నిర్దేశం, స్పెషల్ డెస్క్ః 12 ఏళ్ల చిన్నారి ఆవుల్ని మేపడానికి అడవికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చుని సద్ది తింటోంది. సరిగ్గా అదే ఆవు మీద ఒక చిరుతపులి దాడి చేసింది. తిండి వదిలిపెట్టి ఆ చిన్నారి ఆవు వైపు పరిగెత్తింది. తన చేతిలో కర్రతో పులి పైన దాడి చేసింది. అంతే.. చిర్రెత్తుకొచ్చిన చిరుత పులి.. ఆవును వదిలేసి ఆ చిన్నారిపై పంజా విసిరింది. ఒకవైపు చిన్నారి అరుపులు, మరొకవైపు చిరుతపులి గాండ్రింపులు.. ఈ శబ్దాలు విన్న చుట్టుప్రక్కల వారు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. కానీ, వాళ్లు ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహించారు. చిరుతపులితో ఆ చిన్నారి ఒక్కతే పోరాడింది. తన వద్ద గల పదునైన కర్రను చిరుతపులి కంఠంలో పొడిచింది. చిరుత నేలకూలి ప్రాణాలు వదిలింది. ఆ చిన్నారి పేరు ఝల్కారీబాయి. ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది. చూడడానికి అచ్చం ఝాన్సీ లక్ష్మీ బాయిలా ఉండే ఝల్కారీ.. ఝాన్సీ సైన్యంలోనే మహిళా విభాగమైన దుర్గావాహినికి కమాండర్ గా పని చేసింది. ఆంగ్లేయులతో విరోచిత పోరాటాలు చేసిన వీరనారి ఆమె. ఆధిపత్యకుల సమాజం కారణంగా చరిత్రకు అందకుండా పోయింది బహుజన సివంగి ఝల్కారీ.
ఝాన్సీ సైన్యంలో కమాండర్ గా ఝల్కారీ
ఝల్కారీబాయి 22 నవంబర్ 1830లో ఉత్తరప్రదేశ్ రాష్టంలోని బుందేల్ ఖండ్ ఝాన్సీలోని భోజలా గ్రామంలో పుట్టింది. తల్లి దనియా, తండ్రి మాల్ చంద్ కోరి కులానికి చెందినవారు. చిన్ననాడే తల్లి చనిపోతే తండ్రి అన్నీ తానై పెంచాడు. తండ్రికి ఒక్కటే సంతానంగా ఉన్నందున అల్లారు ముద్దుగా పెంచాడు. ఝల్కారీ బాయి పశువులు కాసేందుకు అడవికి పోయేది. పన్నెండేండ్ల వయస్సులో అడివిలో పులి పశువుల మీద పడితే పశువులను కాపాడేందుకు పులితో తలపడి చంపింది. ఇంకేముంది! పన్నెండేండ్ల ఆడపిల్ల ఆడపిల్ల పులిని వేటాడి చంపిన వార్త ఆ చుట్టుపక్కల మారు మోగింది. ఈ వార్త ఝాన్సీరాణి లక్ష్మీబాయి దాకా చేరింది. ఝల్కారీ రూపురేఖలు చూసిన ఝాన్సీలక్ష్మీబాయి.. ఈమె అచ్చు తన లాగానే ఉందని ఆశ్చర్యపోయింది. ఆమెను ఎట్లయినా మహిళా సైనిక దళంలో చేర్చుకోవాలనుకున్నది. భర్త పూరన్ ప్రోత్సాహం, ఆమెకు స్వతహాగా ఉన్న ఆసక్తితో ఝల్కారీ బాయి భర్త దగ్గర గుర్రపుస్వారీ, కత్తియుద్ధం, మల్లాయుద్ధం, ఫిరంగులు పేల్చడం, బాణ విద్యలు నేర్చుకున్నది. సైనికుడైన భర్త పూరన్, ఝాన్సీరాణి లక్ష్మీబాయి ప్రోత్సాహంతో యుద్ధ నైపుణ్యాలు ఒంటబట్టించుకున్న ధీర వనిత ఝల్కారీబాయి. ఒక అంటరాని ‘కోరి’ కులం దళిత మహిళ మహిళా సైనిక దళానికి నాయకురాలుగా ఎదగడం సాధారణ విషయం కాదు. ఝల్కారీ తో పాటు బరీషన్, మోతీబాయి జూహీ, సుందర్, ముందర్, కాశీబాయి లాంటి అనేక మంది మహిళలు ఆమెను ఆదర్శంగా చేసుకొని సైన్యంలో చేరిండ్రు.
