నిర్దేశం, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఐదు నెలలుగా జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కవిత తరపు వాదనలు
కవిత ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్నారని.. సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు. ఈ కేసులో రూ. 100 కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమేనని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు. కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని.. ఈ కేసులో ఆమె ఎవరినీ బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని.. ఒక్కొక్కరు ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. నిందితులంతా అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారన్నారు. ఈడీ వాదనలపై రోహత్గీ అభ్యంతరం చెప్పారు. ఈడీ చెబుతున్న అప్రూవర్ సాక్ష్యాలను కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లోనూ చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందన్నారు.
వాడీవేడి వాదనలు
సాక్ష్యులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఏ కేసూ దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్గీ తెలిపారు. ‘కవిత నిరక్షరాస్యులు కాదు. ఏది మంచి, ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్ అరుణ్ పిళ్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు ?’ అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరుఫు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ‘అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు?’ అని ఈడీ తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ‘అవును. ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు’ అని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు.