిగా కోలుకోకుండా వచ్చి గాయం తిరగబెట్టడం తనకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పాడు. ఫలితంగా షవిూ పూర్తిగా కోలుకొని ఛాంపియన్స్ ట్రోఫీ ఆడి విజేతగా నిలవగలిగాడు.రోహిత్ గంటలకొద్దీ ప్రత్యర్థి ఆటగాళ్ల వీడియోలు చూస్తూ గడుపుతాడు. వారి లోపాలు.. బలహీనతల ఆధారంగా తన వ్యూహరచనకు పదును పెట్టుకొంటాడు. కాకపోతే.. తాను చూసింది.. మనసులో అనుకొంది మొత్తం చెప్పి బౌలర్లను గందరగోళానికి గురిచేయకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పడం రోహిత్ ప్రత్యేకత. రోహిత్ మైదానంలో ఒత్తిడిని కనిపించనీయడు. జట్టు ఓటమి అంచున ఉన్నా.. గెలుపునకు చివరివరకు ప్రయత్నించడం అతడి స్టైల్. 2018 ఆసియాకప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై చివరి బంతికి జట్టు విజయం సాధించింది. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచ్ దీనికి ఉదాహరణ. స్టబ్స్, మిల్లర్, క్లాసన్ నిలకడగా దక్షిణాఫ్రికాను విజయం వైపు నడిపిస్తున్న వేళ హార్దిక్‌ను రంగంలోకి దించి ఫలితం రాబట్టాడు. 15వ ఓవర్ తర్వాత నుంచి మ్యాచ్‌పై పట్టుబిగించి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో రచిన్-యంగ్ జోడీ బలపడుతున్నవేళ పరిస్థితి చేజారక ముందే.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ను రంగంలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు. మ్యాచ్ మొత్తంలో స్పిన్నర్లతోనే 38 ఓవర్లు వేయించాడు. ఫలితంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చాలా మందకొడిగా సాగింది. ఇలా వ్యూహాలు పన్నుతూ జట్టుకు విజయాలు అందించడంలో రోహిత్ మేటి అని చెప్పక తప్పదు.