మాదిగల్ని రాజకీయ బానిసలను చేస్తున్న మందకృష్ణ
హైదరాబాద్, నిర్ధేశం :
బాబాసాహేబ్ అంబేద్కర్ ను అణచివేసేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. అవన్నీ విఫలమవడంతో చివరికి దళితుల కంటిని దళితుడి చేతే పొడిపించాలని బాబూ జగ్జీవన్ రాంని ముందుకు తీసుకువచ్చింది. అంబేద్కర్ ను ఎంపీగా కూడా గెలవనివ్వలేదు కాంగ్రెస్. అలాంటిది.. జగ్జీవన్ రాంను అతి చిన్నవయసులోనే కేంద్ర మంత్రిగా తీసుకున్నారు జవహార్ లాల్ నెహ్ర. పాపం.. బాబాసాహేబ్ ను అడ్డుకోవడం జగ్జీవన్ రాం వల్ల కూడా కాలేదు. కానీ, చాలా మంది దళితుల్ని అంబేద్కర్ వరకు వెళ్లకుండా, కాంగ్రెస్ పార్టీకి కట్టుబానిసల్ని చేయడంలో జగ్జీవన్ రాం సక్సెస్ అయ్యారు. బాబాసాహేబ్ మరణాంతరం ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. బాబాసాహేబ్ పెట్టిన పార్టీనే కాంగ్రెస్ పార్టీకే అమ్మేశారు.
ఇలాంటి జగ్జీవన్ రాంను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తుల ఉద్దేశాలు, ఉద్యమాలు ఎలా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఎంఆర్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ఉద్యమం, మందకృష్ణ పోరాటం కూడా జగ్జీవన్ రాం ఉద్యమానికి కొనసాగింపని చెప్పుకోవచ్చు. చాలా మంది మాదిగలు ఒప్పుకోకపోవచ్చు కానీ, 21వ శతాబ్దంలో తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు ఎక్కువగా నష్టపోయింది మందకృష్ణ వల్లనే. ఈ విషయం తెలిసి కొందరు, తెలియక కొందరు ఆ ఉచ్చులోనే పడిపోతున్నారు. దళితుల్లో దీనిపై ఇంకా గందరగోళమే ఉంది. కానీ, అగ్రకులాలకే మంచి క్లారిటీ ఉంది. అందుకే, మంద కృష్ణ ఉద్యమానికి మద్దతు ఇవ్వని అగ్రకులం వాడు ఉండడు. ఇది పోరాట ఫలితమని కొందరు తొడలు కొట్టుకుందురు కాక. కానీ, నేటికీ అంబేద్కర్ ను ఇష్టపడని, ఏ దళిత ఉద్యమానికి మద్దతు ఇవ్వని వారు.. ఎంఆర్పీఎస్ వేదికెక్కి గొప్పలు చెప్తుంటేనైనా అర్థం చేసుకోవాలి కదా.
మాదిగలకు మాలలు శత్రువులా?
మంద కృష్ణ 30 ఏళ్ల పోరాటం ఎంత తిరగేసి చూసినా.. మాదిగల శత్రువులు మాలలు తప్ప ఇంకెవరూ కాదని తేలిపోతుంది. అసలు మాదిగలకు శత్రువులు మాలలు ఎట్లా అయ్యారని మందకృష్ణ కోణంలో చూస్తూ.. ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగల కంటే మాలలు ఎక్కువగా తీసుకున్నారన్నది ఆయన ఫిర్యాదు. సరే.. 60 ఏళ్ల రిజర్వేషన్ ఫలాల్లో అరలడ్డూ ఎక్కువ తిన్నందుకే అంత కోపం వస్తే.. 2000 ఏళ్ల నుంచి మాదిగలను బట్టలు ఊడదీసి తన్ని, రేపులు చేసి, వెట్టి చాకిరి చేయించి, మొలతాడు నుంచి ఊడపీక్కున్న అగ్రకులాల మీద ఎంత కోపం రావాలి? కనిపిస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా. కానీ, చిత్రంగా వీరిపై మందకృష్ణకు కోపం లేదు. పైగా వారితోనే క్లోజ్ ఫ్రెండ్షిప్. మాదిగల మీటింగ్ కి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్. హరగోపాల్ చీఫ్ గెస్ట్. చిత్రంగా ఉంది కదా. ఇదే సమయంలో మాదిగల హీనమైన బతుకుకు 0.0001% కూడా తేడా లేని మాలల ప్రస్తావన రాగానే ఒంటికాలి మీద లేస్తారు. బుర్రలో నువ్వు గింజంత మెదడు ఉన్నా.. ఈ ఆలోచన వచ్చి తీరాలి.
