నిర్దేశం, హైదరాబాద్: మనువాద పార్టీలకు ఓట్లేసే మాదిగలు గాంధీ వారసులని, అంబేద్కర్ వ్యతిరేకులేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ లో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సుదీర్ఘ వ్యాఖ్య చేశారు. వర్గీకరణపై ఆయన మాటల్లోనే
‘‘ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ మహిళల మీద అత్యాచారం చేసిన అగ్రకుల,ఆధిపత్య పార్టీలకు గడిచిన 75 ఏళ్లుగా మాదిగలు ఓట్లు వేసి గెలిపించారు. భవిష్యత్తులో గెలిపిస్తారు. కానీ రాజ్యాధికారం అందుకోలేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీ కులాలు రాజకీయంగా ఏకమై అధికారం సాధించాలనే ఏకైక లక్ష్యం కలిగిన బీఎస్పీకి మాత్రం ఈ జాతులు ఓట్లు వెయ్యరు? ఎందుకు?
బీఎస్పీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు లాభం జరుగకపోవచ్చు. కానీ ఎస్సీ వర్గీకరణను ఆపే ప్రయత్నం బీఎస్పీ ఎన్నడు చేయలేదు. ఆ శక్తి బీఎస్పీకి లేదు. ఈ విషయం మనకందరికీ తెలియనిది కాదు. మనువాద పార్టీలకు ఓట్లు వేసే మాదిగలు గాంధీ వారసులు. అంబేద్కర్ వ్యతిరేకులే! ఇందులో ఎటువంటి అనుమానం లేదు.
ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలు, మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగాల్లో ఎక్కువగా లాభం పొందవచ్చు. అది గతంలో నిరూపించబడింది. కానీ ఎస్సీ వర్గీకరణను బీఎస్పీ ఎన్నడూ పార్లమెంట్ వేదికగా వ్యతిరేకించలేదు కదా? ఈ విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక్క విషయం చెప్పండి… ఎస్సీ రిజర్వేషన్ లో గెలిచిన రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు మన జాతి యువతులను, మహిళలను అత్యాచారం చేస్తే ఎన్నడైనా ఎస్సీ నాయకులు పోరాటం చేయంగ చూసారా? భవిష్యత్ లో కూడా వీరు చెయ్యరని నా అభిప్రాయం.
సామాజిక ఉద్యమకారుడు మంద కృష్ణ మాదిగపై అగ్ర కులాలు దాడి చేస్తే.. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా అగ్రకుల పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన రాజకీయ బానిసలు మంద కృష్ణకు మద్దతుగా యుద్ధం చేయలేరు కదా! ఇది నాడు కేసీఆర్ అహంకారపూరితంగా మంద కృష్ణన్నను జైలుకు పంపినప్పుడు నిరూపణ జరిగింది కదా! నాడు గెలిచిన మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు మందకృష్ణ మాదిగ మద్దతుగా ఎందుకు రాజకీయ పోరాటం చేయలేదు? మందకృష్ణ మాదిగకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? నాడు ఎక్కడున్నారు వారందరు? ఎవరి పంచన చేరారు అప్పుడు? ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఆధిపత్య కుల పార్టీల్లో గెలిచిన వీరందరూ స్వార్ధపరులని తేలింది కదా? అయినా మంద కృష్ణ మాదిగ అన్న పోరాటాన్ని ఏనాడైనా ఆపరా? ఇప్పుడు కృష్ణ మాదిగ అన్న పొగిడే చాలామంది మాదిగ రాజకీయ నాయకులు గతంలో మంద కృష్ణను విమర్చించిన వాళ్ళే! ఈ విషయాలు తెలుగు ప్రజలకు తెలియంది కాదు.
కావున, దళిత జాతి రాజకీయ బానిసలు (అందరూ కాదు) అగ్రకుల పార్టీలో రాజకీయంగా లాభ పడ్డారని భావిస్తాము. కానీ ఎన్నడూ బాధపడం. మీరు సక్సెస్ అయ్యితే ఈ జాతిలో ఉన్న వ్యక్తులతోపాటు మరికొంత మంది బాగుపడతారని విశ్వసిస్తాము. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఈ జాతి ప్రజలే అత్యధికంగా అభివృద్ధి చెందుతారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కనుక మీరు ఈ జాతిలోని వ్యక్తులను రాజకీయ రణరంగంలో ఓట్లేసి గెలిపించడానికి ప్రయత్నించండి. మేము కూడా అంతే స్థాయిలో ఈ జాతిని గెలిపించడానికి ప్రయత్నిస్తాం. ప్రయత్నిద్దాం.. దానికి కొంత సమయం పడుతుంది.
ఎస్సీ వర్గీకణ సాధించాడానికే ముప్పై ఏళ్ళు పడితే, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం సాధించాడానికి ఎన్ని ఏళ్లు పట్టాలి? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎస్సీ కులాలతోపాటు అన్ని కులాలు సామాజికంగా, రాజకీయంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం.ఇదే బీఎస్పీ సిద్ధాంతం. మీలో ఎవరైనా ఈ రెండు సిద్ధాంతాలు గెలవడానికి సూచనలు చేస్తే సంతోషిస్తాం’’ అని ఇబ్రాం శేఖర్ అన్నారు.