నిర్దేశం, హైదరాబాద్ః రాజకీయ క్రీడలో ఆరుతేరిన ఆటగాడు కేసీఆర్ అనడంలో అభ్యంతరం అక్కర్లేదు. మాట మార్చడంలో, ప్రజలను ఏమార్చడంలో కేసీఆర్ కు తిరుగులేదు. కానీ, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. గోట్స్ బఫెల్లోస్.. బఫెల్లోస్ గోట్స్ అవుతుంటాయి. కేసీఆర్ కూ అదే జరిగింది. నాఅంత లేరంటూ నియంతకు పోయారు. చివరికి ఫాంహౌజ్ లో పడకేయాల్సి వచ్చింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఫాంహౌజ్ లోనే ఉన్నారనుకోండి, అది వేరే విషయం.
చవితి తర్వాత ప్రజల్లోనే
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి గుంబనంగా ఉండిపోయిన గులాబీ బాస్.. ఎట్టకేలకు గుహ (ఫాంహైజ్)ను వీడి బయటకి వస్తున్నారు. వినాయక చవితి ముగియగానే బరిలోకి దిగుతారట. ఈ నెల 10న గానీ 11న గానీ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు గులాబీ దళం చెబుతోంది. అతికిపోయి అసెంబ్లీ చతికిలబడ్డారు. అనంతరం లోక్ సభ ఎన్నికల్లో అయితే మరీ దారుణం. గులాబీ చెట్టుకు పువ్వు కాదు కదా.. ఒక్క మొగ్గ కూడా మొలవలేదు. సగానికి పైగా స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు. ఇక ఆలస్యం చేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ చెట్టుకు ఉన్న ఆకులు కూడా మిగలవని అర్థమైపోయినట్టుంది. అందుకే ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్సై పోయారు.
కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఇంతకు ముందు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం నేతలందరితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి నాయకుల లిస్ట్ కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది. పాత సీసాలో కొత్త సారా నింపినట్టు.. రెండు ఎన్నికల్లో బొక్కబోర్లా పడి తీవ్ర నిరాశలో ఉన్న కేడర్ లో ఉత్సహాన్ని నింపి, ఉద్యమ సమయంలో ఉన్న ఊపును తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని అంటున్నారు. తెలంగాణ గ్రౌండ్ లో కేసీఆర్ మరోసారి కూత పెట్టబోతున్నారని, ఇక ప్రత్యర్థులకు చుక్కలేనని గులాబీ కేడర్ గుసగుసలాడుతోంది.
విమర్శలకు చెక్
ప్రజా సమస్యల గురించి కేసీఆర్ బయటికి రావడం లేదనే విమర్శలు బాగానే ఉన్నాయి. ఈ విమర్శలను పట్టించుకుంటే కేసీఆర్ అని ఎందుకు అంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి. కానీ, కేసీఆర్ బయటకి రాలేదు. కానీ, కాలం ఎప్పుడూ ఒకే తీరున ఉండదు కదా.. అల్లుడు, కొడుకు రోజూ హల్ చల్ చేస్తున్నా.. చర్చంతా కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. పార్టీకి ఇది పెద్ద విపత్తులా మారింది. ఆ ఇరు నేతల మధ్య సఖ్యత లేదనే కారణాలతో.. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర మద్దతు కరువైంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. వీటితో పాటు తనపై వచ్చే విమర్శలకూ చెక్ పెట్టి, తాను ఉట్టి నేత కాదు, ఉద్యమ నేతని చెప్పేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు.
రేవంత్ నోటికి పని దొరికినట్టే
కేసీఆర్ బయటికి వస్తున్నారంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి నిండా పని దొరికినట్లే. నిజానికి కేసీఆర్ ను మాటలతో ఎదుర్కునే నేత రేవంతే. బహుశా.. ఈ ఇద్దరి తీరు ఒకటి కాకపోయినా, నోరైతే ఒకటే. ఈ ఇద్దరూ ఇప్పుడు పక్షనేత, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే, కేసీఆర్ బయటికి రాకపోవడం వల్ల రేవంత్ నోటికి అంతగా పని దొరకడం లేదు. హరీష్,కేటీఆర్ లాంటి వారితో రేవంత్ కు మ్యాచ్ కావడం లేదు. అదే కేసీఆర్ బయటికి వస్తే.. ఇద్దరి మాటాల తూటాలతో రాజకీయం రసవత్తరంగా మారుతుంది.