ఆంగ్లేయులను బెంబేలెత్తించింది
బ్రిటిష్ గవర్నరు జనరల్ ఆజ్ఞతో 1854లో ఝాన్సీ రాజ్యం ఆంగ్లేయుల పాలనలో కలుపబడింది. అట్లా కలుపబడిన రాజ్యాన్ని తిరిగి సాధించిన కొన్నాళ్లకే మరలా బ్రిటీష్ సైన్యాలు కోటను సమీపిస్తుంటే, వారిని పారదోలదానికి మహిళా సైన్యం యుద్ధానికి సన్నద్ధమైంది. ఝాన్సీ రాణికి రక్షణ కల్పించాలంటే ఝాన్సీ రాజ్యాన్ని కాపాడుకోవాలని ఝల్కరీ బాయి తన తోటి మహిళా సైనికురాళ్లకు చెప్పి ఉత్తేజితుల్ని చేసింది. ఆ మహిళా సైనికులు తుపాకులున్న వాళ్ళు తుపాకుల్ని పేల్చారు, లేని వాళ్లు ఇటుకల్ని విసురుతూ తెల్ల వాళ్ళ మీద దాడి చేశారు. పూరన్, ఝల్కారీబాయి బ్రిటిష్ సైనికుల్ని చిత్తు చేశారు. కానీ తెల్లవాళ్లు ఝాన్సీ కోటను చుట్టుముడుతున్నపుడు ఝాన్సీ రాణిని సురక్షిత ప్రాంతానికి పంపించే ఆలోచన చేసింది ఝల్కారీ. ఎందుకంటే రాణి రక్షణ బాధ్యత మహిళా కమాండరుగా ఝల్కారి పైనే ఎక్కువ ఉంది. ఈ ఆలోచనకు ఆమె దగ్గరి మిత్రులు, స్నేహితులు సమ్మతించారు. ఒక దిక్కు బ్రిటిష్ సైన్యాలు కోట ద్వారాలను ఆక్రమించుకుంటుంటే ఝల్కారీ, పూరన్‌లు భీకర యుద్ధంలో ఉండి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకోవైపు 1857 తిరుగుబాటు విప్లవకారుడని పుస్తకాల్లో పేరున్న తాంతియా తోపే బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించలేక పారిపోయాడు. ఝాన్సీరాణి లక్షీబాయి కూడా తన దత్త పుత్రుడిని వీపున కట్టుకొని రాత్రివేళ గుర్రంపై కూర్చొని ఝాన్సీకోటకు దండంబెట్టుకొని నమ్మకమైన సైనిక పటాలంతో ఉత్తర భారతం వైపు వెళ్లిపోయింది.
ఝాన్సీని కాపాడింది ఝల్కారీనే
ఝాన్సీ రాణి వెళ్ళిపోయేదాకా బ్రిటిషు వాళ్లను ఏమార్చడానికి, కాలయాపన వ్యూహంతో ఝల్కారి బాయి ‘చర్చలకు సిద్ధమా’ అనే వర్తమానం పంపింది. ఝాన్సీరాణి పేరుతో, ఝాన్సీ రాణి దుస్తులు ధరించి, ఝాన్సీరాణి రూపురేఖలున్నందువల్ల బైటవారెవరూ గుర్తు బట్టలేదు. తానే ఝాన్సీరాణి అని బ్రిటిష్ వాళ్ళతో తలపడింది ఝల్కారీబాయి. ఆ యుద్ధంలో ఝల్కారీ భర్త పూరన్ వీర మరణం పొందాడు. ఝల్కారీ కత్తి విసుర్లకు, చతురతకు ఆంగ్లేయులు బెంబేలెత్తిపోయారు. ఆమె వందలాది ఆంగ్లేయులను కత్తికో కండగా చంపేసింది. హఠాత్తుగా ఆమె గుండెల్లో ఒక దొంగ దెబ్బ దిగితే, కిందపడే లోపే ఆమె శరీరం తూటాల జల్లెడ అయింది. ఒక వీరనారిగా అమరత్వం చెందింది.
దేశానికి ఆదర్శం ఝల్కారీ
భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మహిళా యోధురాలిగా ఝల్కారీబాయి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన స్ఫూర్తి బుందేల్ ఖండ్ దళిత సమాజానికే కాదు, దేశంలోని మహిళా సమాజానికే గొప్ప గౌరవం. ఝాన్సీరాణి ఒక మగధీరుడిలాగా బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందినదని అనేక సాహిత్యాలు, చరిత్రలు వచ్చినాయి. ఆ అబద్ధపు చరిత్రను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఝుల్కారీ బాయి చరిత్ర దేశమంతా ఝాన్సీలక్మీ బాయి చరిత్రలాగా విస్తరించకపోవడం కూడా వివక్షే. కానీ ఝల్కారీ వీరత్వాన్ని చూసిన బ్రిటిష్ గవర్నరు జనరల్ ఒకరు భారత మహిళల్లో ఒక్క శాతమైనా ఝల్కారిబాయిలా పొరాడి ఉంటే తాము ఎప్పుడో పారోపోవాల్సి వచ్చేదని జూన్ 4, 1858 లో డైరీలో రాసుకున్నాడు. ఆమె దేశభక్తి, శక్తియుక్తులు దేశానికి, మహిళలకు ఎంత ఆదర్శమో తెలుస్తోంది కదా.
వెనుకబడిన కులాల మహిళలు చరిత్రలో లేరు
అయితే ఇప్పటివరకు దొరికిన ఆ కాలం నాటి చారిత్రక పత్రాల్లో ఝల్కారీ బాయి పేరు కనిపించడం లేదు. అయితే అట్టడుగు వర్గాలకు చరిత్రలో స్థానం ఎప్పుడు లభించిందన్నది ప్రశ్న. వీరిలో అణగారిన వర్గాలు, మహిళలు కూడా ఉన్నారు. ఝల్కారీ బాయి ఈ రెండు కేటగిరీలు చెందిన వ్యక్తి. ‘ఝల్కారీ బాయిసకి మీద నవల రాసిన రచయిత మోహన్‌దాస్ నైమిశ్రాయ్ ఒక సందర్భంలో స్పందిస్తూ.. “చరిత్ర పుస్తకాల్లో, వార్తా పత్రిల్లో అణగారిన కులాల పోరాటాలు, విజయగాధలు లేవు. అప్పట్లో ఝల్కారీ బాయి దళిత మహిళ. అందుకే ఆమెను తమ రచనల్లోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని బ్రిటీష్ వారు కూడా గ్రహించారు. అందుకే బ్రిటిష్ వారు కూడా అలాగే వ్యవహరించారు” అని అన్నారు.
(నేడు బహుజన వీరనారి ఝల్కారీ బాయి 194వ జయంతి)
- టోనీ బెక్కల్