కన్నతల్లిలా ప్రేమ చూపండి….కిషన్ కు రేవంత్ లేఖ
హైదరాబాద్, నిర్దేశం:
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ముందు గుర్తించండి. కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న మీరు.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించడంపై దృష్టి సారించండి. బెంగుళూరు, చెన్నై నగరాలపై చూపుతున్న ప్రేమ హైదరాబాద్ నగరంపై ఎందుకు చూపలేక పోతున్నారని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసిన కామెంట్స్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను సీఎం లేవనెత్తుతూ సీఎం లేఖలో పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ ఆధారంగా.. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిలో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రాజెక్ట్ ల మంజూరులో కేంద్ర మంత్రిగా మీ బాధ్యత గుర్తు చేస్తున్నానంటూ, సీఎం లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతారాహిత్యమన్నారు.
తెలంగాణలో 2023, డిసెంబరు 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు.భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి తమ సర్కార్ నడుచుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-11, ప్రాంతీయ రింగు రోడ్డు ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్ కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామన్నారు. ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు కానీ, ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు కిషన్ రెడ్డిని కలిసిన విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నట్లు సీఎం తెలిపారు.తెలంగాణకు జీవనాడి అయిన హైదరాబాద్ నగరంలో మెట్రో ఫేజ్ -1 69 కి.మీ నిర్మాణాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మెట్రో రాకతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని లేఖలో వివరించారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫీజ్-2 ప్రాజెక్ట్లపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు.
ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ మెట్రో ఫీజ్-11 ప్రాజెక్టులపై పూర్తి దృష్టిసారించినట్లు తెలిపారు. హైదరాబాద్ నలుమూలలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు వీలుగా మెట్రో సేవలను విస్తరించడమే లక్ష్యంగా 5 కారిడార్లను ప్రతిపాదించామన్నారు.నాగోల్ – రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36.8 కి.మీ. రాయదుర్గం – కోకాపేట నియోపొలిస్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ, మియాపూర్ – పటాన్ చెరు 13.4 కి.మీ, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ 7.1 కి.మీ మార్గాల నిర్మాణానికి రూ.24,269 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించాలని నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి 2024, జనవరి 4వ తేదీన వినతిపత్రం అందజేసిన విషయాన్ని సీఎం లేఖలో వివరించారు. తర్వాత 2024, అక్టోబరు ఏడో తేదీన ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ప్రతిపాదనలు అందజేశానన్నారు. 2024, డిసెంబరు 12వ తేదీన ఢిల్లీలో మీతో సమావేశమై హైదరాబాద్ మెట్రో ఫీజ్-11 ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను తెలియజేసి లేఖను అందజేసినట్లు కిషన్ రెడ్డికి సీఎం గుర్తు చేశారు.ఈ ఏడాది జనవరి 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆయనను కలిసి మెట్రో ఫేజ్-11 ప్రాధాన్యాన్ని సవివరంగా తెలియజేసినట్లు సీఎం లేఖలో వివరించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఇదే అంశంపై లేఖ అందజేశానన్నారు. మెట్రో ఫేజ్-IIకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని అన్ని లేఖల్లో స్పష్టంగా వివరించాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, తెలంగాణ నుంచి మీరు కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలోనే 2021, ఏప్రిల్లో బెంగళూర్ మెట్రో ఫేజ్-11 అంచనా వ్యయం రూ. 14,778 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూర్ మెట్రో ఫేజ్-1 అంచనా వ్యయం రూ.15,611 కోట్లు, 2024, అక్టోబరులో చెన్నై మెట్రో ఫేజ్-11 అంచనా వ్యయం రూ.63,246 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు.హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని ఏడాది కాలంగా మేం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న విజ్ఞప్తి చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉండడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరు అందించే మూసీ నది పునరుజ్జీవనంపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పునరుజ్జీవనంలో భాగంగా గోదావరి నీటిని మూసీతో అనుసంధానించడం, 55 కిలోమీటర్ల మేర మూసీకి ఇరువైపులా ఎస్టీపీల నిర్మాణం-వారసత్వ వంతెనల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ఇంత కీలకమైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను 2024, జులై 22వ తేదీన కలిసి వివరాలతో కూడిన లేఖను అందజేశామన్నారు. మూసీ పునరుజ్జీవంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూసీ పునరుజ్జీవంపై లేఖను అందజేశానన్నారు. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడంతో పాటు నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు నగరాన్ని అనుసంధానించేందుకు ప్రాంతీయ రింగు రోడ్డు ఎంతో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తాను రాసిన లేఖలో వివరించారు.