నిర్దేశం, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే. అతే కాదు.. దేశంలో అత్యంత చౌకైన ప్రయాణ వ్యవస్థ. అందుకే ఎక్కువ మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మన దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. అందుకే ప్రయాణిలకు భద్రత, సౌకర్యం కోసం రైల్వే విభాగం అనేక చర్యలు చేపడుతోంది. అందులో బీమా సదుపాయం ఒకటి. ఈ మధ్య రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో చాలా మంది ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ రైల్వే టికెట్ తీసుకునే టైంలోనే కనిపించే 45 పైసల విలువ చాలా మందికి తెలియకపోవచ్చు. అదేంటో ఓసారి తెలుసుకుందాం..
మనం ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 45 పైసల ఇన్సూరెన్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది. అది డీఫాల్ట్‌గా ఎంపిక చేసే ఉంటుంది కాబట్టి మనం దానిపై టిక్ చేయాల్సిన పని ఉండదు. కొందరు ఈ 45 పైసలు ఎందుకు వృథా అని క్యాన్సిల్ చేస్తుంటారు. ఇలా చేస్తే దురదృష్టవశాత్తు ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైనప్పుడు వచ్చే ఆర్థిక సాయానికి దూరమైనట్టే. ఈ ఇన్సూరెన్స్ కింద ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడి అంగవైకల్యం వస్తే రూ.7.5 లక్షల బీమా అందుతుంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలైనవారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు ఇస్తారు.
ఐదు ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ఎంచుకున్న వారికి టికెట్ కన్ఫిర్మ్ అయ్యాక మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు సందేశం వస్తుంది. తర్వాత నామినీ వివరాల కోసం లింక్ పంపిస్తారు. ఈ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి సంబంధిత పత్రాల్ని దగ్గర్లోని బీమా సంస్థకు సమర్పిస్తే 4 నెలల్లో ప్రయోజనం అందుతుంది. అయితే రైల్వేస్టేషన్ కౌంటర్‌లో టికెట్ తీసుకుంటే ఈ బీమా వర్తించదు.