ఏంటీ రేవంత్ రెడ్డా.. ఏదో లక్కులో ఎంపీ అయ్యాడు కానీ, అతడికంత సీనెక్కడది? పడిపోతే నవ్వుదామని విపక్షాలు, ఎదిగితే ఓర్చుకోలేని సొంత పార్టీవారు. తప్పిద్దామని కొందరు, పడిపోయేలా కొడదామని మరికొందరు. ఇలా ఇంటా, బయటా దుర్భేధ్యమైన సవాళ్ల మధ్య రేవంత్ రెడ్డి రాజకీయం కొనసాగించాడు. కొట్టాడు.. అందరినీ కొట్టాడు. ఎదురుగా వచ్చిన శత్రువులను కొట్టాడు, వెనుక నుంచి వెన్నపోటు పొడవబోయిన మిత్రశత్రువులనూ కొట్టాడు. ఎన్నెన్ని హేళనలు చేశారో, ఎన్ని కుట్రలు పన్నారో, ఎంత అడ్డకున్నారో.. అందరినీ వరుస పెట్టి కొట్టాడు. నాయకుడికి కావాల్సింది అధిష్టానం అండదండలు కాదు, ప్రజల మద్దతు అని రుజువు చేసి చూపించాడు. అన్ని శాపనార్థాలు అధిగమించి, అజేయుడిగా నిలిచాడు. ఇప్పుడందరూ ఆయనతో వరస కలుపుతున్నారు. బహుశా ఈ రాజకీయం రేవంత్ రెడ్డికి తెలుసు కాబోలు. అందుకే ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, ప్రజా మద్దతుతో కొట్టాడు.
నిర్దేశం, హైదరాబాద్ః తెగులు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు ఆయన చేరుకున్న స్థాయిని బహుశా ఆయనైనా ఊహించి ఉండకపోవచ్చు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠమెక్కడమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే, రేవంత్ రెడ్డి రాజకీయంపై మొదటి నుంచి అనేక అవాక్కులు పేలుతూ వచ్చాయి. నిలబడలేడని, అంత సీన్ ఉండదని.. ఇలా ఏవేవో విమర్శలు, అంచనాలు వచ్చాయి. అన్నింటినీ అధిగమించారు రేవంత్. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా అలాంటి చవాక్కులే పేలారు. రేవంత్ రెడ్డి ఏడాది కూడా సీఎంగా ఉండరని బయటివారే కాదు, తన పార్టీలోని వారు కూడా చెవులు కొరికారు. కానీ, రేవంత్ మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూనే ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడైన మొదటి రెబెల్ లీడర్
రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కావడం ఒక పెద్ద ఫీట్. నిజానికి పీసీసీ చైర్ సాధించడంతోనే ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీలో సీఎం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, సీఎం, పీసీసీ అధ్యక్షుడు సమ స్థాయిలో ఉంటారు. ఇకపోతే, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో విధేయత, నాయకుల మద్దతుతో నిర్ణయిస్తారు. రెబెల్ లీడర్లకు కాంగ్రెస్ లో పదవులు సరిగా లభించవు. అలాంటిది, రేవంత్ ఏకంగా పీసీసీ చీఫ్ పదవి సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక రెబెల్ లీడర్ ఈ స్థాయిని చేరుకోవడం ఇదే మొదటిసారి. నిజానికి, రేవంత్ కు ఆ పదవి దక్కదని చాలా మంది అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు అయితే రేవంత్ కు పదవి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు కూడా. ఆ మాటకొస్తే సీనియర్లెవరూ సముఖంగా లేరు.
ముఖ్యమంత్రే కాడన్నారు
కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం మాట వేరు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి కాలేడని హేళన చేశారు. ఫలితాలు వెలువడ్డాక కూడా ఇదే తంతు. కాంగ్రెస్ అధిష్టానం బయటికి చెప్పేంత వరకు రేవంత్ రెడ్డికి కూడా తెలియదు. అందుకే ఆయన.. తనకు కాకపోతే సీతక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక సీనియర్ నేతలైతే వస్తే తమలో ఎవరికైనా రావాలి గానీ, పార్టీ మారి వచ్చిన రేవంత్ కు రావడమేంటని అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. అయిన సరే.. గాంధీ కుటుంబం రేవంత్ వైపే మొగ్గు చూపింది. ఇక ముఖ్యమంత్రి అయ్యాక కూడా.. కొద్ది రోజుల్లోనే మార్చేస్తారని, ఏడాది కూడా రేవంత్ సీఎంగా ఉండరనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఏడాది పాలన కూడా ముగింది. అప్పటితో పోలిస్తే.. ప్రస్తుతం రేవంత్ మరింత బలంగా ఉన్నారు.
రేవంత్ ఎదుగుదలలో కేసీఆర్ పాత్ర కీలకం
ఏమాటకామాటే.. రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవ్వాలి. ఎందుకంటే, రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసి ఉండకపోతే ఇంత వాడు అయ్యేవారు కాదు. ఎక్కడో కొడంగల్ కు పరిమితమైన రేవంత్ రెడ్డిని అక్కడ ఓడించి మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లేందుకు మార్గం వేశారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో రేవంత్ కు మంచి పరిచయాలు పెరిగాయి. ఇక, రేవంత్ ను జైలులో వేయడం అయితే ఆయనను తెలంగాణలో మాస్ లీడర్ గా చేసింది. అధికారంలో ఉన్న వారు ఎవరిని టార్గెట్ చేస్తే.. ప్రజల్లో వారి మీద సానుభూతి పెరుగుతుంది. ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని ఏకంగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ టార్గెట్ చేశారు. అది కూడా తీవ్ర స్థాయిలో.. దీంతో ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని అంతే తీవ్ర స్థాయిలో ఆదరించారు.
సొంత పార్టీ కుట్రలను ఎదుర్కొన్నారు
కాంగ్రెస్ పార్టీ అంటే ఠకీమని గుర్తుకు వచ్చేది సీనియారిటీ. అవును.. కాంగ్రెస్ లో పదవులు సీనియారిటినీ బట్టి వస్తాయి. అలాగే, రేవంత్ మిగతా వారిలాగ ముందు నుంచి కాంగ్రెస్ నేత కాదు. కాంగ్రెస్ కు శత్రు పార్టీ అయిన టీడీపీ నుంచి వచ్చారు. దీంతో బయటి వారి కంటే సొంత పార్టీలోనే ఎక్కువ మంది శత్రువులు తయారయ్యారు. ఇప్పుడిప్పుడు కాస్త రేవంత్ అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ, రేవంత్ సీఎం కాకముందు వరకు ఆయనకు మోకాలడ్డినవారే. నిజం చెప్పాలంటే.. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా పైరవీలు చేసినవారే. అయితే హైకమాండ్ నుంచి రేవంత్ కు అండదండలు గట్టిగా ఉండడంతో సైలెంట్ అయిపోయారు.