అక్కడ కెసిఆర్.. ఇక్కడ జగన్.
హైదరాబాద్, నిర్దేశం:
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు అలెర్ట్ అవుతున్నాయి. విపక్ష నేతలు బయటకు రావడం ప్రారంభించారు. అధికార పార్టీతో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. అయితే ఓటమి తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. సుమారు 14 నెలల అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. సమీక్షలు మొదలుపెట్టారు. ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి జనం బాట పడుతున్నారు. పార్టీ నేతల పరామర్శతో పాటు గుంటూరు మిర్చి యార్డు రైతులను పరామర్శించారు. ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఆరు నెలల వ్యవధిలోనే అధికారాన్ని కోల్పోవడం విశేషం.వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కెసిఆర్. 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించింది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్. 2018లో సైతం రెండోసారి అధికారంలోకి రాగలిగింది. 2023 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 14 నెలల అనంతరం కెసిఆర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేతలతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, ప్రభుత్వ వైఫల్యాలతో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని.. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమని తేల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర ఏళ్ల కాలం ఉంది. తప్పులు సరిదిద్దుకునేందుకు సమయం కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనం కావడం, తెలంగాణ కాంగ్రెస్ లో సైతం వర్గాలు నడుస్తుండడంతో కెసిఆర్ మరింత యాక్టివ్ అవుతున్నారు.ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి చాలా రకాలుగా యాక్టివ్ అవుతున్నారు. పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. అయితే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపడుతున్నారు. పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులను ప్రశ్నిస్తున్నారు. ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెబుతున్నారు. అయితే ఇక్కడ కూడా టిడిపి కూటమికి నాలుగేళ్ల సమయం ఉంది. ఆపై అపర చాణిక్యుడు చంద్రబాబు ఉన్నారు. అంత ఈజీ కాదని తెలిసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఒకేసారి స్నేహితులిద్దరూ తెరపైకి రావడం చర్చకు దారితీస్తోంది. వీరిద్దరూ పరస్పర రాజకీయ ప్రయోజనాలు చేసుకున్న వారే. కానీ ఇద్దరు తమ సొంత రాష్ట్రాల్లో ఓడిపోయారు. భారీ అంచనాలతో రంగంలోకి దిగి చతికిల పడ్డారు. అయితే ఇప్పుడు ఒకేసారి ఇద్దరు క్రియాశీలకం కావడం మాత్రం చర్చకు దారితీస్తోంది. ఒక ప్రత్యేక వ్యూహంతోనే ఇద్దరు ఒకేసారి జర్నీ ప్రారంభించినట్లు అర్థమవుతోంది. చూడాలి వారి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.