ఆ ప్రేమికులు జైలుకే..
– అడ్డున్న ఇద్దరు మహిళల హత్య
సికింద్రాబాద్,నిర్దేశం:
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అరవింద్,లక్ష్మి లు పథకం ప్రకారమే జ్ఞానేశ్వరి, సుశీలను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. తమ ప్రేమ బంధానికి అడ్డు వస్తున్నారని భావించి తన ప్రేయసి సహకారంతోనే ఆమె రక్తసంబందీకులైన తల్లిని, సోదరిని చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఈనెల మూడవ తేదీన మొదటగా లాలాగూడ లో నివాసం ఉంటున్న జ్ఞానేశ్వరిని అరవింద్ తన ప్రేయసి లక్ష్మీ సహకారంతో అంతమొందించినట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం సమయంలో భరత్ నగర్ లో లక్ష్మీ తల్లి సుశీలను చీరతో గొంతును ఆమె మొహం పై దాడి చేసి హతమార్చాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ కు సుశీల నాగయ్యల కుమార్తె లక్ష్మి కి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ లాలాగూడ లో రైల్వే లో తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అరవింద్, లక్ష్మీల మధ్య ప్రేమాయణం మొదలైంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి తల్లి సుశీల సోదరీ జ్ఞానేశ్వరి పలుమార్లు లక్ష్మీని వారించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు లక్ష్మిని ఇదంతా మానుకోమని చెప్పడంతో ఆమె వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టింది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో ఏం చేయాలో పాలు పోక వాళ్లను చంపేందుకు అరవిందుతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అనుకున్నా విధంగానే మార్చి మూడున జ్ఞానేశ్వరిని చంపి మిర్జాలిగూడ నిర్మానుష ప్రదేశంలో పడేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నిన్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భరత్ నగర్ లో తల్లి సుశీల హత్య జరగడంతో ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యలుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తమ ప్రేమ బంధానికి అడ్డు వస్తే కుటుంబీకులను సైతం మట్టు పెట్టాలన్న ఆలోచన చేసిన లక్ష్మి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా, ఇద్దరు మహిళలను దారుణంగా హతమార్చిన అరవింద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల అదుపులో ఉన్న లక్ష్మీని పలు రకాలుగా ప్రశ్నిస్తూ ఆమె నుండి వివరాలు ఆధారాలు సేకరిస్తున్నారు.