నార్సింగి దగ్గర కొత్త ఎగ్జిట్
హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి ఓఆర్ఆర్‌ను నిర్మించారు. ఇప్పుడు ఔటర్ పైనా ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించడానికి హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎగ్జిట్ పాయింట్‌ను నిర్మిస్తోంది.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అటు ఓఆర్ఆర్ అవతల వెస్టర్న్ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. ఈ కష్టాలను తగ్గించడానికి హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నానక్‌రామ్‌గూడ ఇంటర్ ఛేంజ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.వాహనాల రద్దీని తగ్గించడానికి కొత్త ఎగ్జిట్‌ను నిర్మిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన సూచనల ప్రకారం.. నానక్‌రామ్‌గూడ ఇంటర్ ఛేంజ్ దాటిన తర్వాత, నార్సింగి టోల్ ప్లాజా ముందు కొత్త ఎగ్జిట్‌ను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది, మార్చిలో దీనిని ప్రారంభించాలని హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.కొత్త ఎగ్జిట్ లక్ష్యం రద్దీని తగ్గించడం అని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా గచ్చిబౌలి నుండి నార్సింగి వరకు ఉన్న మార్గంలో.. నార్సింగి ఇంటర్ ఛేంజ్ రోటరీ దగ్గర తరచుగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. అటు కోకాపేట వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా వాహనాల రద్దీని తగ్గించేలా నిర్మాణాలు చేపడుతున్నారు.జూలై 2023లో నార్సింగి ఇంటర్ ఛేంజ్‌ను ప్రారంభించారు. దీనిద్వారా ప్రయాణం సులభమైంది. వేలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగించింది. ఇది నార్సింగి, మంచిరేవుల, గండిపేట వంటి ప్రాంతాలను కలుపే కీలక జోన్‌గా మారింది. మరోవైపు విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి తొందరగా చేరుకోవచ్చు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలోని పొడవైన రింగ్ రోడ్లలో ఒకటి. ఇది 8 లేన్ల రహదారి. హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ. 6,696 కోట్లు ఖర్చు అయింది. 2012 డిసెంబర్‌లో దీన్ని ప్రారంభించారు. ఇది నగర శివార్లలోని ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.