నిర్దేశం, హైదరాబాద్: హైస్పీడ్ రైళ్లు ప్రపంచానికి వరమనే చెప్పాలి. హై స్పీడ్ రైళ్లు సాధారణంగా విమాన ప్రయాణం కంటే చాలా పొదుపుగా ఉంటాయి. సుదూర ప్రయాణాలను రైళ్లు సురక్షితంగా, తక్కువ ఖర్చులో తీసుకెళ్తాయి. రోజురోజుకీ హైస్పీడ్ రైళ్ల వేగం పెరుగుతోంది. అనేక దేశాల్లో కొత్త హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. హై-స్పీడ్ రైలు రవాణా వ్యవస్థలలో యూరప్, చైనా ముందంజలో ఉన్నాయి. యూరప్ లోని అనేక దేశాల్లో హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌లు అభివృద్ధి అయ్యాయి.
ఇక మిడిల్ ఈస్ట్, అమెరికాలో కూడా హై స్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టుటు నిర్మాణంలో ఉన్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రెజిల్ వంటి పెద్ద దేశాలు కూడా హైస్పీడ్ రైళ్లను నడపాలని యోచిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద హైస్పీడ్ రైలు నెట్వర్క్ చైనాలో ఉంది. చైనాలో 40,000 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు నెట్వర్క్ ఉంది. ఇది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద నెట్వర్క్ కంటే పది రెట్లు పెద్దది.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఎక్కడ నడుస్తుంది?
స్టాటిస్టా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లు చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌లో నడుస్తాయి. ఇక్కడ రైళ్లు గంటకు 320 కిలోమీటర్లు నుంచి 460 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఆసియాలోని అనేక దేశాల్లో హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. ఇటీవల ఇండోనేషియాలో కొత్త హైస్పీడ్ రైలు కూడా ప్రారంభమైంది. ఈ రైలు జకార్తా, బాండుంగ్ మధ్య నడుస్తోంది. ఈ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అయితే, అమెరికాలో హైస్పీడ్ రైళ్ల వేగం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. కొన్ని హైస్పీడ్ రైళ్లు అమెరికాలో నడుస్తున్నాయి. అయితే వాటి వేగం గంటకు 200 కిలోమీటర్లకు మించడం లేదు. వాషింగ్టన్ డీసీ నుంచి బోస్టన్ మధ్య నడిచే రైళ్లు గంటకు 241 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.
హై స్పీడ్ రైళ్లను నిర్మించే ప్రణాళికలు
ఇరాక్‌లో హైస్పీడ్ రైలును నిర్మిస్తున్నారు. ఈ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇరాన్లో కూడా హైస్పీడ్ రైలును నిర్మిస్తున్నారు. ఈ రైలు టెహ్రాన్ నుండి ఇస్ఫాహాన్ మధ్య గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మెక్సికో కూడా హై స్పీడ్ రైలును నడపాలని యోచిస్తోంది. ఈ రైలు మెక్సికో సిటీ నుండి క్వెరెటారో రాష్ట్రానికి మధ్య గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
బాల్టిక్ రైలు ప్రాజెక్ట్
బాల్టిక్ దేశాలైన లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియాలో కూడా హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఈ మూడు దేశాలను యూరప్ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడం. ఇందుకోసం రష్యాలోని రైల్వే ట్రాక్‌ల వెడల్పును యూరప్‌లోని రైల్వే ట్రాక్‌ల వెడల్పుకు అనుగుణంగా మారుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం యూరోపియన్ యూనియన్ నిధులు ఇస్తోంది. పోర్చుగల్, చెక్ రిపబ్లిక్లలో రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కూడా డబ్బు ఇస్తోంది.
భారతదేశంలో హైస్పీడ్ రైలు ఉందా?
భారతదేశంలో కూడా హై స్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే వాటి వేగం ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాలలో నడుస్తున్న హైస్పీడ్ రైళ్లంత వేగంగా లేదు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలుగా పేరొందింది. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడిన ఆధునిక రైలు. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఇది కాకుండా, మన దేశంలోని ఇతర హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటిలో ముంబై-సబర్మతి మధ్య ప్రతిపాదించిన దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రముఖమైనది. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లో చేరుతుంది. ఈ రైలు మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో 8 గుజరాత్లో 4 మహారాష్ట్రలో ఉన్నాయి.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రత్యేకత
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం, ఈ రైల్వే లైన్లో 92% వంతెనలు, వయాడక్ట్‌లపై (ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌లు) ఉంటుంది. మొత్తం 508.09 కి.మీలలో 460.3 కి.మీ వయాడక్ట్‌లపై, 9.22 కి.మీ వంతెనలపై, 25.87 కి.మీ సొరంగాలపై (7 కి.మీ పొడవైన సముద్ర సొరంగంతో సహా) మరియు 12.9 కి.మీ ఆనకట్టలు లేదా కట్టలపై ఉంటాయి. ఎలివేటెడ్ ట్రాక్‌ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వరదల అడ్డంకి ఉండదు.