నిర్దేశం, తిరుపతి: పొలిటికల్ కాంట్రవర్సీలకు సినిమావాళ్లు దూరంగా ఉంటారు. చాలా సందర్భాల్లో పొలిటికల్ కాంట్రవర్సీల గురించి సినిమావాళ్లను ప్రశ్నిస్తుంటారు. నో కామెంట్స్ అనో, ఒక నవ్వు విసిరో లేదంటే సెన్సిటివ్ ఇష్యూ స్పందించలేమనో సైడ్ అయిపోతుంటారు. నిజానికి.. దానిపైన వారి స్టాండ్ ఏదైనా చెప్తే, అది సరైనది కాకపోతే తప్పుపట్టడం, ట్రోల్స్ చేయడం సబబు. కానీ, నో కామెంట్స్ అని చెప్పడం తప్పేంటి? తిరుపతి లడ్డూను వివాదం చేసింది అక్షరాలా ఆంధ్రా ప్రభుత్వమే. ప్రస్తుతం ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ గా ఉంది కాబట్టి, ఇప్పుడు దానిపై స్పందించొద్దని నటుడు కార్తీ అనడం అతడి సరైనదే.
ఒకటి తను ఈ రాష్ట్రంవాడు కాదు, రెండోది రాజకీయ నాయకుడు కాదు, మూడోది ముఖ్యమైంది.. ఈ వివాదంలో తను దూరాలని అనుకోవడం లేదు. ఇది ప్రతి వ్యక్తికి ఉండే స్వేచ్ఛ, తన వ్యక్తిగతం. నిజానికి కార్తీ చాలా హుందాగా స్పందించారు. కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణే దీనిపై అతి చేశారు. ఎలాంటి కామెంట్ చేయనని చెప్పడం జోక్ చేయడం ఎలా అవుతుంది? పవన్ కు ఓ స్టాండ్ ఉంది కాబట్టి, మిగతావారందరూ ఆ కాంట్రవర్సీలో దూరాలా? జగన్ ను అందరూ తిట్టిపోయాలని పవన్ అనుకుంటున్నారా? తన వ్యక్తిగత రాజకీయాన్ని ఇతరులకు రుద్దాలనుకోవడం, తనకు సపోర్ట్ చేయలేదు కాబట్టి, వారిని దూషించడం, వారి మాటల్నీ వక్రీకరించడం ఏంటి?
నిన్నటి వరకు లడ్డూ వివాదంలో పవన్ తీరుపై పెద్దగా నెగిటివ్ అయితే రాలేదు కానీ, కార్తీ మీద పవన్ స్పందించిన తీరుతో ఒక్కసారిగా విమర్శలు వస్తున్నాయి. అసందర్భపు ప్రేలాపణలతో లడ్డూ వివాదాన్ని పవన్ కల్యాణే ఒక జోకుగా మార్చేస్తున్నారని నిన్నటి వరకు ఆయనను సపోర్ట్ చేసిన వారే పెదవి విరుస్తున్నారు. పవన్ తీరు వల్ల అసలు విషయమే పక్కదారి పట్టిందని అంటున్నారు. ఇక విమర్శకులకు ఇది మంచి అవకాశం అయింది. సెటైర్ వేయడానికి కాస్త బెరుకుగా ఉన్నవారంతా ఇప్పుడు నిశ్చింతగా ట్రోల్స్ వేస్తున్నారు.
లడ్డూలో కొవ్వు కలిసిందే అనుకుందాం. దానికి మీడియా ముందు హడావుడి చేయడం, ఊరికే ఎమోషనల్ కావడం, ఇష్టారీతిన తిట్టడం ఏంటి? తానొక ప్రజాప్రతినిధినని, రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రినని పవన్ కల్యాణ్ కు అసలు గుర్తుందా? అధికారం అంతా తన చేతిలోనే ఉంది. ఆదేశాలిస్తే రెండు రోజుల్లో విచారణ పూర్తై, నింధితులకు శిక్ష కూడా పడుతుంది. మరి, విచారణకు పోకుండా తనదైన సినిమాటిక్ స్టైల్లో పవన్ ఊకదంపుడు ప్రేలాపణలు చేయడం దేనికి? కొన్ని సంవత్సాల హేళన తర్వాత పవన్ రాజకీయంగా సక్సెస్ అయ్యారు. కానీ, అంతలోనే మళ్లీ అదే హేళనను కొని తెచ్చుకుంటున్నారు.