నిర్దేశం, హైదరాబాద్: ఉట్టికెక్కలేనమ్మ ఉగాండాకు విమానం వేసుకుని వెళ్తానన్నట్టుంది బీఆర్ఎస్ తీరు చూస్తుంటే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడి, లోక్ సభ ఎన్నికల్లో అయితే చావు దెబ్బనే తిన్న బీఆర్ఎస్.. కేంద్రంలో ఏదో చేస్తుందని కేటీఆర్ ఆశపడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన అంటున్నారు. అంటే, దీన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంలో చక్రం తిప్పాలని ఆయన అనుకుంటున్నారు కాబోలు. చాలా చిత్రం కదా.. సొంత రాష్ట్రంలో అవమానం నుంచి అధికారం కోసం ప్రయత్నిస్తున్న పార్టీ.. నాలుగేళ్ల తర్వాత జరిగే కేంద్ర ఎన్నికలపై గట్టి జోస్యమే చెప్తోంది.
తాజాగా హర్యానా ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో కొన్ని విషయాలు తెలిశాయని కేటీఆర్ అన్నారు. 2029 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ రెండూ కూడా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగానే ఆగుతాయని జోస్యం చెబుతున్నారు. అలా జరిగితే.. భారాస సారథిగా తాను కేంద్రంలో చక్రం తిప్పగలనని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు. నిజానికి ఆ రాష్ట్రంలో గెలిచిన, ఓడిన రెండు పార్టీలతోనూ ఆయనకు వైరమే ఉంది. అంత మాత్రం దానికి ఇంత నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ఏంటో?
తొందర పడిన కోయిల ముందే కూసినట్టుగా ఇంకా నాలుగున్నరేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెబుతున్నారు. ‘బాప్ 2024 కా అయితే.. బేటా 2029 కా’ అన్నట్టుగా ఉంది తండ్రీ కొడుకుల వ్యవహారం. కొంత కాలం ముందు కేసీఆర్ కూడా ఇలాగే కలలు కన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తుందని, కేంద్రంలో తమ మద్దతు కీలకమవుతుందని గులాబీ బాస్ అంచనా వేశారు. అనుకున్నదే తడవుగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చేశారు. ఇక గులాబీ నేతలైతే ‘సారు, కారు, కేంద్రంలో సర్కారు’ అంటూ ఊగిపోయారు.
కానీ గులాబీ పార్టీ బొక్కబోర్లా పడింది. అసెంబ్లీలో దారుణమైన పతనం తర్వాత భారత రాష్ట్ర సమితికి ఆ పేరు మాత్రమే మిగిలింది. సరిగ్గా చెప్పాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ పరువు మూసీలో కొట్టుకుపోయింది. తెలంగాణ అనే పదాన్ని పేరులో తొలగించడమే రాష్ట్రంలో శాపంగా మారిందని అన్నవారూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీని గట్టిగా కాపాడుకోవడం మీదనే నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇంత కష్టాల్లో ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చి ఇంకేదైనా చెబితే బాగుంటుంది.