బెంగళూరు కేంద్రంగా వైసీపీ పాలిటిక్స్
విజయవాడ, నిర్దేశం:
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో చేరికలకు అంతా సిద్ధమయినట్లు తెలిసింది. సీనియర్ నేతలు ఎక్కువ మంది వైసీపీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా జగన్ కూడా తన కుటుంబ సభ్యులు రాజకీయంగా దూరం కావడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా భావించే వారిని పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. అది ప్రజల్లో మంచి సంకేతాలను పంపుతుందని, తనకు నైతికంగా బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినప్పటికీ శాసనసభ స్థానాలు యాభై వరకూ పెరుగుతుండటంతో సీనియర్ నేతల అవసరాన్ని గుర్తించి వారిని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కీలక సామాజికవర్గానికి చెందిన నేతలతో జగన్ టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. కొందరు నేతలు నేరుగా బెంగళూరుకు వెళ్లి కలిసి వస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో చేరితే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇస్తున్నట్లు సమాచారం. కొందరు సీనియర్ నేతలు రాజకీయాల పట్ల ఆసక్తి చూపకపోయినా, వారి వారసులను పార్టీలోకి తీసుకు వస్తే కొంత వరకూ ఫలితం ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయన బెంగళూరులోనే రివ్యూ చేసుకుంటూ ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ లో వైఎస్ కు సన్నిహితులుగా ఉన్న వారు ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నా వారు సంతృప్తికరంగా లేరు. ఇది గమనించిన వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలోని ఒక మాజీ కేంద్ర మంత్రిని సంప్రదించినట్లు సమాచారం. సామాజికవర్గంతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న ఆ నేతను పార్టీలో చేర్చుకుంటే అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశముందని భావిస్తున్నారు. ఆయన కూడా తనకు ఎంపీ టిక్కెట్ కావాలని కోరగా, అందుకు జగన్ ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీలో చేరిన సాకే శైలజానాధ్ ద్వారా మరికొందరు కీలక నేతలను పార్టీలో చేరేలా రాయబారం నడుపుతున్నట్లు సమాచారం అందుతుంది. బెంగళూరు నుంచే అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫైన్ డే వారికి కండువా కప్పేయాలని జగన్ ఆలోచనగా ఉందంటున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను తీసుకురాగలిగితే తనను టార్గెట్ చేసిన సోదరి వైఎస్ షర్మిలకు కూడా చెక్ పెట్టవచ్చని జగన్ వ్యూహంగా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పటికే వైసీపీవైపు రావడంతో పాటు ఆ పార్టీ గత మూడు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తన పార్టీకి మొన్నటి ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. అంతా సక్రమంగా జరిగితే జగన్ జిల్లాల పర్యటనలు ప్రారంభం అయ్యే ముందు పెద్దయెత్తున చేరికలు ఉంటాయని, అందుకోసం బెంగళూరు కేంద్రంగా భారీ ప్లాన్ ను జగన్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఎవరెవరు ఫ్యాన్ పార్టీ వైపు వస్తారన్నది. కానీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉండటంతో ఇప్పుడే వస్తారా? మరికొంత కాలం వెయిట్ చేస్తారా? అన్నది చూడాలి.