నిర్దేశం, హైదరాబాద్: ఫ్రెండ్ కి క్లోజ్ ఫ్రెండ్ కి చాలా తేడా ఉంటారు. సందర్భాన్ని బట్టి కలిసేవారు ఫ్రెండ్. ఏ సందర్భంలోనైనా తోడుండే వారు క్లోజ్ ఫ్రెండ్. జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పుకోవడం దగ్గరి నుంచి చిల్ అవ్వడం వరకు.. మంచి, చెడు అన్నింటినీ షేర్ చేసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే.. క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఉండే బంధం సోడాకు విస్కీకి మధయ ఉండే బాండింగ్ లా ఉంటుంది. బహుశా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. అయితే బెస్ట్ ఫ్రెండ్ లో ఆపోసిట్ జెండర్ ఉండడం.. అంటే మగవారికి ఆడ బెస్ట్ ఫ్రెండ్, ఆడవారికి మగ బెస్ట్ ఫ్రెండ్ కొంచెం రేర్ గా ఉంటారు. అయితే, ఒక్కోసారి వీరి స్నేహం.. ప్రేమ పట్టాలెక్కొచ్చు. కానీ, చెప్పడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవతలి వారికి అనుమానంగా అనిపించినప్పటికీ అడగడానికి మొహమాట పడుతుంటారు. అందుకే.. అలాంటి ప్రేమను అడక్కుండా.. కొన్ని సంకేతాల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ టైం మీతోనే గడుపుతారు
మీ బెస్ట్ ఫ్రెండ్ మీతో అవసరానికి మించి ఎక్కువ సమయం గడిపినట్లైతే, బహుశా వారు మీ పట్ల ప్రత్యేకమైన ఆసక్తితో ఉండొచ్చు. అది ప్రేమై ఉంటుందనేది లవ్ గురూల మాట. వారు ఎల్లప్పుడూ మీతోనో మీ చుట్టూనో ఉండటానికి ప్రయత్నిస్తారు. వారికి వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వారిలో ఏమైనా ఆందోళన ఉన్నా.. అవన్నీ పక్కన పెట్టి ఎల్లప్పుడూ మీతోనే ఉండటానికి ప్రయత్నిస్తారు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే, వారు కూడా వస్తామని అడుగుతారు. కొన్నిసార్లు చెప్పాపెట్టకుండా వచ్చేస్తారు.
రొమాంటిక్‌గా మాట్లాడతారు
మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు కొంచెం దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే, వారు మీతో ప్రేమలో పడటం ప్రారంభించారని అర్థం చేసుకోండి. వారు మీతో ప్రేమగా మాట్లాడటం లేదా లవ్ కపుల్స్ కు సంబంధించి ఏదైనా మాట్లాడుతుంటారు. వారు వేరొకరితో వెళితే మీకు ఎలా అనిపిస్తుంది? లాంటి విషయాలు వారు మిమ్మల్ని అడగవచ్చు లేదా మీ జీవితానికి మీకు ఎలాంటి భాగస్వామి కావాలని అడగవచ్చు. చాలా సార్లు వారు మిమ్మల్ని ప్రేమగా భర్త లేదా భార్య అని కూడా సంబోధిస్తారు.
అసూయతో రగిలిపోతారు
స్నేహంలో ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే అసూయ ఉంటుంది. అవసరమైన సమయంలో మీ ఫ్రెండ్ తో కాకుండా వేరొకరితో ఉన్నట్లైతే వారు అసూయతో రగిలిపోతుంటారు. అది ప్రేమగా మారితే ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది చాలా సహజం. మిమ్మల్ని నిజంగా ప్రేమించినట్లైతే.. మీతో ఆపోసిట్ జెండర్ ను చూడడానికి అస్సలు ఇష్టపడరు. అంతే కాదు, ఇంకెవరి గురించైనా గొప్పగా చెప్పినా అస్సలు నచ్చదు.