తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.
కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు. డీఎంకేను గద్దె దించేందుకు 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి సుబ్రహ్మణ్యస్వామిని వేడుకుంటానని తెలిపారు.
డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలంతా తమ ఇంటి ఎదుట డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల్లోని బాధిత మహిళలు, వారి కుటుంబాలకు బీజేపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు కూడా లేఖ రాయనున్నట్టు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించలేని పార్టీకి.. అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. తమిళనాడులో నాగరిక రాజకీయాలు తావు లేనందున.. ఇక నుంచి తన రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నామలై అన్నారు.