అంబేద్కర్ కు పచ్చి వ్యతిరేకి మందకృష్ణ
కొంత కాలంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అంబేద్కర్ ప్రధానంగా కనిపిస్తారేమో కానీ, అంబేద్కర్ అంటే మందకృష్ణకు అంతగా గిట్టదు. ఏదో తప్పదన్నట్లు ఫొటోల్లో ఉంటారు. అంబేద్కరేమో హుందాగా సూటు వేసుకుని, కుల వృత్తులు మాని, గొప్పగా జీవించాలని సందేశం ఇస్తే.. మందకృష్ణనేమో ఐఏఎస్, ఐపీఎస్ అయినా సరే.. జబ్బకు డప్పు వేసుకుని తిరగాలంటున్నారు. అంటే, అదే కుల వ్యవస్థలో కునారిల్లమని చెప్తున్నారు. ఇక వర్గీకరణ విషయం మాట్లాడుకుంటే.. ఈ దేశంలో ఏ రెండు కులాలు ఒకటి కాదు. 3,000 కులాల్లో దేనికదే. రెడ్డికి యాదవకి ఎంత దూరమో. యాదవకి మాదిగకు అంతే దూరం. మాదిగకు మాలకు అంతే దూరం. ప్రజల్ని కులాలుగా విడదీసి వారిని బానిసల్ని చేశారు.
ఏ కులానికి ఇంకో కులం అంటే పడదు కాబట్టి.. విడిపోయి 2,000 ఏళ్లుగా బానిసలుగానే ఉన్నారు. అందుకే.. అంబేద్కర్ ఈ కులాలను కలిపారు. వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వర్గీకరించి, ఈ కులాల జీవన విధానం, సామాజిక విధానం ఒకటి.. పలాని కులాలంతా షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే వర్గంగా ఉండాలని తీర్మానించారు. ఇంతటితో ఆగకుండా.. ఓటు హక్కు కల్పించి రాజ్యాధికారం సాధించుకోమన్నారు. కానీ, మందకృష్ణ ఎప్పుడూ ఓటు హక్కు గురించి కానీ, అధికారం గురించి కానీ మాట్లాడరు. మాలలు కొట్టేందుకు మాదిగల్ని రెచ్చగొడతారు. కానీ, అగ్రకులాల పెత్తనం కోసం దళితుల్ని కాదు కదా కనీసం మాదిగలకు పౌరుషం చెప్పిన మాట ఒక్కటీ లేదు. రిజర్వేషన్ అనే పోరాటంలో మాదిగల్లో రాజ్యాధికార కాంక్ష చంపేస్తున్నారు. ఓట్లేసే యంత్రాలుగానే మాదిగల్ని 30 ఏళ్లుగా ఏమారుస్తూ వస్తున్నారు.
కాన్షీరాంకు వ్యతిరేకంగానే మందకృష్ణ పోరాటం
యూపీ తర్వాత ఏపీ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతున్న సమయంలోనే ఎంఆర్పీఎస్ అనే సంస్థ పుట్టుకురావడం కాకితాళీయం అంటే నవ్విపోతారు. అందరికీ కావాల్సింది అధికారమే. మరి ఆ అధికారం వైపు దళితుల్లో ఆశలు రేగుతున్న సమయంలో రిజర్వేషన్ అనే మంట పుట్టడం దేనికి సంకేతం? మళ్లీ జగ్జీవన్ రాం పుట్టాడనే కదా అర్థం. కులాన్ని కూలదన్ని సమాజాన్ని కూడగట్టండని బహుజన సమాజ మహా నాయకుడు కాన్షీరాం నినదించారు. మందకృష్ణ చూస్తే.. కులాన్ని ఎలుగెత్తి సమాజాన్ని విడగొట్టు అనే నినాదం కనిపిస్తోంది. బడుగులు, బానిసలు, అల్పులు, అభాగ్యులు.. అందరూ కలిసి రండని కాన్షీరాం అంటే.. దరిద్రంలో బతుకున్న వారిలో తేడాలు ఎంచి గొడవలు పెడుతోంది ఎంఆర్పీఎస్ ఉద్యమం. మాల-మాదిగలు కలిసి లేరు కానీ, ఈ 30 ఏళ్లలో వారి మధ్య ఎంత శతృత్వం పెరిగిందో చెప్పొచ్చు. దీనివల్ల బహుజన్ సమాజ్ పార్టీ ఒకటొచ్చిందనే విషయమే మర్చిపోయారు. బీఎస్పీలో ఉన్నవారు కూడా.. మందకృష్ణకు జరుగుతున్న ప్రచారం.. ఎంఆర్పీఎస్ వేదికలపై అగ్రకుల రాజకీయ నాయకుల మద్దతు చూసి.. ఎదిరించలేకపోయారు. క్రమంగా తెలుగు నేల మీద బహుజన ఉద్యమం బలహీన పడటంలో మందకృష్ణ తనవంతు పాత్ర పోషించారు.
మాదిగల్ని రాజకీయ బానిసలను చేస్తున్న మందకృష్ణ
మొన్నామధ్య సూర్యపేటలో కులోన్మాద హత్య జరిగితే స్పందించని మందకృష్ణ. చిలుకూరి గుడి పూజారిని ఏదో అన్నారని పరుగులు పెట్టి ఓదార్పులు చేపట్టారు. ప్రతిరోజు దళితుల మీద ఏ కులాలు అయితే దాడులు చేస్తున్నాయో ఆ కులాలతోనే మందకృష్ణ అంటకాగుతున్నారు. వారికి ఓట్లేయమని చెప్తున్నారు. కేవలం వర్గీకరణ అనేది చూపించి, మాలల మీద ధ్వేషాన్ని పెంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించారు, టీడీపీకి ఓట్లేయించారు, టీఆర్ఎస్ కు ఓట్లేయించారు. ఇప్పుడు బీజేపీకి ఓట్లేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గంపగుత్త ఓటర్లుగా దళితుల్ని మార్చడంలో జగ్జీవన్ రాం లాగే మాదిగల్ని అగ్రకుల పార్టీలకు ఓట్లేసే బానిసలుగా మార్చేయడంలో మందకృష్ణ చాలా వరకు సక్సెస్ అయ్యారు. దళితుల బాగు కోరుకునే వ్యక్తి అగ్రకుల పార్టీలకు ఓట్లేయించడం ఏంటి? ఈయనే ఒక అసందర్భంగా దళిత నాయకత్వం ఉన్న బీఎస్పీని, బీసీ నాయకత్వం ఉన్న ఎస్పీ పార్టీలను కుల పార్టీలని తిట్టారు. అగ్రకుల పార్టీలను ఎప్పుడూ ఇలా అన్లేదు. పైగా వారికి ఓట్లేయిస్తారు. బీఎస్పీ, ఎస్పీలకు ఒక్క ఓటు కూడా వేయించలేదు. పైగా వాటిని కుల పార్టీలని తిట్టారు. అది కూడా కులంలో ఒక ఉప కుల ఉద్యమం చేసే మందకృష్ణ.
ముగింపు
ఎంఆర్పీఎస్, మందకృష్ణ గురించి ఎప్పుడు ప్రస్తావించినా మొదటగా వచ్చే ప్రశ్న.. “వర్గీకరణకు వ్యతిరేకమా? అనుకూలమా?” అని. సత్యప్రమాణపూర్తిగా అనుకూలమే. కాకపోతే.. ఎంగిలి విస్తరాకుల్లో రాలకుండా పడిపోయిన అన్నం మెతుకుల్లో కాదు.. మొత్తం అండనే ఎత్తుకెళ్లిన అగ్రకులాల నుంచి వర్గీకరణ జరగాలి. మన రాష్ట్ర సంపద 15 లక్షల కోట్లైతే.. అందులో 1,000 కోట్లకు కూడా సరిపోని ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ఏంటి? మాల-మాదిగ కలిసి పోరాటం చేసి అధికారం తెచ్చుకుని 15 లక్షల కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచే వర్గీకరణ కదా జరగాలి. ఈ ఉద్దేశాన్ని చెడగొట్టే ఏ ఉద్దేశానికి, ఏ ఉద్యమానికి అయినా వ్యతిరేకమే.