పాపం.. పోసాని
నోరు ఎత్తని సినీ ప్రముఖులు
విజయవాడ, నిర్దేశం:
దక్షిణాదిన రాజకీయాలు సినిమాలు ఒకటిగా కలిసిపోయి చాలా దశాబ్దాలే దాటింది. సినిమాల నుండి వచ్చిన ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత పవన్ కళ్యాణ్ వంటి వారు ఉన్నత పదవులు అధిరోహించారు. ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులైన వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు. జనాల్లో సినిమా వాళ్ళకు ఉండే క్రేజ్ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని పార్టీలు సినీ రంగంతో వీలైనంత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి. కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఎవరు దీనికి అతీతులు కాదు. అయితే ఈ విషయంలో వైసిపి పూర్తిగా వెనకబడిందనే చెప్పాలి. వైసిపి మద్దతుదారుడుగా ఉన్న పోసాని కృష్ణ మురళి అరెస్టు అయితే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్ నుంచి స్పందించలేదు. నిన్న మొన్నటి వరకు అధికారం లో పార్టీకి ఇలాంటి దుస్థితి ఏర్పడడం వెనక స్వయంకృతాపరాధాలే ఉన్న ఎక్కువ ఉన్నాయనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ కోణం లో వైసిపి ఒంటరి అయిపోయిందన్న వాదన బలపడుతోంది స్వయంగా సినిమా నుండి వచ్చిన ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కావడం టాలీవుడ్ తో ఆద్యంతం మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం టిడిపికి స్వతహాగా కలిసివచ్చే బలాలు.
సామాజిక వర్గం పరంగా టిడిపి అప్రోచ్ పరంగా టాలీవుడ్ లో టిడిపి కి సానుభూతిపరులు చాలామంది ఉన్నారు. ఎంత ఎలా అంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా కుదలైపోయింది టిడిపి అనే ప్రచారం జరుగుతున్న సమయంలోనూ కొంతమంది టాలీవుడ్ పెద్దలు స్టార్లు టిడిపి వెంటే ఉన్నారు. అశ్విని దత్ మురళీమోహన్ లాంటి బడా ప్రొడ్యూసర్లు స్వయంగా టిడిపి పార్టీ సభ్యులు. రాఘవేంద్రరావు, బోయపాటి లాంటి వాళ్ళు అయితే టిడిపి కోసం పని చేసిన చరిత్ర కలిగిన వాళ్లు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు చాలామంది ఆయనకు మద్దతుగా మాట్లాడిన వాళ్లే ఉన్నారు. ఎన్టీఆర్ తనయుడు టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు టాలీవుడ్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిరంజీవి మొదలుకొని మొత్తం మెగా ఫ్యామిలీ లో హీరోలు అందరూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు నైతిక మద్దతు ఇస్తున్నారు. పవన్ పిలిస్తే జనసేన వైపు రావడానికి టాలీవుడ్ లో కొంతమంది రెడీగా ఉన్నట్టు ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. టాలీవుడ్ నిర్మాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అల్లు అర్జున్ తో ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న బహిరంగంగా రెండు కుటుంబాల హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంఘటనలు ఎప్పుడు ఎదురు కాలేదు. రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు బలమైన సపోర్టుగా నిలిచారు. ఇప్పటికీ పాతకాలం ఆర్టిస్టుల్లో కాంగ్రెస్ సానుభూతిపరులు ఉన్నారు. వైయస్సార్ బతికున్నప్పుడు జయసుధ ప్రజారాజ్యం విలీనమైన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ లోనే కొంతకాలం కొనసాగారు. బిజెపిలోనూ సినిమా స్టార్లు బాగానే ఉన్నారు. అయితే ఈ సంఖ్య నార్తులో ఎక్కువ. తెలుగు రాజకీయాల్లోనూ గతంలో కోట శ్రీనివాసరావు లాంటివాళ్లు బిజెపి తరఫున ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి సైతం సినీ కుటుంబం నుంచి వచ్చినవారే. డైరెక్ట్ గా బీజేపీలో చేరకపోయినా సైదాంతిక పరంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే సినీ ప్రముఖులు సినీ రంగంలో బాగానే ఉన్నారు.మొదటినుంచి వైసిపి సినీ ప్రముఖులనాకట్టుకోవడంలో విఫలం అవుతూనే వచ్చింది. రాజశేఖర్ జీవిత లాంటి వాళ్ళు మొదట్లో వైసీపీలో చేరినా చాలా తొందరగానే బయటికి వచ్చేసారు. అక్కడి వ్యవహారాలు తమకు సూట్ కావని బహిరంగంగానే ప్రకటన ఇచ్చారు.
2019 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన మంచు మోహన్ బాబు కూడా కొద్ది కాలానికి దూరం అయిపోయారు. ఇక సినిమా ఇండస్ట్రీ పై జగన్ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూసిందనే విమర్శలు టాలీవుడ్ నుంచి వినబడతాయి. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను తన ఇంటి ముందు నడిపించి అవమానించారని ఒక వర్గం ఆరోపిస్తూ ఉంటుంది. సినీ నటుడు పృథ్వి కి ఎస్వీబీసీ చైర్మన్గా పదవి ఇచ్చినా ఆయన ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చేసారు. తనపై వైసీపీలో కుట్ర జరిగిందనేది ఆయన వెర్షన్. ప్రస్తుతం జనసేనలో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆలీ 2024 ఫలితాలు తర్వాత జగన్ కి బై బై చెప్పేశారు. పార్టీలో చేరకపోయినా మద్దతు దారుడు గా కొనసాగిన పోసాని కూడా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ఎన్నికల తర్వాత ప్రకటించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లొకేషన్ లపై తీవ్రమైన పదజాలంతో ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆయన అరెస్టు అయ్యేలా చేశాయి. కానీ విచిత్రంగా టాలీవుడ్ నుంచి ఆయనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పోసాని మాట ఎలా ఉన్నా అసలు వైసీపీ పార్టీనే టాలీవుడ్ నుంచి మద్దతు కోల్పోయిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. జగన్ ఫోటో తోటే ఎన్నికల్లో గెలుస్తాం తప్ప వేరే ఎట్రాక్షన్ స్టార్ పవర్ అవసరం లేదంటూ గతంలో వైసీపీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని టాలీవుడ్కు దూరం చేశాయని సినీ రంగ ప్రముఖులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల లాంటి ఒకరిద్దరు మాత్రం వైసీపీతో ఉన్నా ముందు వరుసలో ఉండే స్టార్లెవరూ వైసిపి లో లేరు. నందమూరి, మెగా ఫ్యామిలీ లకు సొంత పార్టీలు ఉన్నాయనుకున్నా ప్రభాస్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లైతే రాజకీయాల వాసనే దగ్గరకు రానివ్వరు. స్టార్ల విషయం పక్కన పెట్టి ఇతర ప్రముఖులు వైసిపి వైపు రావడానికి అక్కడి ఉన్న పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అన్నది అంతర్గత సమాచారం. సినిమా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్లడానికి అనువుగా ఉండాల్సిన సమన్వయం వైసీపీలో లేదనేది ఎక్కువగా వినబడుతున్న మాట. మరి వైసీపీ పెద్దలు ఈ విషయాన్ని పట్టించుకుంటారు లేదో చూడాలి.