నిర్దేశం, హైదరాబాద్: అన్ని మతాల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించేందుకు మన హైదరాబాద్ లోని ఒక మసీదు కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని మహిళలు సహా మతాల వారికి మసీదులో ప్రవేశం కల్పించనున్నారు. ఆ మసీదే బంజారాహిల్స్ లోని రోడ్ నెం.10లో ఉన్న మస్జిద్-ఎ-మదీనా. నిజానికి, గతంలోనే ‘విజిట్ మై మసీద్’ అనే పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. మస్జిద్-ఎ-మదీనాకు చెందిన మొహ్సిన్ అలీ మాట్లాడుతూ, ‘అన్ని మతాల ప్రజలను మసీదుకు స్వాగతించాలని, వారికి ఇస్లామిక్ సంస్కృతి, మతపరమైన పద్ధతులు, విశ్వాసాలను తెలియజేయమని మేము పౌరులను ప్రోత్సహిస్తున్నాము’ అని చెప్పారు.
‘‘విజిట్ మై మసీదు’ కాన్సెప్ట్ వల్ల పౌరులందరూ ముస్లింలు, వారి విశ్వాస వ్యవస్థ గురించి మరింత తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది జాతీయ సమగ్రతను ప్రోత్సహిస్తుంది. ఇది పరిసరాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత, సామరస్యాన్ని అనుమతిస్తుంది. ఇది ఐక్యతకు, స్నేహానికి సంబంధించిన వేడుక’’ అని మొహ్సిన్ అలీ చెప్పారు. విద్యావేత్త జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. సందర్శకులకు ఇస్లాం అలాగే ముస్లింల గురించి అనేక ప్రశ్నలకు సమాధానమివ్వడమే కాకుండా, స్వాతంత్ర్య ఉద్యమంలో అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీ సహకారం ఏంటని తెలుసుకోవచ్చని అన్నారు.
ఆగస్ట్ 15 ఎందుకు?
వాస్తవానికి, ఆగస్టు 15 రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 1857లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో చారిత్రక మక్కా మసీదు ముఖ్యమైన పాత్ర పోషించింది. హైదరాబాద్‌లోని మక్కా మసీదుకు చెందిన మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్‌తో కలిసి కోటిలోని ఆయన ఇంటిని కేంద్రంగా చేసుకుని సాయుధ తిరుగుబాటుకు చేశారు. ఇక్కడి నుంచే బ్రిటిష్ బలగాలపై దాడులు చేశారు. అయితే, తుర్రేబాజ్ ఖాన్ ను బ్రిటిష్ సైన్యం బంధించి హైదరాబాద్‌లోని దీపస్తంభానికి ఉరి వేయగా, మౌల్వీ అల్లావుద్దీన్‌ను అండమాన్-నికోబార్ దీవుల్లో ఉన్న జైలులో వేశారు. ఆయన రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఉన్నారు.
మస్జిద్-ఎ-మదీనాకు చెందిన మొహసిన్ అలీ మాట్లాడుతూ నిజాం హయాంలో హైదరాబాద్ సంస్థానం బ్రిటిష్ వారికి మిత్రదేశంగా ఉన్నప్పటికీ, చాలా మంది మత పెద్దలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. నిజానికి ఒక వైపు నిజాం, మరొక వైపు బ్రిటిషర్లతో కూడా పోరాటం చేశామని అన్నారు. సామాజిక కార్యకర్త మునవ్వర్ హుస్సేన్ మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘విజిట్ మై మసీదు’ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, వివిధ మతాలకు చెందిన వారు మసీదు, ఇస్లాం, ముస్లింలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారని అన్నారు. నగరంలో అపోహలు తొలగించి సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయని ఆయన అన్నారు.